Amit Shah: జమ్ముకశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా ఫోకస్.. టెర్రరిస్టులకు చెక్ పెట్టేందుకు..
Amit Shah to review Jammu Kashmir security: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు
Amit Shah to review Jammu Kashmir security: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెలిసిందే. దీంతోపాటు సరిహద్దుల్లో భద్రత, పర్యాటక అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్‌తో ఉగ్రమూకలకు చెక్ పెట్టేలా ప్రణాళికలను సైతం రూపొందించి పక్కగా అమలుచేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో భద్రత, తీవ్రవాద నిరోధక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఆర్‌పీఎఫ్ 83 వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో రెండో రోజు పర్యటించి మాట్లాడారు. అయితే.. నిన్న అమిత్ షా భద్రతా అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయం చేస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిరోధించేలా పలు కీలక సూచనలు చేశారు.
ఇటీవల లోయలో పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీంతోపాటు ఉగ్ర జాడలను పూర్తిగా నిర్మూలించేలా ఆపరేషన్ ను పక్కగా అమలు చేసేందుకు అమిత్ షా సూచనలు చేశారని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు ఐఇడిలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతోపాటు నియంత్రణ రేఖ వద్ద IEDలు, ఆయుధాలు లభ్యమవడం, రాడార్ వలయాన్ని దాటి సరిహద్దులో డ్రోన్‌ల కదలికలు, ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే సొరంగ మార్గాలను సైతం భద్రతా బలగాలు పసిగట్టాయి. అయితే లోయ ప్రాంతాలలో అల్లకల్లోలం సృష్టించడానికి RDX-ఆధారిత IEDలను సరిహద్దులు దాటి పంపుతున్నట్లు భద్రతా అధికారులు అమిత్ షాకు వివరించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు, ఎత్తైన పర్వత మార్గాల్లో భారీ గస్తీని దాటడానికి ప్లాన్ చేస్తున్న లాంచ్ ప్యాడ్‌ల వద్ద చొరబాటుదారులను గుర్తించినట్లు భద్రతా అధికారులు అమిత్ షాకు వివరించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, భారత సైన్యం సంయుక్తంగా గత మూడు నెలల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగినప్పటికీ.. బహవల్పూర్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు చురుకుగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్లో లష్కరే తోయిబా ఉగ్రవాద జాడలు ఉన్నట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి.
అయితే.. ఆగస్టు 15, 2021న కాబూల్‌ను తాలిబాన్ ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలోని బలగాలు.. ఆయుధాలను వదిలిపోయాయని.. అవి ఉగ్రమూకలకు అందినట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి. దీనిపై కూడా అమిత్ షాకు భద్రతా బలగాలు వివరించాయి. వాటిని ఎదుర్కొనే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి చర్చించారు. దీంతోపాటు అధికారులను రక్షణపరమైన పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
పాక్ చొరబాటుదారులు సొరంగాలను ఉపయోగించి సరిహద్దుల్లోకి రాకుండా ఎల్‌ఓసి భద్రతను ఇంకా పెంచాలని హోంమంత్రి సూచించారు. దీంతోపాటు అంతర్గత భద్రతపై కూడా అమిత్ షా అధికారులకు పలు సూచనలు చేశారు. బలగాలకు ఇంకా కావాల్సిన సదుపాయాలు, ఆయుధాలు, సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
Also Read: