AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. హక్కుల కోసం గొంతెత్తిన స్వరం.. భీమ్‌రావ్ అంబేద్కర్

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్.

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. హక్కుల కోసం గొంతెత్తిన స్వరం.. భీమ్‌రావ్ అంబేద్కర్
Ambedkar Jayanti 2022
Shaik Madar Saheb
|

Updated on: Apr 14, 2022 | 7:16 AM

Share

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ రోజు ఆయన 131వ జయంతి. 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో తల్లిదండ్రులు.. రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్‌లకు జన్మించారు. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలన్నా.. మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, మతమార్పిడి, బౌద్ధమతం, హిందూమతంలోని చిక్కుముడులు, ఆర్థిక సంస్కరణలు-దళితులు, భారతదేశ చరిత్ర, మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంపదగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.

బాబాసాహెబ్ ప్రత్యేకతలు – దక్కిన గౌరవాలు:

బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు. ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు. లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phdని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి అంబేద్కర్‌.

అంబేద్కర్‌ విద్యాభ్యాసం:

► బీ.ఏ (బాంబే విశ్వవిద్యాలయం, 1912) ► ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915) ► ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921) ► డీఎస్‌సీ ( లండన్ విశ్వవిద్యాలయం, 1923) ► బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923) ► పీహెచ్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927) ► ఎల్‌ఎల్‌డీ( కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా) ► డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవ పట్టా)

కుటుంబ నేపథ్యం:

మరాఠీ నేపథ్యం కల అంబేద్కర్‌ కుటుంబం మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివాసం ఉండేది. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. తండ్రి రాంజీ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారు. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడ్డారు. మిగిలినవారు.. ఇద్దరు అక్కలు – మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన చిన్నతంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్ .. పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. నీళ్ళు తాగాలంటే ప్యూన్ మాత్రమే వచ్చి ఇచ్చే పరిస్థితి. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పూర్తి చేశారు. విదేశాల్లో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన అంబేద్కర్‌. 1915లో ఎం.ఏ, 1916లో పీహెచ్‌డీ డిగ్రీలను పొందిన అంబేద్కర్‌… 1917లో స్వదేశం వచ్చాక మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శి గా నియామకం అయ్యారు.

అంబేద్కర్ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి..

ఇక అంబేద్కర్ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం.. స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పగించిన నెహ్రూ.. ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్యయనం చేసి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో విజయం సాధించారు. తరతరాలుగా బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్. వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్.. వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించారు.

హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబరు 14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్.. తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఏ వీసా’లో రాసుకున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు అంబేద్కర్‌. దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. 1990 లో అత్యున్నత భారత రత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది.

Also Read:

Ambedkar Jayanti 2022: నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన చేసిన ఈ 7 పనులకి అందరూ సెల్యూట్‌ చేయాల్సిందే..!

Bomb in Train: రైలులో బాంబు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు.. యువకుడి సమధానంతో పోలీసులకు షాక్