AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra: కశ్మీర్ లోయలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

Amarnath Yatra News: హిమాలయాల్లో అత్యంత ఎత్తు మీద ఉన్న గుహలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ఏటా లక్షలాది భక్తులు తరలివెళ్తుంటారు. ఇతర యాత్రల కంటే ఈ యాత్ర మరింత క్లిష్టంగా ఉంటుంది. పహల్‌గాం వైపు నుంచి యాత్ర ప్రారంభిస్తే గుహను చేరుకోడానికి రెండ్రోజులు పడుతుంది.

Amarnath Yatra: కశ్మీర్ లోయలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..
Amarnath Yatra 2023 (File Photo)
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 07, 2023 | 3:29 PM

Share

Kashmir News: క్షణాల వ్యవధిలో మారిపోయే వాతావరణం.. మెరుపును మించిన వేగంతో దూసుకొచ్చే వరద ప్రవాహం.. ఎటునుంచైనా జారిపడే కొండచరియలు.. పర్వతం అంచున ప్రయాణం… హిమాలయ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్లే భక్తులు, యాత్రికులకు ఇది నిత్యకృత్యం. హిందూ మత విశ్వాసాల్లో ఎత్తుకు తగ్గట్టే హిమాలయాలకు అగ్రస్థానం ఉంది. సాక్షాత్తూ ఆ పరమశివుడే కొలువైన కైలాసంగా హిమాలయ పర్వత శ్రేణులను కొలుస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్, కైలాస్ శిఖరం, మానస సరోవర్ సరస్సు సహా పరమ శివుడి ఆలయాలు అనేకం హిమాలయ శిఖరాల్లో కొలువై ఉన్నాయి. ఒక్క శివుడే కాదు, బద్రీనాథ్‌లో విష్ణుమూర్తి, జ్వాలాముఖి, వైష్ణోదేవి క్షేత్రాల్లో అమ్మవారు, యమునోత్రి, గంగోత్రి వంటి పుణ్య నదుల జన్మస్థానాలను కూడా భక్తులు సందర్శిస్తుంటారు. ఇప్పటికీ అనేక ఆలయాలను చేరుకోడానికి నేరుగా రహదారి సదుపాయం లేదు. ఈ పరిస్థితుల్లో భక్తులు అత్యంత క్లిష్టమైన ట్రెక్కింగ్ ద్వారానే కేదార్‌నాథ్, అమర్‌నాథ్, తుంగనాథ్, యమునోత్రి వంటి ప్రదేశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలో 6 నెలల పాటు (అక్టోబర్ నుంచి ఏప్రిల్) దట్టమైన మంచుతో కూరుకుపోయే ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వీలుపడదు. కేవలం మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే యాత్రలకు వీలుపడుతుంది. అయితే సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో అంతుబట్టదు. దానికి తోడు జూన్, జులై, ఆగస్టు నెలల్లో నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ హిమాలయాలను తాకి వెనక్కి మళ్లుతాయి. ఆ కారణంగా అవి భారత ఉపఖండానికి విస్తారమైన వర్షపాతాన్ని ఇస్తాయి. మొత్తంగా ఇలాంటి భౌగోళిక, వాతావరణ పరిస్థితులు హిమాలయ క్షేత్రాల్లో యాత్రలు చేసే భక్తులకు తరచుగా ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. ఒక్కోసారి వాటి తీవ్రత ఊహకు అందనంత స్థాయిలో ఉంటుంది. 2013లో జరిగిన కేదార్‌నాథ్ వరదలు వంటి ప్రకృతి విలయం కూడా ఆ కోవలోనిదే. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాతావరణ హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా యాత్ర చేపడితే ప్రమాదాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్

హిమాలయాల్లో అత్యంత ఎత్తు మీద ఉన్న గుహలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ఏటా లక్షలాది భక్తులు తరలివెళ్తుంటారు. ఇతర యాత్రల కంటే ఈ యాత్ర మరింత క్లిష్టంగా ఉంటుంది. పహల్‌గాం వైపు నుంచి యాత్ర ప్రారంభిస్తే గుహను చేరుకోడానికి రెండ్రోజులు పడుతుంది. అదే బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి బయల్దేరితే ఒక రోజులోనే చేరుకోవచ్చు. యాత్ర మార్గంలో అక్కడక్కడా వీలున్న చోట్ల బస చేయడానికి వీలుగా తాత్కాలిక టెంట్లు, గుడారాలతో వసతి సదుపాయం ఉంటుంది. కానీ ఎక్కువ మందికి వసతి కల్పించడం సాధ్యం కాదు. అందుకే యాత్రకు రెండు వైపుల నుంచి పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుంటారు. ఎత్తైన హిమాలయాల్లో వాతావరణంలో ఆక్సీజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల చాలామంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్వాసకోస వ్యాధులు ఉన్నవారిని, ఆరోగ్యం ఫిట్‌గా లేనివారిని యాత్రకు అనుమతించరు. ముందుగానే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని తీరా యాత్ర మొదలుపెట్టాక.. ప్రకృతి రూపంలో అనుకోని అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. వర్షం కురిస్తే చాలు నడక మార్గం కొండచరియలు విరిగిపడడమో లేదంటే ఒక్కసారిగా మెరుపు వరదలు దూసుకురావడమో జరుగుతుంటాయి. గత ఏడాది అమర్‌నాథ్ గుహ ఎదురుగా ఒక్కసారిగా వరద ముంచెత్తి పలువురు యాత్రికులను బలితీసుకున్న ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అమర్‌నాథ్ యాత్రకు రెండు మార్గాల్లోనూ అధికారులు విరామం ప్రకటించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80 వేల మందికి పైగా అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

వాతావరణ శాఖ హెచ్చరికలు

రానున్న 24 గంటల్లో బీహార్, తెలంగాణ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో పర్వతాల నుండి రాళ్లు పడడంతో బద్రీనాథ్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. పది రోజుల వ్యవధిలో ఈ రహదారిని నాలుగు సార్లు మూతపడింది. ఉత్తరాఖండ్‌లోని పిత్తోరాగఢ్ జిల్లాలోని ధార్చులలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక వంతెన కొట్టుకుపోయింది. ఇక్కడ చాల్ గ్రామంలో 200 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు సహాయ బృందం కూడా చిక్కుకుపోయింది. కేవలం హిమాలయ రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కన్నూర్, కాసర్‌గోడ్‌లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలప్పుజాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడ పడవను రోడ్లపైనే నడపాల్సి వచ్చింది. వెయ్యి మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు.

రానున్న 24 గంటల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బీహార్, తెలంగాణ, మూ కాశ్మీర్‌లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని చెబుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, మహారాష్ట్రలోని మరాఠ్‌వాడా, గంగానది పశ్చిమ బెంగాల్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..