దేశ భద్రతకు ప్రమాదకరం.. విపత్తుగా మారబోతున్నాడు. సిద్ధూపై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Amarinder Singh – Punjab: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అతను దేశ భద్రతకు ప్రమాదకరం.. విపత్తుగా మారబోతున్నాడు. అని అమరీందర్ అన్నారు. “సిద్ధూ అసమర్థుడు. అతను విపత్తుగా మారబోతున్నాడు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును వ్యతిరేకిస్తాను. నవజోత్ సింగ్ సిద్ధుకు పాకిస్థాన్‌తో సంబంధం ఉంది. ఇది దేశ భద్రతకు ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూకు స్నేహితుడు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో సిద్ధూకు సంబంధం ఉంది.” అని అమరీందర్ అన్నారు.
ఇలా ఉండగా, పంజాబ్ కాంగ్రెస్‌లో వర్గపోరు చరమాంకానికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఈ మధ్యాహ్నం రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో నెలకొన్న ఆధిపత్య పోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిని నియమించే బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కాగా, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా అనే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం.. తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అమరీందర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని అమరీందర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని, ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించనున్నారనే అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగిన సంగతి తెలిసిందే.