Haryana Elections: హర్యానా దంగల్.. మల్లయోధుల రాష్ట్రంలో ఆప్ – కాంగ్రెస్ కుస్తీ.. బీజేపీకి మూడోసారి కలిసొచ్చేనా..?

హర్యానా.. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఈ చిన్న రాష్ట్రంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపోటములతో వాటి రాజకీయ భవితవ్యం ముడిపడి ఉంది. హర్యానా, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు చేపట్టింది.

Haryana Elections: హర్యానా దంగల్.. మల్లయోధుల రాష్ట్రంలో ఆప్ - కాంగ్రెస్ కుస్తీ.. బీజేపీకి మూడోసారి కలిసొచ్చేనా..?
Kejriwal Rahul Gandhi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 11, 2024 | 10:13 AM

హర్యానా.. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఈ చిన్న రాష్ట్రంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపోటములతో వాటి రాజకీయ భవితవ్యం ముడిపడి ఉంది. హర్యానా, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు చేపట్టింది. వీటిలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరపాల్సి ఉండగా, ఢిల్లీ రాష్ట్రానికి జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సంగతెలా ఉన్నా.. హర్యానా రాష్ట్ర ఫలితాలపై మాత్రం అన్ని పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపొందితే.. ఆ పార్టీకి ఇది వరుసగా మూడో విజయం అవుతుంది. అంతేకాదు, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన కొన్ని పరాభవాలు తాత్కాలికమేనని, బీజేపీ హవా తగ్గలేదని చెప్పుకోడానికి ఉంటుంది. అదే కాంగ్రెస్ గెలుపొందితే.. లోక్‌సభ ఎన్నికల్లో గమనించిన బీజేపీ వ్యతిరేక పవనాలు మరింత బలపడుతున్నాయని సూత్రీకరించే అవకాశం ఉంది. అయితే హర్యానాలో ప్రజాతీర్పు ఎలా ఉందో, మిగతా రాష్ట్రాల్లోనూ అలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. అయినప్పటికీ.. ఆ ఫలితాల ప్రభావం ఎన్నికల వాతావరణాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి.

మల్లయోధుల రాష్ట్రంలో ఆప్ – కాంగ్రెస్ కుస్తీ?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ఏకైక ఉమ్మడి లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒకటి. జాతీయ హోదా పొందిన ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌తో చేతులు పూర్తిస్థాయిలో కలపలేకపోయింది. ఢిల్లీలో మాత్రమే దోస్తీ.. పంజాబ్‌లో కుస్తీ అన్నట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు హర్యానా ఎన్నికల్లోనూ దోస్తీ యత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా మల్లయోధుల రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని NDA, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి (I.N.D.I.A) ముఖాముఖి తలపడుతున్న పరిస్థితి నుంచి బహుముఖ పోటీకి తెర లేపినట్టయింది. అంటే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి జాతీయ పార్టీలు మాత్రమే కాదు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జననాయక్ జనతా పార్టీ (JJP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP), హర్యానా లోక్‌హిత్ పార్టీ (HLP) వంటి రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీతో ఆప్, జేజేపీ కలిసి పోటీచేయాలని భావించినప్పటికీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పదేళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల నాటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్ సహా వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య చీలిపోతే అంతిమంగా కమలదళానికి ప్రయోజనం చేకూర్చినట్టే అవుతుంది.

ఆప్‌తో దోస్తీ వద్దన్న హుడా..

కాంగ్రెస్‌తో దోస్తీని ఆప్ కోరుకున్నప్పటికీ.. కాంగ్రెస్ వైపు నుంచే స్వాగతం లభించలేదు. ఇందుక్కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న భూపీందర్ సింగ్ హుడానే. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు విషయంలో ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. విపక్ష ఇండి కూటమి ఐక్యతను చాటే క్రమంలో పొత్తు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వానికి సిఫార్సు చేసినప్పటికీ… పొత్తు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడం ఆత్మహత్యాసదృశ్యంగా హుడా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే పొత్తును వ్యతిరేకించడానికి కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. దళిత ఓటుబ్యాంకును ఆకట్టుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ షెల్జా కుమారి ఇప్పటికే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆప్‌తో జట్టుకడితే.. హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఆ పార్టీ నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది. అసలే సొంత పార్టీలోనే షెల్జా కుమారి నుంచి సీఎం సీటుకు ముప్పు ఎదురవుతుంటే, మరో తలనొప్పి వ్యవహారం ఆప్ రూపంలో ఎందుకు తెచ్చుకోవాలి అన్నదే హుడా ఆలోచనగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి