AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaganyaan Mission: ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్ ‘గగన్‌యాన్‌’లో మరో కీలక అడుగు.. ట్రయల్స్ సూపర్ సక్సెస్..

INDIA Gaganyaan Mission: ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్.. గగన్‌యాన్.. గగన్ యాన్ సన్నాహాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ముందడుగు వేసింది. ఇస్రో, భారత నౌకాదళం గగన్‌యాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా రెండవ దశ రికవరీ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించాయి.

Gaganyaan Mission: ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్ ‘గగన్‌యాన్‌’లో మరో కీలక అడుగు.. ట్రయల్స్ సూపర్ సక్సెస్..
Gaganyaan Mission
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2023 | 1:20 PM

Share

INDIA Gaganyaan Mission: ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్.. గగన్‌యాన్.. గగన్ యాన్ సన్నాహాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ముందడుగు వేసింది. ఇస్రో, భారత నౌకాదళం గగన్‌యాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా రెండవ దశ రికవరీ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించాయి. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో జూలై 20 నుంచి మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టులో రికవరీ ట్రయల్స్ జరుగుతున్నాయి. గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ముందుగా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడు రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకువస్తారు. ఈ మిషన్ గగన్‌యాన్ తద్వారా భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రతిష్టాత్మక లక్ష్యాల దిశగా ఈ మిషన్ చరిత్రలో నిలిచిపోనుంది.

మొదటి దశలో అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్ పరీక్ష విజయవంతం అయిన విషయం తెలిసిందే. గగన్ యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా దీనిని గతేడాది నిర్వహించారు. తాజాగా.. రెండవ దశ రికవరీ ట్రయల్స్‌లో మాస్ అండ్ షేప్ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ మోకప్ (CMRM) నిర్వహించారు. ఇది టెస్టింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన భాగం.. CMRM వ్యోమగాముల దగ్గరకు సకాలంలో చేరుకోవడం, రికవరీ విధానాలు.. నిజ జీవిత పరిస్థితులను ఖచ్చితంగా అనుకరించేలా నిర్ధారిస్తుంది. తద్వారా మిషన్ విజయానికి విలువైన స్పష్టమైన డేటాను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ట్రయల్స్‌లో వ్యోమగాముల రికవరీ అనుకరణతోపాటు పలు వివిధ దశలు ఉన్నాయి. రికవరీ బోయ్ అటాచ్మెంట్, టోయింగ్, హ్యాండ్లింగ్, క్రూ మాడ్యూల్‌ను షిప్ డెక్‌పైకి ఎత్తడం వంటివి ఉన్నాయి. ఈ విధానాలు ముందుగా నిర్ణయించిన రికవరీ సీక్వెన్స్ ప్రకారం అమలు చేస్తారు. అయితే, ట్రయల్స్ లో పాల్గొన్న బృందాల సంసిద్ధత, సామర్థ్యాలకు అనుగుణంగా మున్ముందు మరిన్ని మార్పులు చేయాలా.? లేదా అనే అవకాశాలను పరిశీలిస్తారు. అవాంతరాలు లేని, సురక్షితమైన వ్యోమగాముల రికవరీ ప్రక్రియను నిర్ధారించడానికి, కొచ్చిలోని వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ ఫెసిలిటీ (WSTF)లో నిర్వహించిన మొదటి దశ ట్రయల్స్ అనుభవాల ఆధారంగా ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ను ఒక పద్దతి ప్రకారం నిర్వహించారు. ఇవి.. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, అవాంతరాలు తలెత్తకుండా నిర్వహిస్తారు. ఇది కార్యకలాపాల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను పెంచుతుంది.

రెండవ దశ రికవరీ ట్రయల్స్ విజయవంతంగా ప్రారంభం కావడం గగన్‌యాన్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది ఇస్రో, భారత నావికాదళం సత్తాను తెలియజేయడమే కాకుండా అంతరిక్ష పరిశోధనలో అభివృద్ధి, భారత సామర్థ్యాలను చాటిచెబుతుంది. గగన్‌యాన్ మిషన్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ISRO, భారత నావికాదళంపై ఉంది. వ్యోమగాములతో కూడిన మొదటి మిషన్ ప్రారంభం కోసం భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్ గగన్యాన్ రెండవ దశ రికవరీ ట్రయల్స్ విజయవంతంగా పూర్తవడంతో.. ఈ ప్రాజెక్ట్ ప్రయోగానికి ఒక అడుగు దగ్గరగా ఉంది.

మిషన్ గగన్‌యాన్ ఇలా..

భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వ్యోమగాములు 3 రోజుల పాటు గడిపిన తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. ఈ క్రమంలో సముద్ర జలాల్లో మొదట ల్యాండింగ్ ఉంటుంది. వ్యోమగాముల ల్యాండింగ్ కు సాయం అందించడానికి కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళంలో కొంతమందికి ఇస్రో ట్రైనింగ్ ఇస్తోంది. అయితే, గగన్‌యాన్ మిషన్ లో ఉన్న వ్యోమగాములు పారాచూట్ల సాయంతో సముద్ర జలాల్లో నిర్దిష్ట ప్రదేశంలో మొదటగా ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అవుతున్న క్రమంలో టాటా ఎలిక్సీకి చెందిన క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్‌లో నౌకాదళ సిబ్బంది వేగంగా వెళ్లి వారిని పికప్ చేసుకుంటుంది. సమయంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా ముందస్తుగా ప్రణాళిక చర్యలు, ట్రైనింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా, అంతరిక్ష వాతావరణం నుంచి భూమి వాతావరణంలోకి రాగానే వ్యోమగాములకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లన్నీ CMRMలో అందుబాటులో ఉండనున్నాయి. అయితే, ఇస్రో ఈ మిషన్ గగన్ యాన్ ను ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..