ఆగ్రాలో 22 మంది కోవిద్ రోగులపై ‘మాక్ డ్రిల్’…పేషంట్ల మృతి ఘటనతో కదిలిన అధికారులు.. ఆసుపత్రి సీల్
ఆగ్రాలో ' మాక్ డ్రిల్' (ప్రయోగం) పేరిట ఆక్సిజన్ ని 5 నిముషాలు తీసేసి 22 మంది కోవిద్ రోగుల మృతికి కారణమైన శ్రీ పరాస్ హాస్పిటల్ ని అధికారులు సీల్ చేశారు.
ఆగ్రాలో ‘ మాక్ డ్రిల్’ (ప్రయోగం) పేరిట ఆక్సిజన్ ని 5 నిముషాలు తీసేసి 22 మంది కోవిద్ రోగుల మృతికి కారణమైన శ్రీ పరాస్ హాస్పిటల్ ని అధికారులు సీల్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ ఆసుపత్రి యజమాని అరింజయ్ జైన్ పై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. మాక్ డ్రిల్ అంటూ ఇతగాడు చేసిన నిర్వాకం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆక్సిజన్ తొలగించిన కారణంగా రోగుల చేతులు, కాళ్ళు నీలి రంగులో మారాయి. 22 మంది పేషంట్స్ ఆయా తేదీల మధ్య మరణించగా ఈ విషయాన్ని జైన్ సీక్రెట్ గా ఉంచాడు.. ఎంతమంది మరణించారన్న ప్రశ్నకు ఆయన ఖచ్చితంగా తనకు తెలియదన్నాడు. కానీ ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు సింగ్ మాత్రం జైన్ పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ హాస్పటల్ లో నలుగురు రోగులు మాత్రమే మృతి చెందారని అసలు ఏ సందర్బంలోనూ ఆక్సిజన్ కొరత లేదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 28 న ఈ వీడియోను రికార్డు చేశారని, 26-27 తేదీల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆయన అన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, అది ముగిసేవరకు ఈ హాస్పిటల్ ని సీల్ చేస్తున్నామని వెల్లడించారు. సీలింగ్ సమయంలో ఆసుపత్రిలో ఉన్న 55 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు.
అయితే ఆక్సిజన్ తీసేస్తే కోవిద్ రోగుల పరిస్థితి ఎలా ఉంటుందని మాక్ డ్రిల్ నిర్వహించి 5 నిముషాలు దాన్ని తొలగించినట్టు జైన్ స్పష్టంగా చెబుతుండగా ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడడం విశేషం. జైన్ స్వయంగా చెబుతున్నా ఆయన దాన్ని పట్టించుకోకుండా అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Mumbai Heavy Rains: ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. నీట మునిగిన రైల్వే ట్రాక్‌లు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం