Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

General Elections 2024: ఓట్ల జాతరలో అజెండాల లెక్క తేలింది.. ఇక ప్రజా తీర్పే మిగిలింది..!

అమెరికా, యూరోప్‌, రష్యా దేశాల జనాభా కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ మంది సుమారు 97 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో జరుగుతున్న ఓట్ల జాతరను విశ్వమంతా నిశితంగా గమనిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, సర్వమత సౌభ్రాతుత్వంతో దశాబ్ధాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. ఓట్ల జాతరకు యావత్ దేశం సన్నద్ధమైన వేళ టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వ్యూ పాయింట్..

General Elections 2024: ఓట్ల జాతరలో అజెండాల లెక్క తేలింది.. ఇక ప్రజా తీర్పే మిగిలింది..!
TV9 Managing Editor Rajinikanth's View Point
Follow us
Rajinikanth Vellalacheruvu

|

Updated on: Apr 13, 2024 | 7:46 PM

ప్రజలు కోరుకున్నవాళ్లే నాయకులు.. ప్రజలు ఎన్నుకున్నదే ప్రభుత్వం. మళ్లీ తమ పాలకులను ఎన్నుకునే అరుదైన చారిత్రక ఘట్టానికి భారతదేశం సిద్ధమైంది. కన్యాకుమారి నుంచి చైనా సరిహద్దులోని 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న తాషిగంగ్‌ వరకూ ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకునే రోజు రానే వస్తోంది. అమెరికా, యూరోప్‌, రష్యా దేశాల జనాభా కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ మంది సుమారు 97 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో జరుగుతున్న ఓట్ల జాతరను విశ్వమంతా నిశితంగా గమనిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, సర్వమత సౌభ్రాతుత్వంతో దశాబ్ధాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. వర్తమానంలో ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగి.. విశ్వగురుస్థానాన్ని ఆక్రమించడానికి ఉవ్విళ్లూరుతోంది. సరిగ్గా ఈ సమయంలో జరుగుతున్న ఎన్నికలు సహజంగానే ఆసక్తిని రేకిత్తిస్తాయి. అందుకే అజెండాలు, విధానాలు కూడా చర్చనీయాంశాలే. ప్రధానంగా రెండు కూటముల మధ్య జరుగుతున్న ఎన్నికల మహాసంగ్రామంలో అజెండాలు తేలాయి.

బీజేపీ అజెండాలో ఆదిపురుష్‌ నుంచి ఆర్థికశక్తి దాకా..

2014 నుంచి వరుసగా రెండుసార్లు ఓట్లు, సీట్లు పెంచుకుంటూ వచ్చిన కమలదళం ఇప్పుడు అతిపెద్ద కలను సాకారం చేసుకునేందుకు శక్తినంతా కూడగట్టుకుంటోంది. మోదీయే ఆయుధం.. మోదీయే నినాదంగా చేసుకుని దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విజయాన్ని అందుకోవాలన్న ఆశయసాధన వైపు అడుగులేస్తోంది. ఏడుపదుల వయసులోనూ నరేంద్రమోదీ మూడోసారి తిరుగులేని మెజార్టీతో ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యం వైపుగా నడుస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రబలశక్తిగా తీర్చిదిద్దడమే తన అజెండాగా చెబుతున్నారు. కరోనా కారణంగా నిర్దేశిత 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ అందుకోలేకపోయినా పదేళ్లు ఇచ్చిన అవకాశంతో ప్రపంచంలోనే ఐదో ఆర్థికశక్తిగా నిలబెట్టిన ఘనత తమదిగా చాటుకుంటోంది బీజేపీ. మరోసారి గెలిపిస్తే అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద పవర్‌ హౌస్‌గా మారుస్తామంటోంది. 21వ శతాబ్ధంలో భారత్‌ను శాసించే శక్తిగా మార్చి చూపిస్తామని కూడా జనాల్లోకి వస్తోంది. ఇందుకు జీ20 సదస్సును, చంద్రుడిపై అడుగుపెట్టిన చారిత్రక ఘట్టాలను ఉదహరిస్తోంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు.. మోదీ నాయకత్వపటిమ, విదేశాల్లో గుర్తింపు బీజేపీ ప్రచారానికి అదనపు బలాలయ్యాయి. వీటికి తోడు సహజ సిద్దంగానూ, వారసత్వంగానూ వస్తున్న దేశభక్తి, దేశసమగ్రత, దేశరక్షణ వంటి తిరుగులేని ఈ మూడు ఆయుధాలు ఉత్తర భారతంలో ఓట్లు సాధించిపెడతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

కరోనా సమయంలో కడుపు నింపిన ఉచితబియ్యం, ఫ్రీగా ఇచ్చిన వ్యాక్సిన్‌ కంటే కూడా బీజేపీకి అతిపెద్ద ప్రచారాస్త్రం ఇప్పుడు జై శ్రీరామ్‌. బీజేపీకి విజయాన్ని అందించే ఇలవేల్పుగా మారాడు శ్రీరాముడు. 500 ఏళ్ల రామభక్తుల కల నేరవేరడం నిజమే. కానీ కోర్టుల ద్వారా సాధించిన రామాలయం అధికారంలో ఉన్న బీజేపీకి కలిసొచ్చింది. లీడర్‌, కేడర్‌ లేని ఊరూ-వాడకు కూడా కాషాయపార్టీని ఆ రాముడే అక్షింతల రూపంలో తీసుకెళ్లడం ఎన్నికలకు ముందు పార్టీ సాధించిన విజయమే. ఎందుకంటే ఇటీవల విశ్వసనీయత కలిగిన ఓ జాతీయసంస్థ జరిపిన సర్వేలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం హిందువులు సాధించిన అతిపెద్దగుర్తింపుగా భావిస్తున్నారా అంటే 48శాతం మంది అవును అనడమే ఇందుకు నిదర్శనం. ఆసక్తికరంగా దక్షణభారతంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమయింది. అంటే రామజపం బీజేపీ విజయంతో చోదకమవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తెలంగాణ వంటి ఉద్యమాల గడ్డలోనూ జైశ్రీరామ్‌ నినాదం పార్లమెంట్‌ ఎన్నికల అజెండాలో భాగమైంది అంటేనే బీజేపీ వ్యూహం ఫలించినట్టే.

General Elections 2024

General Elections 2024

అబ్‌కీ బార్ 400 పార్ నినాదం

1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా పెల్లుబికిన సానుభూతిలో 48శాతం ఓట్లతో 415 సీట్లు గెలిచింది కాంగ్రెస్‌. ఇప్పుడు అంతకుమించిన విజయాన్ని అందుకోవాలన్నది బీజేపీ ఆశయం. 50శాతం ప్రజామద్దతుతో 400కు పైగా సీట్లతో అఖండవిజయాన్ని సొంతం చేసుకునేందుకు శత్రువులను సైతం మిత్రులుగా మలుచుకుని సీట్లు సర్దుబాటు చేసుకోవడం ఇందులో వ్యూహమే. అబ్‌కి బార్‌ 400 పార్‌ నినాదం కోసమే బీహార్‌లో నితీష్‌కుమార్‌, ఏపీలో చంద్రబాబునాయుడు, కర్నాటకలో జేడీఎస్‌ కుమారస్వామి స్నేహితులుగా మారారు. 2019లో 37శాతం ఓట్లతో 303 సీట్లు సాధించిన బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే 13శాతం అదనంగా ఓట్లు సంపాదించాలి. దక్షణాదిన సీట్లు పెంచుకోవాలి. 130 సీట్లలో సగానికి పైగా సాధించాలి. దీని కోసమే మోదీ మిషన్‌ సౌత్‌ మొదలుపెట్టారు. రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా నేషన్‌ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్‌ అనే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ప్రాంతీయపార్టీల్లోనే అనూహ్యంగా వ్యక్తులను ముందుపెట్టి మరీ ఎన్నికలకు వస్తోంది. ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌.. అంటే స్లోగన్‌లో బీజేపీ స్థానాన్ని ప్రధానమంత్రి మోదీ ఆక్రమించారు. ఇది విమర్శలకు తావిస్తోంది కానీ కేవలం నినాదం మాత్రమేనని.. తమ అజెండా ఉజ్వలభారతమంటోంది. ప్రపంచశక్తిగా నిలపడమే అసలు లక్ష్యమంటోంది. ఇది మోదీ నాయకత్వంతోనే సాధ్యమన్న సందేశమివ్వడమే నినాదం వెనక ఉద్దేశమంటోంది పార్టీ.

కాంగ్రెస్‌ అజెండాలో రాజ్యాంగ రక్షణ – పేదలకు సంక్షేమపాలన

భారతీయ జనతా పార్టీకి పూర్తి భిన్నమైన అజెండా ఇండియా కూటమిది. దేశ రక్షణ, సమగ్రత, జైశ్రీరామ్‌, ఆర్థికాభివృద్ధి ఎన్డీయే విధానాలైతే … సంక్షేమం, ఉచిత పథకాలు, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్దరణ అంటోంది ఇండియా కూటమి. నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ ప్రభుత్వాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని.. పేదలకు పథకాలు ఇస్తూనే దేశాభివృద్ధికి బాటలు వేశామంటోంది కాంగ్రెస్‌. మోదీ పాలనతో ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు మినహా ఎవరు బాగుపడ్డారని ప్రశ్నిస్తోంది. బీజేపీ ప్రచారం చేస్తున్న అభివృద్ది అంతా బూటకమేనంటోంది. ఉద్యోగాలు, ఉపాథి కల్పించడంలో ఘొరంగా విఫలమయ్యారని.. 2023లో 44శాతానికి నిరుద్యోగ రేటు పెరిగిందని ఆరోపిస్తోంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నినాదాలు గుర్తుచేస్తున్నాయి. పెరిగిన ధరలు తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏంటని నిలదీస్తోంది. తమ అజెండా సామాన్యుల అజెండా అంటోంది ఇండియా కూటమి. కూడు, గూడు, గుడ్డ నినాదంగా మలుచుకుంది. 5 న్యాయ పత్రాలను ఉచితపథకాలతో నింపింది. ఏడాదికి లక్ష రూపాయల నగదు నుంచి నిరుద్యోగులకు భృతిపైనా భరోసా ఇస్తోంది.

Opposition India Alliance

Opposition India Alliance

ఇక రాజకీయంగా బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యమే ఉండదని కాంగ్రెస్‌ బలంగా చాటుతోంది. రాజ్యాంగాన్ని మార్చి ప్రజలను ఏమార్చి నియంతృత్వ పాలన తీసుకొస్తారని ప్రచారం బలంగా తీసుకొస్తున్నారు. జైశ్రీరామ్‌ నినాదం వ్యతిరేకించకపోయినా అండర్‌ కరెంట్‌గా మైనార్టీ ఓటుబ్యాంకు పోలరైజ్‌ అయ్యేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక రైతు ఉద్యమాలు, ఉద్యోగాలు లేని యువత అండగా ఉంటారని నమ్ముతోంది ఇండియా కూటమి. అయితే కూటమి కడుతూనే మోదీని ఢీకొట్టడం అంత ఈజీకాదని కాడి వదిలేశాయి కొన్నిపార్టీలు. రాష్ట్రాలన్నీ తిరిగి విపక్ష పార్టీలను ఏకం చేసి కూటమికి ఆజ్యంపోసిన నితీష్‌కుమార్‌ కాడి వదిలేసి ఎన్డీయేతో జతకట్టారు. అయినా మిగిలిన పార్టీలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. బీజేపీని 250లోపు పరిమితం చేస్తే చాలు అధికారం దక్కుతుందన్న ఆశతో హస్తం పార్టీ ఉంది. వాస్తవానికి మళ్లీ నరేంద్రమోదీ -అమిత్‌షా ద్వయం సారథ్యంలో ఎన్డీయే గెలిస్తే ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా చేస్తారన్న అనుమానాలున్న పార్టీలు కూడా ఇండియా కూటమికి ఎన్నికల అనంతరం మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఉత్తరభారతంలో బీజేపీ బలం తగ్గించి.. దక్షణభారతంలో తమ పట్టు నిలబెట్టుకోవాలన్న వ్యూహంతో ఉంది ఇండియా కూటమి. బీజేపీతో 350 నుంచి 400 సీట్లలో నేరుగా తలపడుతోంది. మరి ఉచితపథకాలతో పాటు.. రాజకీయ వ్యూహం ఫలించి అజేయశక్తిగా, రోజురోజుకు ఇమేజ్‌ పెంచుకుంటున్న నరేంద్రమోదీని ఢీకొట్టగలరా అన్నదే ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి ఇండియా కూటమి ఇప్పుడు పోరాడుతున్నది ఎన్డీయే లేదా బీజేపీతో కాదు.. నరేంద్రమోదీ అనే బలమైన శక్తితో..

ఇండియా కూటమిది కమీషన్ నినాదం.. మాది ఇండియా మిషన్‌ అని మోదీ అంటున్నారు. పోటీగా మాది ప్రజాస్వామ్య పాలన, ఎన్డీయేది నియంతృత్వ పాలన అంటోంది ఇండియా కూటమి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్‌ ముద్ర ఉందని నరేంద్రమోదీ నేరుగానే విమర్శలు గుప్పించారు. బీజేపీ చెప్పుకోవడానికి ఏమీలేకనే జైశ్రీరామ్‌ అంటోందని కాంగ్రెస్‌ అంటోంది. ఇది పక్కనపెడితే ఎన్నికల్లో ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలు కూడా పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారడం దురదృష్టకరం. అధికారపార్టీకి అవి అనుబంధ సంస్థలుగా మారాయంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. రాజకీయ పార్టీలే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తానికి ఎవరు ఎన్ని అజెండాలతో, విమర్శలు, హామీలు, నినాదాలతో వచ్చినా ప్రజలే అంతిమనిర్ణేతలు. వారు అన్నీ గమనిస్తూనే ఉంటారు.. ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలో వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేది తమ సేవలకుని.. ప్రభువులను కాదని ప్రజలకు తెలుసు. అందలం ఎక్కించినవారు నచ్చితేనే మళ్లీ పట్టం కడతారు.. లేదంటే పక్కకు నెడతారు. అదే ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ. సో… ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారో తెలియాలంటే జూన్‌ 4వరకు ఆగాల్సిందే

వ్యూ పాయింట్‌ – రజినీకాంత్‌ వెల్లలచెరువు