‘KSRTC’ Logo: కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏడేళ్ల వివాదానికి తెర.. కేఎస్‌ఆర్టీసీ లోగో దక్కించుకున్న కేరళ..!
కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య KSRTC లోగో వివాదం ముగిసింది. ఏడేళ్లుగా నడుస్తున్న ఈ పోరాటంలో చివరకు కేరళ విజయం సాధించింది.
Kerala gets the trademark for KSRTC: కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య KSRTC లోగో వివాదం ముగిసింది. ఏడేళ్లుగా నడుస్తున్న ఈ పోరాటంలో చివరకు కేరళ విజయం సాధించింది. కేఎస్‌ఆర్టీసీ లోగో కేరళకే చెందుతుందని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ తీర్పును వెలువరించింది.
కర్ణాటకపై కేరళ పైచేయి సాధించింది. ఏడేళ్లుగా నడుస్తున్న కేఎస్‌ఆర్టీసీ లోగో వివాదంలో ఎట్టకేలకు కేరళ విజయం సాధించింది. ఇకపై కేఎస్‌ఆర్టీసీ లోగో కేరళ ఆర్టీసీకే చెందుతుందని ప్రకటించింది కేంద్రం పరిధిలోని ట్రేడ్ మార్క్క్ రిజిస్ట్రీ. ఇకపై కర్ణాటక ఆర్టీసీ వేరే లోగో డిజైన్ చేసుకోవాలని సూచించింది.
2013 నుంచి కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య మధ్య రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన లోగో వివాదం నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులపైనా KSRTC పేరుతోనే బోర్డులుండేవి. అయితే, 2014లో బస్సులపై ఈ లోగో ముద్రించొద్దని కేరళ ప్రభుత్వానికి నోటీసులు పంపింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో కేఎస్‌ఆర్టీసీ అనే పదాన్ని కర్ణాటక కూడా ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళ కూడా పిటిషన్ దాఖలు చేసింది.
కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1965లో తన సేవలను ప్రారంభించిందని, కర్ణాటక ఆర్టీసీ తన సేవలను 1974లో ప్రారంభించిందని అప్పీలేట్ బోర్డుకు తెలిపింది. ఏడేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న ఈ న్యాయ పోరాటంలో చివరకు కేఎస్‌ఆర్టీసీ లోగోను చట్టబద్ధంగా ఉపయోగించుకునే హక్కును కేరళకే కేటాయించింది ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ.
తాజాగా కేంద్రం నుంచి పేటెంట్ దక్కడంతో ఇకపై మీ బస్సులపై ఈపేరు వాడొద్దని కర్ణాటకకు నోటీసులు పంపింది కేరళ సర్కార్. అయితే, పేటెంట్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఒకవేళ వస్తే..అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లక్ష్మణ్ సావది. మరోవైపు, తీవ్రమైన ఆర్థిక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న కేరళ ఆర్టీసీకి ఈ తీర్పు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు. ఐపీఆర్ ఆధారంగా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఇచ్చిన తీర్పు కర్ణాటకకు నిజంగా షాకనే అంటున్నారు.