Independence day: మువ్వన్నెల జెండా కోసం ఇల్లు అమ్ముకున్నాడు.. అలాంటి దేశభక్తి ఎక్కడా చూడలేదన్న పూనమ్ కౌర్
దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపాలా కాసే జవాన్లను చూశాం. దేశభక్తి అంటే ఇది కదా అనుకుంటాం. అందరికీ సైన్యంలో చేరే అవకాశం రాదు. కానీ దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకోడానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వాసి రుద్రాక్షల సత్యనారాయణ చేసిన ప్రయత్నం ఇప్పుడు యావద్దేశాన్ని ఆకట్టుకుంటోంది. వృత్తిరీత్యా నేత కార్మికుడైన సత్యనారాయణ, ఎలాంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను రూపొందించాలని అనుకున్నాడు. కేవలం రూపొందించడమే కాదు, ఆ జెండాను ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఎర్రకోట మీద ఎగరేయించాలన్నది ఆశయంగా పెట్టుకున్నారు.
దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపాలా కాసే జవాన్లను చూశాం. దేశభక్తి అంటే ఇది కదా అనుకుంటాం. అందరికీ సైన్యంలో చేరే అవకాశం రాదు. కానీ దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకోడానికి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వాసి రుద్రాక్షల సత్యనారాయణ చేసిన ప్రయత్నం ఇప్పుడు యావద్దేశాన్ని ఆకట్టుకుంటోంది. వృత్తిరీత్యా నేత కార్మికుడైన సత్యనారాయణ, ఎలాంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను రూపొందించాలని అనుకున్నాడు. కేవలం రూపొందించడమే కాదు, ఆ జెండాను ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఎర్రకోట మీద ఎగరేయించాలన్నది ఆశయంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తొలుత ఇంటిని తాకట్టు పెట్టి, చివరకు అమ్ముకున్నారు. అంత విలువైన జెండాకు పెద్ద ధర చెల్లించి కొనేందుకు కొందరు ముందుకొచ్చినా సరే.. తాను జెండాను రూపొందించింది అమ్ముకోవడం కోసం కాదని, ఎర్రకోటపై ఎగరేయడం కోసం మాత్రమేనని తెగేసి చెప్పాడు. ఈ మాట అన్నది ఎవరితోనో కాదు.. చేనేత బ్రాండ్ అంబాసిండర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటి పూనమ్ కౌర్ (PK)తో. సత్యనారాయణ దేశభక్తికి పూనమ్ కళ్లు చెమర్చాయి. అతని కథ తెలిసిన వెంటనే తనకు కొద్ది రోజుల పాటు నిద్రపట్టలేదని ఆమె అన్నారు.
నాలుగేళ్ల శ్రమ
జాతీయ జెండా తయారీ కోసం కేవలం ఖద్దరు (నూలు) మాత్రమే ఉపయోగించాలన్న నిబంధన కొన్నాళ్ల క్రితం వరకు ఉండేది. జెండా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్కెట్లో వివిధ రకాల జెండాలు దర్శనమిస్తున్నాయి. వాటి తయారీ కూడా చాలా సులభతరమైంది. అయితే రుద్రాక్షల సత్యనారాయణ తన జెండా తయారు చేయడానికి నాలుగేళ్లు శ్రమించాల్సి వచ్చింది. జెండా మధ్యలో ఉన్న చక్రాన్ని తయారు చేయడానికే ఏకంగా రెండేళ్లు శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ జెండా సాదాసీదా జెండా కాదు. సాధారణంగా తయారు చేసే జెండాలో కాషాయం, తెలుగు, ఆకుపచ్చ రంగులుంటాయి. మూడు రంగుల వస్తాలను తగిన సైజులో కట్ చేసి కుట్టడం, మధ్యలో అశోక చక్రాన్ని నీలి రంగుతో ముద్రించడం చేస్తుంటారు. కానీ సత్యనారాయణ ఎలాంటి అతుకులు లేకుండా మగ్గం మీదనే మూడు రంగులు వచ్చేలా జెండాను తయారు చేయాలని సంకల్పించారు. మూడు రంగులతో జెండా నేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. కానీ ముద్రించకుండా అశోక చక్రాన్ని రూపొందించడం మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ చక్రంలోని 24 రేఖలను తయారు చేయడం కోసం 2,400 దారాలను ఉపయోగించానని సత్యనారాయణ చెబుతున్నారు. తొలుత రూ. 25 వేలు ఖర్చు చేసి 4X6 సైజులో జాతీయ జెండాను తయారు చేశానని, కానీ ఎర్రకోటపై ఎగరేసే జెండా 8X12 సైజులో ఉంటుందని తెలిశాక తొలుత నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మగ్గం మీద అంత పెద్ద సైజు జెండాను ఏకవస్త్రంగా రూపొందంచడం సాధ్యం కాదు.
ఎలాగైనా తన జెండా ఎర్రకోటపై ఎగరాలంటే పెద్ద మగ్గంపై నేయాల్సిందేనని నిర్ణయించుకున్న సత్యనారాయణ.. ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెద్ద మగ్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిపై అల్లిక ప్రారంభించగా.. కొంత నేసిన తర్వాత మరకలు పడడమో, చిరిగిపోవడమో జరిగేదని.. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మొదటి నుంచి జెండా నేయడం ప్రారంభించేవాడినని సత్యనారాయణ చెప్పారు. అలా మొత్మమ్మీద 24 జెండాల అనంతరం పూర్తి జెండా తయారైందని వివరించారు. అప్పటికే ఖర్చు తడసి మోపెడైందని, రూ. 6.5 లక్షలు ఖర్చయిపోయాయని అన్నారు. దాంతో చేసేదేం లేక తాకట్టు పెట్టిన ఇంటిని అమ్ముకున్నాని వెల్లడించారు. జెండా రూపకల్పన తుది దశలో ఉండగా తనకు సినీ నటి పూనమ్ కౌర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ సహకరించారని సత్యనారాయణ చెప్పారు. మొత్తానికి ఆ ఇద్దరూ కలిసి సత్యనారాయణను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు తీసుకెళ్లారు. సత్యనారాయణ ప్రయత్నం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ఏకంగా 40 నిమిషాల సమయాన్ని వెచ్చించి వారితో గడిపారు. సత్యనారాయణను మెచ్చుకుంటూ అతని కృషి, దేశభక్తి గురించి యావద్దేశానికి తెలియాల్సిందేనని ఆమె భావించారు.
ఆదుకున్న చేతులు
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటి పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్‌లో చేనేతకు ప్రసిద్ధి చెందిన వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు సత్యనారాయణ ప్రయత్నం గురించి తెలిసింది. ఏకవస్త్ర జాతీయ జెండా అనగానే ఆసక్తి కలిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. ఆ క్రమంలో పెద్ద మగ్గం కోసం ఇంటిని తాకట్టు పెట్టి, ఆ తర్వాత అమ్ముకున్న విషయం తెలిసి బాధ పడ్డానని పూనమ్ కౌర్ తెలిపారు. సత్యనారాయణకు వీలైనంత సహాయపడుతూ జెండా రూపకల్పన పూర్తయ్యేలా పూనమ్ కౌర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ సహకరించారు. ఆ తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఆమెను కలిశారు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పూనమ్ కౌర్.. తన మనసులో మాట పంచుకున్నారు.
భక్తి, దేశభక్తి చాలా మందిలో చూశానని.. కానీ ఏకంగా ఆస్తులు అమ్ముకుని మరీ జాతీయ జెండా రూపకల్పన చేయాలన్న సత్యనారాయణ ప్రయత్నం గురించి తెలిసాక కొద్ది రోజులు నిద్రపట్టలేదని అన్నారు. ఒక దశలో జెండా తయారయ్యాక దాన్ని తనకు అమ్మాల్సిందిగా కోరితే.. తాను అమ్ముకోవడం కోసం ఆ జెండా తయారు చేయడం లేదని, ఎర్రకోటపై ఎగరేయాలన్నదే తన ధ్యేయమని చెప్పాక తన కళ్లు చెమర్చాయని పూనమ్ కౌర్ అన్నారు. త్రివర్ణ పతాక వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రుద్రాక్షల సత్యనారాయణ కృషిని మించిన ఉత్తమ ఉదాహరణ మరొకటి ఉండదని అన్నారు. జెండా కోసం ఇంటినే పోగొట్టుకున్న సత్యనారాయణకు ఏదో ఒక పథకం కింద ఇంటిని అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం