అమ్మ ప్రేమ.. తల్లి కోసం స్పెయిన్ నుంచి ఒడిశాకు..

అమ్మ ప్రేమ.. తల్లి కోసం స్పెయిన్ నుంచి ఒడిశాకు..

Samatha J

|

Updated on: Jan 10, 2025 | 7:12 PM

చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి పెంచిన తల్లితో కలిసి తన కన్నతల్లి ఆచూకీ కోసం వెతుకుతోంది. ఈక్రమంలోనే స్పెయిన్ నుంచి ఒడిశాకి వచ్చింది. ఒడిశాకు చెందిన బానాలత దాస్ నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌‌లోని నయాపల్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఓ ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పని చేసే ఆమె భర్త ..ఇల్లు వదిలేసి వెళ్లిపోవడంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆమె తన నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు స్నేహ, సోమును ఇంట్లో వదిలివేసి, మరో ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లింది. అప్పుడు స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా, సోము నెలల పసిబిడ్డ.

ఆ క్రమంలో ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలను స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. 2010 సంవత్సరంలో స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన గెమా వైదర్, జువాన్ జోష్ దంపతులు అనాధ ఆశ్రమంలో ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ళ సోమును దత్తత తీసుకుని వారిని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. ఈ ఇద్దరు చిన్నారులను సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు. అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని గెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ తెలుసుకోవాలని స్నేహ.. గెమాతో కలిసి గత నెల 19న భువనేశ్వర్ కు చేరుకుంది. స్థానిక హోటల్‌‌లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను స్నేహ తెలుసుకుంది. ఆ తర్వాత పోలీసులు, అనాథాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో స్థానిక యూనివర్శిటీకి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సహాయపడ్డారు. దాదాపు మూడు వారాల పాటు తల్లి బానాలత అచూకి కోసం స్నేహ ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ క్రమంలో స్థానిక పోలీస్ కమిషనర్ దృష్టికి తమ సమస్యను వివరించి సాయం చేయమని కోరగా, స్నేహ తల్లి ఆచూకి తెలుసుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు.