ఆ తెలుగు ఆధికారి పేరు చెబితేనే ఆప్ నేతలకు వణుకు.. తప్పుడు ఆరోపణలతో ఇరికించాలనుకున్నారు.. కట్ చేస్తే.!
ఓ తెలుగు ఐఏఎస్ అధికారి పేరు చెబితే ఢిల్లీ ప్రభుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు వణికిపోతున్నారు. ఎందుకంటే.. ఆయన తవ్వితీస్తున్న ఒక్కొక్క కేసు పెద్ద పెద్ద కుంభకోణాలను బయటపెడుతూ ఆప్ సర్కారును ఇరకాటంలో పడేస్తోంది. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన 'ఢిల్లీ మద్యం కుంభకోణం'ను వెలికి తీసింది..

ఓ తెలుగు ఐఏఎస్ అధికారి పేరు చెబితే ఢిల్లీ ప్రభుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు వణికిపోతున్నారు. ఎందుకంటే.. ఆయన తవ్వితీస్తున్న ఒక్కొక్క కేసు పెద్ద పెద్ద కుంభకోణాలను బయటపెడుతూ ఆప్ సర్కారును ఇరకాటంలో పడేస్తోంది. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ను వెలికి తీసింది కూడా ఆ అధికారే. ఆయన పేరు వైవీవీజే రాజశేఖర్. ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాకలాపాల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. ఒకవేళ అవకతవకల్లో ప్రభుత్వాధినేతలు, ప్రజా ప్రతినిధుల పాత్ర కూడా ఉందంటే, విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించవచ్చు. ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నందుకు రాజశేఖర్‌ను ఆప్ సర్కారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది.
అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మిగతా రాజకీయ నాయకుల కంటే తానేమీ భిన్నం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని లోకానికి చాటిచెప్పిన కేసుల్లో ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ ఒకటి. దీనిపై ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సంస్థలు విచారణ జరుపుతూ చార్జిషీట్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడకు చుట్టుకోగా.. తాజాగా ఆయనకు ఈడీ సమన్లు కూడా జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. ‘శీష్ మహల్’ పేరుతో మరో కుంభకోణాన్ని విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ బయటపెట్టారు. సుమారు రూ. 45 కోట్ల వ్యయంతో సివిల్స్ లైన్స్‌లో ఉన్న సీఎం అధికారిక నివాసానికి సుందరీకరణ పనులు చేపట్టడం ఈ వివాదానికి కారణమైంది. కేజ్రీవాల్ సతీమణి డిజైన్ల రూపకల్పన చేయడం, అత్యంత విలాసవంతమైన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. తాను సామాన్యుల (ఆమ్ ఆద్మీ) ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ ప్రారంభంలో మెట్రో రైల్లో, బస్సుల్లో ప్రయాణించిన కేజ్రీవాల్ ఈ తరహా విలాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం విమర్శలకు దారితీసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కూడా చేశాయి. ఇంత తీవ్రస్థాయిలో కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసిన ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌పై ఢిల్లీ సర్కారు కత్తి గట్టింది.
‘శీష్ మహల్’ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సమయంలోనే ఆయన కార్యాలయానికి తాళాలు వేసి, కీలక పత్రాలను తీసుకెళ్లి అడ్డంకులు సృష్టించింది. అయినా సరే.. ప్రభుత్వ అవినీతిని నిరూపించే సాక్ష్యాధారాలతో ఆయన నివేదికను తయారుచేయగలిగారు. ఈ రెండు వ్యవహారాల్లో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రే ఇరకాటంలో పడగా.. ఆయన వెలికితీసిన మరికొన్ని కేసుల్లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కేసులు, విచారణ, శిక్షలు ఎదుర్కొంటున్నారు.
ఆర్డినెన్స్ అందుకే..!
ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టను, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్న రాజశేఖర్ వంటి అధికారులను ఆయా శాఖల నుంచి తప్పించి లూప్ లైన్లో పడేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక యత్నాలు చేసింది. అయితే ఆ బదిలీలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించకపోవడంతో ఆటలు సాగలేదు. అంతటితో ఊరుకోకుండా కేజ్రీవాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల బదిలీలపై తమకే అధికారం ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం అవసరం లేదని కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేజ్రీవాల్ సర్కారుకు ఊరట కల్గించే తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీలపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టకుండా అడ్డుకుంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కే కట్టబెట్టింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్సుకు చట్ట రూపం కూడా తీసుకొచ్చింది. తద్వారా రాజశేఖర్ వంటి అధికారులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేసింది.
టార్గెట్ రాజశేఖర్ – రిపోర్ట్ క్లీన్‌చిట్
ఈ పరిస్థితుల్లో రాజశేఖర్‌ను మచ్చిక చేసుకోవడం కోసం కేజ్రీవాల్ సర్కారు అనేక ప్రయత్నాలు చేసింది. వాటికి ఆయన లొంగకపోగా ప్రభుత్వ అవకతవకలను, అక్రమాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తూ వచ్చారు. దీంతో కేజ్రీవాల్ సర్కారు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజశేఖర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాయి. ఆయన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వెళ్లి రాజశేఖర్‌కు సంబంధించి ఏవైనా లొసుగులు దొరుకుతాయా అని కూడా ప్రయత్నించారు. ఏమీ దొరక్కపోవడంతో.. ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో.. ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయనిచ్చిన రిపోర్టుల కారణంగా సస్పెండైన ప్రభుత్వోద్యోగులతో వరుస పెట్టి ఫిర్యాదులు చేయించింది. అవినీతి ఆరోపణలపై సస్పెండైన ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, ఆయన భార్య శిల్పి రాయ్ (ఈమె కూడా ఢిల్లీ క్యాడర్ అధికారిణి), ఢిల్లీ సర్వీసెస్ అధికారి ఏవీ ప్రేమ్‌నాథ్ (కంపల్సరీ రిటైర్మెంట్ శిక్షకు గురైన అధికారి) సహా మరో ముగ్గురు వ్యక్తులు రాజశేఖర్‌పై ఫిర్యాదులు చేశారు.
ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను బెదిరించారని, వేధింపులకు గురిచేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఏ అధికారిపై ఆరోపణలు వచ్చినా అవి నిజమో, కాదో తెలుసుకోవడం కోసం విచారణకు ఆదేశించడం పరిపాటే. ఆ క్రమంలో రాజశేఖర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటైంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి అశ్వని కుమార్, విజిలెన్స్ కార్యదర్శి సుధీర్ కుమార్, సర్వీసెస్ విభాగం కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ ఈ కమిటీలో ఉన్నారు. రాజశేఖర్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి లోతుగా విచారణ జరిపిన ఈ హైలెవెల్ కమిటీ, అవన్నీ తప్పుడు ఆరోపణలుగా తేల్చేసింది. సస్పెండైన అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్ తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం తన అక్రమాలను బయటపెట్టిన అధికారిపై తప్పుడు ఆరోపణలు చేశారని కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కూడా వెల్లడించింది. తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణాచర్యలు చేపట్టకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ బురదజల్లే ప్రయత్నం చేశారని కూడా వెల్లడించింది. హైలెవెల్ కమిటీ ఇచ్చిన క్లీన్‌చిట్ ఆ తెలుగు అధికారి నిజాయితీ, నిబద్ధతను బయటపెట్టింది. అందుకే ఇప్పుడు ఆయన పేరు చెబితే ఆమ్ ఆద్మీ సర్కారు హడలిపోయే పరిస్థితి నెలకొంది.
