PM Narendra Modi: ఆ నినాదమే నరేంద్రుడి మంత్రం.. ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో.. ఎన్నెన్నో..
రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను ప్రధాని మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టింది.
8 Years of Modi Government: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి (26 మే 2022) నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది. మోడీ సర్కార్ ఈ ఎనిమిదేళ్లలో అనేక సంస్కరణలతోపాటు.. ‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ -సబ్ కా విశ్వాస్’ నినాదంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమానదృష్టితో చూస్తూ ఎనలేని అభివృద్ధి ప్రణాళికలను అందిస్తోంది. రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను ప్రధాని మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టింది. దీంతోపాటు తన పాలనతో, సంక్షేమ పథకాలతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుంటోంది. దేశంలో సుపరిపాలన అందిస్తూ సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తూ.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
గత ఎనిమిదేళ్లలో (8 Years of Modi Govt) నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి.. అదేవిధంగా ప్రధాని మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీవీ9 ప్రత్యేక కథనం.. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అవినీతి, అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని వేగంగా ప్రక్షాళన చేసేందుకు.. తన పట్టులోకి తీసుకువచ్చేందుకు నరేంద్రుడికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించేలా అనేక చర్యలను తీసుకున్నారు.
ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అయినా తన అభివృద్ధికి అడ్డుకట్ట వేయకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభించిన్నప్పటికీ కోట్లాది మంది భారతీయులు మోడీపై పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత అన్నింటిపై సమీక్షించడానికి చాలా కాలం పడుతుంది. కానీ.. ప్రధాని మోడీ అనతి కాలంలోనే ఒక స్పష్టమైన మార్గాన్ని రూపొందించి.. పాలనా పరమైన రోడ్ మ్యాప్ రచించి సంస్కరణలను తీసుకువచ్చారు.
అంతేకాకుండా.. కొత్త చట్టాల రూపకల్పన.. వివాదాస్పద చట్టాల తొలగింపు.. లాంటి వాటిల్లోనూ తనదైన మార్కును వేశారు. అటు ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. కరోనా కష్టకాలంలో సహాసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటు సరిహద్దుల్లో కాలు దువ్వుతున్న పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు సైతం గట్టి వార్నింగ్ ఇచ్చేలా కీలక వ్యూహాలను రూపొందించి విజయవంతమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..