Cyber crime: బడా మోసం.. ఫోన్లు చేశారు.. రూ.160 కోట్లు దోచుకున్నారు
ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులపై వల వేస్తున్న కేటుగాళ్లు లక్షలు, కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా భారత్‌కు చెందిన 4గురు సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఉన్నవారిని బురిడి కొట్టించి ఏకంగా 20 మిలియన్ డాలర్లు (రూ. 160 కోట్లు) మోసానికి పాల్పడటం కలకలం రేపింది.

ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులపై వల వేస్తున్న కేటుగాళ్లు లక్షలు, కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా భారత్‌కు చెందిన 4గురు సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఉన్నవారిని బురిడి కొట్టించి ఏకంగా 20 మిలియన్ డాలర్లు (రూ. 160 కోట్లు) మోసానికి పాల్పడటం కలకలం రేపింది. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు అమెరికాలోని ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ సహకారంతో ఎట్టకేలకు ఆ నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితులు పర్త్ అర్మార్కర్(28), వస్తాల్ మెహతా (29), దీపక్ అరోరా (45), ప్రశాంత్ కుమార్(45)లుగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నిందితులు ఢిల్లీ, అహ్మదాబాద్ తో సహా ఉగాండా, అమెరికాలలో ఫేక్ కాల్ సెంటర్లు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఆ ప్రాంతాల నుంచి ఈ సైబర్ నేరస్థులు అమెరికాలోని ఆర్థిక సేవలు, సోషల్ సెక్యురిటీ, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులని చెబుతూ.. అమెరికాలో ఉన్నవారికి ఫోన్లు చేశారని పేర్కొన్నారు. వీరిని నమ్మిన కొంతమంది డబ్బులు ఇచ్చారని.. దీంతో ఆ సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్స్ ద్వారా రూ.160 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ నిందుతులకు సంబంధించిన సమాచారం ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ సహాయంతో తెలుసుకున్నామని.. ఈ నిందితుల్లో కీలక సూత్రదారి అహ్మదాబాద్‌కు చెందిన వస్తాల్ మెహతాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ముందుగా అర్మార్కర్‌కి సంబంధిన సాంకేతిక సమాచారం అందడంతో అహ్మదాబాద్‌లో అతడ్ని అరెస్టు చేశామని.. అతని ద్వారా వస్తల్ మెహతాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిని విచారించిన అనంతరం మిగతా ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దర్యాప్తు చర్యలో భాగంగా అమెరికాలోని ఎఫ్‌బీఐ దాదాపు 50 మంది బాధితులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులను ఐదురోజుల పాటు రిమాండ్‌కు తరలించామని.. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..