Andhra Pradesh: వామ్మో.. ఏపీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. ఆ జిల్లాలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
Heatwave in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.
Heatwave in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 23 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 16 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, జనం సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట బయటకు రావొద్దంటూ సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎండ తీవ్రతతోపాటు.. అక్కడక్కడ ఈదురగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో 46డిగ్రీల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 46°C, కాకినాడ జిల్లా చేబ్రోలులో 45.9°C, మన్యం జిల్లా సాలూరు, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 45.7°C, తూర్పుగోదావరి జిల్లా నందరాడలో 45.4°C, ప్రకాశం జిల్లా పట్చావలో 45.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 217 మండలాల్లో తీవ్రవడగాల్పులు,145 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(23) :-
అల్లూరి 6, బాపట్ల 1, తూర్పుగోదావరి 8, ఏలూరు7, కృష్ణా 1 మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..