AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: డ్యాన్స్ మాస్టర్ డేంజరస్ గేమ్.. కోచింగ్ ఇస్తానని బాయ్స్‌ను రప్పించి..

డ్యాన్స్ క్లాస్‌ పేరుతో మొదలైన పరిచయం… మెల్లగా మత్తు వైపు మళ్లిన అడుగులు… చివరికి గంజాయి రవాణా గ్యాంగ్‌లో చిక్కుకున్న విద్యార్థులు. విజయనగరం జిల్లాలో డ్యాన్స్ మాస్టర్ గణేష్ యువతను ఆకర్షించి, వ్యసనంలోకి దించి స్మగ్లర్లుగా మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ..

Andhra: డ్యాన్స్ మాస్టర్ డేంజరస్ గేమ్.. కోచింగ్ ఇస్తానని బాయ్స్‌ను రప్పించి..
Police With Accused
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Feb 21, 2026 | 9:30 PM

Share

విజయనగరం జిల్లాలో ఓ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ నేర్పుతానని యువతకు ఆకర్షించి గంజాయి స్మగ్లర్లగా మార్చిన ఘటన సంచలనంగా మారింది. సీతానగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ గణేష్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించాడు. డ్యాన్స్ నేర్పుతానని యువతను ఆకర్షించి, వారిని మెల్లగా గంజాయి వ్యసనంలోకి దించి తరువాత గంజాయి అక్రమ రవాణాలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. సీతానగరం, బొబ్బిలి, పరిసరాల్లో డ్యాన్స్ క్లాసులు పేరిట గణేష్ కొందరు యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. డిగ్రీ, ఇంటర్, ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులతో ఎక్కువగా కలిసి వారిని గంజాయి వినియోగంతో పాటు పెడ్లర్లుగా మార్చే ప్రయత్నం చేసేవాడు. ముందుగా యువతతో మంచిగా నటించి అనంతరం వారికి గంజాయి మత్తు చూపేవాడు. ఆ మత్తుకు అలవాటు పడిన తరువాత డబ్బులేని యువతకు గంజాయి ఎరవేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని, దాని ద్వారా మత్తుకు మత్తు డబ్బుకు డబ్బు వస్తాయని వారిని తన నెట్ వర్క్ లోకి దించేవాడు. అలా ఈ ప్రభావంతో కొందరు మధ్యలో చదువులు మానేసి పూర్తిగా ఈ రవాణాకు అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా బయట జిల్లాల్లో ఉన్న ఉన్నత చదువుల కోసం వెళ్లిన సీనియర్ స్టూడెంట్లతో కూడా గణేష్ సంబంధాలు పెంచి ముఠా విస్తరించినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఈ క్రమంలోనే బొబ్బిలి మండలం కోమటపల్లి లేఅవుట్ వద్ద గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు నుంచి సమాచారం అయ్యింది.

దీంతో పోలీస్ బృందం మెరుపు దాడులు చేసి పదకొండు మందిని అదుపులోకి తీసుకుంది. వారిలో బొబ్బిలి మండలం విజయపురంకు చెందిన చోడిపల్లి అఖిల్, లంకా చందుతో పాటు ఒక మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు రాయగడ నుంచి సరకు తెచ్చి ఇక్కడ విక్రయించే సమయంలో పట్టుబడ్డారు. అదే ప్రాంతంలో మరో ఏడుగురు యువకులు గంజాయి సేవిస్తున్నప్పుడు పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేసిన ఆ దాడిలో సుమారు ఐదు కిలోల గంజాయి, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా విద్యార్థులనే టార్గెట్ చేసిందని స్పష్టమైంది. యువతను గంజాయి బారినపడేలా చేసి, తర్వాత రవాణా, విక్రయాల్లో దింపడం వీరి మాస్టర్ ప్లాన్ అని వెల్లడించారు. మరికొందరు ఈ దందాలో ఉన్నట్లు సమాచారం రావడంతో త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టనున్నట్లు పలికారు. ఈ ఘటనతో బొబ్బిలి, సీతానగరం ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. యువతను లక్ష్యంగా చేసుకుని గంజయు నెట్‌వర్క్ విస్తరించడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత మిగతా వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.

Follow Us