Andhra News: రీల్స్ చేయొద్దన్న పాపానికి.. టీచర్లకే చుక్కలు చూపించిన విద్యార్థినులు.. ఏం చేశారంటే?
ఈ మధ్య యువతలో సోషల్ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఇక ఇన్‌స్టాగ్రామ్ రాకతో ఇది పీక్స్ చేరుకుంది. ఈ రీల్స్ పిచ్చితో 24 గంటలు ఆ సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు కొందరు. తాజాగా రీల్స్ ఎందుకమ్మా చదువులో వెనకబడతావని చెప్పిన పాపానికి ఓ విద్యార్థిని ఏకంగా బడి విడిచి పారిపోయింది. పారిపోయిన ఆ విద్యార్థినిని వెతికి పట్టుకునే సరికి ఆ ఉపాధ్యాయులు, పోలీసుల తలప్రాణం తోకకు వచ్చింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.

విద్యార్థులు బడికి వెళ్లి బుద్ధిగా పాఠాలు చదువుకోవాలి.. టీచర్లు చెప్పిన క్లాసులో విని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే.. జీవితంలో అనుకున్న ఆశయాలు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఎదగాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో బడికి వెళ్తున్న పిల్లల్లో కొంతమంది పక్కదారి. పుస్తకాల పట్టుకునే సమయంలో సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా అడిగితే అలక వహిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు చేసిన పని.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలు రోజు మాదిరిగానే వాళ్లు పాఠశాలకు వెళ్లారు. అయితే ఇద్దరు చదువులో వెనుక బడడంతో ఉపాధ్యాయులు వారిని మందలించారు. అంతేకాదు ఇంస్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసే విషయంలో పెట్టే శ్రద్ధ చదువుపై ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ఇకపై రీల్స్ చేయొద్దని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ బాలికలు స్కూల్ వదిలిన తర్వాత ఇంటికెళ్లకుండా ఎటో వెళ్లిపోయారు. సాయంత్రం వరకు బాలికలు ఇళ్లకు రాకపోయేసరికి కంగారుపడిపోయిన పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో బాలికల కోసం గాలింపు చేపట్టారు.
స్కూల్ నుంచి.. బాలికల వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్సు ఎక్కినట్టు గుర్తించి ఆ బస్సు వెళ్ళిన గ్రామాల వరకు ఆరా తీశారు. చివరకు అల్లూరి జిల్లా జర్రెల గ్రామంలో బంధువులు ఇంటికి వెళ్లారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న ఆ ఇద్దరినీ గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారిని ప్రశ్నిస్తే అసలు విషయం మెల్లగా చెప్పారు. బాలికలు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
