Republic Day 2024 Parade Live: జయహో భారత్.. దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Ravi Kiran

|

Updated on: Jan 26, 2024 | 1:42 PM

75th Republic Day Live Updates: దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా... ఎర్రకోట గర్వించేలా... గణతంత్ర దినోత్సవ వేడుకలకు..

Republic Day 2024 Parade Live: జయహో భారత్.. దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు..
Republic Day Celebrations

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా… ఎర్రకోట గర్వించేలా… గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఢిల్లీ. గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటునున్నాయ్‌ త్రివిధ దళాలు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో త్రివిధ దళాలు కలిసి కవాతు చేయనున్నాయ్‌. అద్భుత యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకోనున్నారు మన సైనికులు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jan 2024 01:40 PM (IST)

    ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ఆకట్టుకుంది

    ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. మూడేళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. తెలంగాణలో గ్రామీణస్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చాటుతూ తెలంగాణ శకటం కనువిందు చేసింది. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల గాథలను చాటుతూ ఈ శకటాన్ని రూపొందించారు. మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం రిపబ్లిక్‌ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • 26 Jan 2024 12:50 PM (IST)

    ఘనంగా ఢిల్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

    ఢిల్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ముర్ము, మాక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కర్తవ్యపథ్‌లో భారతీయ కళాబృందాలు పరేడ్‌ను ప్రారంభించగా.. 25 శకటాల ప్రదర్శన నిర్వహించాయి. అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని ప్రదర్శించింది భారత్‌. పరేడ్‌లో ఫ్రాన్స్‌ సైనిక బలగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. T 20 భీష్మ యుద్ధట్యాంకులు, అధునాతన నాగ్‌ మిసైల్‌ సిస్టమ్‌, పినాక మల్టీ బ్యారెల్‌ సిస్టమ్‌ కలర్‌ఫుల్‌గా నిలిచింది. అడ్వాన్స్‌డ్‌ రేడియో ఫ్రీన్వెన్సీ సిస్టమ్‌ ప్రదర్శించగా.. భారత సైనిక శక్తిని మాక్రాన్‌కు వివరించారు ప్రధాని మోదీ.

  • 26 Jan 2024 12:45 PM (IST)

    అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ శకటం

    దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ రిపబ్లిక్‌ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటం అందరినీ దృష్టిని ఆకర్షించింది..విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ఈ శకటాన్ని సిద్ధం చేసింది..శకటంపై ప్రధానంగా తరగతి గదుల్లో డిజిటల్‌ క్లాస్‌బోర్డులు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను విద్యార్థులు వినియోగించే తీరును బొమ్మలుగా రూపొందించారు..ఇక్కడ చదివిన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా మారినట్లు చూపించారు..ఈ ఇతివృత్తంపై 55 సెకెన్ల థీమ్‌సాంగ్‌ను రూపొందించగా..శకటం అతిథుల ముందు సాగేటప్పుడు ఈ పాట ప్లే అయ్యింది.

  • 26 Jan 2024 12:30 PM (IST)

    ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలు

    — ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలు — వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులు — గణతంత్ర వేడుకలకు బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము — గుర్రపు బగ్గీలో రిపబ్లిక్‌ డే వేడుకలకు ముర్ము — రాష్ట్రపతి వెంట ముఖ్యఅతిథి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ — కర్తవ్యపథ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ — రాష్ట్రపతి ముర్ముకు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు.. — స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ — ఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకలకు 13వేల మంది అతిథులు

  • 26 Jan 2024 11:44 AM (IST)

    గణతంత్ర వేడుకల్లో వైఎస్ షర్మిల..

    ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల..రాష్ట్రంలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటూ విమర్శలు చేశారు వైఎస్‌ షర్మిల..ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు.

  • 26 Jan 2024 11:03 AM (IST)

    చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సినీనటుడు చిరంజీవి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు తనకు ఎంతో ప్రత్యేకమైనవన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 40 ఏళ్ల చరిత్రలో కళామతల్లికి చేసిన సేవను గుర్తించిన కేంద్రం పద్మవిభూషణ్‌ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

  • 26 Jan 2024 11:00 AM (IST)

    దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

    — దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు — ఢిల్లీలో వైభవంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలు — ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ — రాష్ట్రపతి ముర్ముకు, మాక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం – పరేడ్‌ను ప్రారంభించిన భారతీయ కళాబృందాలు – మొత్తం 25 శకటాల ప్రదర్శన – పరేడ్‌లో ఫ్రాన్స్‌ సైనిక బలగాలు -ఆకర్షణగా నిలిచిన T 20 భీష్మ యుద్ధట్యాంకులు – పరేడ్‌లో అధునాతన నాగ్‌ మిసైల్‌ సిస్టమ్‌ – కలర్‌ఫుల్‌గా పినాక మల్టీ బ్యారెల్‌ సిస్టమ్‌

  • 26 Jan 2024 10:51 AM (IST)

    జనసేన కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలు..

    విజయవాడలోని జనసేన కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు పవన్‌కల్యాణ్‌.

  • 26 Jan 2024 10:30 AM (IST)

    ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి..అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్ తమ్మినేని సీతారాం..ఆపై గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు..అటు శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు..గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.. అటు ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎస్ జవహర్‌రెడ్డి..

  • 26 Jan 2024 10:00 AM (IST)

    లోక్ సభలో గణతంత్ర వేడుకలు

    భారత పార్లమెంట్‌ ఆవరణలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయ్‌. స్పీకర్‌ ఓం బిర్లా… జాతీయ జెండాను ఆవిష్కరించి… పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు.

  • 26 Jan 2024 09:30 AM (IST)

    హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన తమిళిసై..

    గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, TSPSCని ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు. సామాన్యడికి గత ప్రభుత్వం అందుబాటులో లేదన్న గవర్నర్.. ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు ధైర్యం, వివేకం, ఉత్సాహం అంటూ కామెంట్ చేశారు తమిళిసై. గణతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన తమిళిసై.. ఈ వ్యాఖ్యలు చేశారు.

  • 26 Jan 2024 09:00 AM (IST)

    గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఓ ప్రత్యేకత..

    గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. భారత త్రివిధ దళాలు చేసే కవాతు, అద్భుత యుద్ధ విన్యాసాలు… రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయ్‌!. అయితే, ఈసారి పరేడ్‌లో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. త్రివిధ దళాల్లోని మహిళా శక్తి… చేయబోయే కవాతు, యుద్ధ విన్యాసాలు ఆకట్టుకోనున్నాయ్‌. 144మంది మహిళా బృందం ఒకేసారి మార్చ్‌ ఫాస్ట్‌ చేయనుంది.

  • 26 Jan 2024 08:30 AM (IST)

    ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు ఇలా..

    విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామన్నారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు జగన్‌.

  • 26 Jan 2024 08:30 AM (IST)

    గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

    గణతంత్ర వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన.. పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారన్నారు తమిళిసై. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆమె.. వందరోజుల్లో అన్నిగ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

  • 26 Jan 2024 08:06 AM (IST)

    పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు

    పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు హాజరు కావడానికి ముందు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళి అర్పించారు.

  • 26 Jan 2024 08:00 AM (IST)

    తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఇలా..

    హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది..గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు..రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు..సీఎంతో పాటు మంత్రులు IAS అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు..గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  • 26 Jan 2024 07:32 AM (IST)

    తన నివాసంలో జాతీయ జెండాను ఎగరేసిన సీఎం రేవంత్..

    తెలంగాణ CM రేవంత్‌ నివాసంలో రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌.

  • 26 Jan 2024 07:30 AM (IST)

    దేశమంతా అంబరాన్నంటిన రిపబ్లిక్ డే వేడుకలు..

    రిపబ్లిక్‌ డే సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దుల్లో దేశం మీసం మెలేసింది. తమ శక్తిని చూడండంటూ భారత సైనికులు రోషం, పౌరుషం చూపించారు. పందెం పుంజుల్లా కవాతు చేశారు. BSF సైనికులు చేసిన విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయ్‌. భారత సైనికుల శక్తిని కళ్లకు కట్టాయి. ప్రతిరోజు వాఘాలో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం రోజు జరిగే వేడుకలు మాత్రం చాలాచాలా స్పెషల్‌. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

Published On - Jan 26,2024 7:27 AM

Follow us