తిన్న తర్వాత ఎన్ని అడుగులు నడవాలి.. ఎక్కువ నడిస్తే ఏమవుతుంది..?
నేటి జీవనశైలిలో భోజనం తర్వాత నడక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే జీర్ణక్రియకు ఎంతసేపు నడవాలి అనేది చాలా మందికి తెలియదు. ఆయుర్వేదం ప్రకారం.. శతపావళి అంటే భోజనం చేశాక 100 అడుగులు నెమ్మదిగా నడవడం శ్రేయస్కరం. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు లేదా వేగంగా నడవడం వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు పెరిగారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడవడం ఒక అలవాటుగా మారింది. అయితే జీర్ణక్రియ మెరుగుపడాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలి..? దీనిపై ఆయుర్వేదం చెబుతున్న రహస్యాలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం.. భోజనం చేసిన వెంటనే పరుగు తీయడం లేదా గంటల తరబడి వేగంగా నడవడం సరికాదు. ఆయుర్వేదం శతపావళి అనే సూత్రాన్ని సిఫార్సు చేస్తోంది. శత అంటే 100, పావళి అంటే అడుగులు. భోజనం చేసిన తర్వాత కేవలం 100 అడుగులు నెమ్మదిగా నడవడం వల్ల శరీరంలోని జటరాగ్ని ప్రేరేపించి.. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
ఎక్కువసేపు నడిస్తే వచ్చే నష్టాలేంటి?
చాలామంది భోజనం తర్వాత అరగంట లేదా గంట సేపు వేగంగా నడుస్తుంటారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది.
శక్తి మళ్లింపు: భోజనం తర్వాత శరీర శక్తి మొత్తం జీర్ణక్రియపై దృష్టి పెట్టాలి. కానీ మనం వేగంగా నడిస్తే, ఆ శక్తి కాళ్లకు, కండరాలకు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
అసిడిటీ సమస్యలు: అధిక శ్రమ వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలసట: భోజనం తర్వాత రక్త ప్రసరణ జీర్ణకోశం వైపు ఉండాలి. వ్యాయామం వల్ల అది మారిపోవడం వల్ల త్వరగా అలసట వచ్చే అవకాశం ఉంది.
శాస్త్రీయ కోణం
ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఆయుర్వేద సూత్రానికి మద్దతు ఇస్తుంది. భోజనం తర్వాత 10-15 నిమిషాల స్వల్ప నడక వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని, మెటబాలిజం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పిల్లల విషయంలో జాగ్రత్త
పిల్లలు భోజనం చేసిన వెంటనే పరుగెత్తడం, దూకడం వంటివి చేస్తుంటారు. ఇది వారి సున్నితమైన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి భోజనం తర్వాత వారిని కూర్చుని ఆడుకునే ఆటలు లేదా కథలు చెప్పడం వంటి ప్రశాంతమైన పనుల్లో నిమగ్నం చేయడం మంచిది.
వజ్రాసనం: ఒక అద్భుత ప్రత్యామ్నాయం
నడవలేని వారు లేదా వృద్ధులు భోజనం తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది. భోజనం తర్వాత వేయదగ్గ ఏకైక ఆసనం ఇదే. ఇది కడుపుపై ఒత్తిడి లేకుండా జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫిట్‌నెస్ పేరుతో భోజనం తర్వాత కష్టపడటం కంటే 100 అడుగుల చిన్న నడక లేదా కొద్దిసేపు వజ్రాసనం వేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




