Poop Color: మీ మలం రంగు ఇలా ఉందా? మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టే.. వెంటనే చెక్ చేసుకోండి!
సాధారణంగా మనం మల విసర్జన గురించి చర్చించడానికి ఇష్టపడము. కానీ, మనం విసర్జించే మలం రంగు మన శరీరంలోని అంతర్గత ఆరోగ్యం గురించి ఎన్నో రహస్యాలను చెబుతుందని మీకు తెలుసా? రంగును బట్టి మన కాలేయం, జీర్ణవ్యవస్థ లేదా ప్రేగులలో ఉన్న సమస్యలను మనం ముందే గుర్తించవచ్చు. అవేంటో ఈ కథనంలో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారంలోని వ్యర్థాలను శరీరం మలం రూపంలో బయటకు పంపుతుంది. ప్రతిరోజూ మల విసర్జన చేయడం ఎంత ముఖ్యమో, విసర్జించే మలం రంగును గమనించడం కూడా అంతే ముఖ్యం. మలం రంగును బట్టి మన శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలను ఇలా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గోధుమ ఆకుపచ్చ రంగు: మలం గోధుమ రంగులో ఉంటే అది సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నం. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందని దీని అర్థం. ఇక ఆకుకూరలు ఎక్కువగా తిన్నప్పుడు మలం ఆకుపచ్చగా రావడం సహజం. అయితే, అతిసారం (Diarrhea) సమయంలో ఆహారం ప్రేగుల నుంచి వేగంగా కదలడం వల్ల పిత్త రసాలు విచ్ఛిన్నం కాకపోయినా ఆకుపచ్చగా వచ్చే అవకాశం ఉంది.
పసుపు లేత రంగు: మలం పసుపు రంగులో రావడం ఏమాత్రం మంచిది కాదు. ఇది శరీరంలో కొవ్వు అధికంగా ఉందని లేదా ప్యాంక్రియాటిక్, పిత్త ఆమ్ల లోపాలను సూచిస్తుంది. ఒకవేళ మలం మరీ లేత రంగులో (Clay color) వస్తుంటే, కాలేయం లేదా పిత్తాశయంలో అడ్డంకులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.
నలుపు ఎరుపు రంగు:
నలుపు: ఐరన్ టాబ్లెట్లు వాడే వారికి మలం నల్లగా రావచ్చు. కానీ, బంకలాగా నల్లటి మలం వస్తుంటే ప్రేగుల్లో రక్తస్రావం లేదా పుండ్లు ఉన్నాయని అర్థం.
ఎరుపు: బీట్‌రూట్ తిన్నప్పుడు ఎరుపు రావడం సహజం. అయితే, పైల్స్ (Files) లేదా పెద్ద ప్రేగులో సమస్యల వల్ల రక్తం పడితే మలం ఎరుపు రంగులో వస్తుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
నీలం లేదా ఊదా రంగు: నీలం లేదా ఊదా రంగులో ఉండే ఆహారాలు (Blueberries వంటివి) తీసుకున్నప్పుడు మాత్రమే మలం ఈ రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
మల విసర్జనలో అసాధారణ రంగులను గుర్తించినప్పుడు మొహమాట పడకుండా వైద్యుడిని సంప్రదించాలి. తద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే అరికట్టవచ్చు.
