AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు.. రాత్రి ఏం జరిగిందంటే..?

చిత్రదుర్గలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. NH-48పై బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ పగలడం వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? బస్సు ఎంత స్పీడ్‌లో ఉంది..? అనే కీలక విషయాలను డ్రైవర్ వెల్లడించాడు.

ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు.. రాత్రి ఏం జరిగిందంటే..?
Karnataka Bus Accident
Krishna S
|

Updated on: Dec 25, 2025 | 3:48 PM

Share

కర్ణాటకలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి-48పై జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. బెంగళూరు నుండి శివమొగ్గకు సుమారు 300 కిలోమీటర్ల ప్రయాణంతో బయలుదేరిన ఈ ప్రైవేట్ బస్సు, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హిరియూర్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎదురుగా అతివేగంగా వస్తున్న ఒక ట్రక్కు ఒక్కసారిగా డివైడర్‌ను దాటుకుంటూ వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది.

ట్రక్కు నేరుగా బస్సు ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా డీజిల్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డోర్ ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ‘‘చుట్టూ మంటలు, ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. కిటికీ అద్దాలు పగలగొట్టి కొందరు ప్రాణాలతో బయటపడగలిగారు’’ అని ఆదిత్య అనే ప్రయాణికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. బస్సు క్లీనర్ మహ్మద్ సాదిక్ బస్సు ముందు భాగంలో నిద్రిస్తుండగా, ఢీకొన్న వేగానికి బయట పడిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

డ్రైవర్ ఏమన్నారంటే..?

గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ రఫీక్ మాట్లాడుతూ.. తాను 60-70 కి.మీ వేగంతోనే వెళ్తున్నానని, ట్రక్కు అదుపు తప్పి తన బస్సును ఢీకొట్టిందని తెలిపాడు. ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నించినప్పటికీ నియంత్రణ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన అని అభివర్ణిస్తూ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి