Vitamin D Deficiency: మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
కొన్నిసార్లు అకారణంగా కండరాల నొప్పి, నుదుటి మీద విపరీతంగా చెమట పట్టడం, జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక తికమక పడిపోతుంటారు. నిజానికి ఈ సమస్యలు ఒంట్లో ముఖ్యమైన విటమిన్లు లోపించడం వల్ల జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం. అయితే కొందరిలో ఈ విటమిన్ వివిధ కారణాల వల్ల లోపిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల గుండె సమస్యలు వస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి రోజుకు 20-40 mg/ml విటమిన్ D అవసరం. దీని కంటే తక్కువ మొత్తం ఉంటే అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపిస్తు పలు లక్షణాల ద్వారా పసిగట్టవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేదంటే పెద్ద పెద్ద సమస్యలు దాడిచేస్తాయి. మీ శరీరంలో తగినంత విటమిన్ డి లోపిస్తే ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
భరించలేనంతగా కండరాల నొప్పి
కండరాల నొప్పి విటమిన్ డి లోపం వల్ల తలెత్తుతుంది. చాలా మంది దీనిని అలసిపోయినట్లుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఒక్కోసారి అది కాకపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, వెంటనే జాగ్రత్తగా ఉండాలన్నమాట.
నుదుటి మీద విపరీతంగా చెమట
వేసవిలో చెమట పట్టడం అసాధారణం కాదు. కానీ ఇతర సమయాల్లో కూడా మీ నుదిటిపై ఊహించని విధంగా చెమటలు పడటం జరిగితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి, మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి సరిపడా లేకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన, నిరాశ కూడా సంభవించవచ్చు.
జుట్టు రాలడం
విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలడం సంభవిస్తుంది. చాలా మంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. అయితే ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవిస్తుంది. ఈ విటమిన్ లోపం తలలో ఫోలికల్స్ ఏర్పడటానికి దారి తీస్తుంది. ఫలితంగా జుట్టు సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరంలోని వివిధ భాగాలంలొ కీళ్ల నొప్పి రావడం కూడా విటమిన్ డి లోపం లక్షణాలలో ఒకటి. కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈ విటమిన్ లోపం వల్ల రావచ్చు.
విటమిన్ డి లోపం అధిగమించాలంటే..
విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు. రోజుకు 15-30 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించాలి. ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి ఇంకా మంచిది. అలాగే ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అంటే చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు, ధాన్యపు ఆహారాలు వంటివి. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








