Anantagiri Hills: అనంతగిరి అందాలు చూసొద్దామా.. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. అంతే కాకుండా..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Oct 08, 2022 | 6:07 PM

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలోనే ఉన్న అనంతగిరి హిల్స్ పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చు. పొగమంచు కొండలు, పచ్చని పచ్చిక బయళ్లు, పురాతన దేవాలయాలు, మూసీ నది జన్మస్థలం..

Anantagiri Hills: అనంతగిరి అందాలు చూసొద్దామా.. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. అంతే కాకుండా..
Anantagiri Tour

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలోనే ఉన్న అనంతగిరి హిల్స్ పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చు. పొగమంచు కొండలు, పచ్చని పచ్చిక బయళ్లు, పురాతన దేవాలయాలు, మూసీ నది జన్మస్థలం కావడంతో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు మంచి పర్యాటక కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ అనంతగిరిని సందర్శించడం మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అనంతగిరిని సందర్శించేందుకు మంచి సమయంగా చెప్పవచ్చు. చల్లటి చిరు జల్లులు, పొగ మంచుతో దుప్పటి కప్పేసినట్లు ఉండే పరిసరాలు టారిస్టుల మదిని దోచుకుంటాయి. హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉన్నా చాలా మందికి అనంతగిరి గురించి అంతగా తెలియదనే చెప్పాలి. ఈ విషయంపై ఆర్టీసీ కలగజేసుకుంది. అనంతగిరి అందాలను అందరూ వీక్షించేలా, ఆర్టీసీ కి ఆదాయం వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనంతగిరి కొండల సందర్శనను అవాంతరాలు లేని వ్యవహారంగా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరం నుంచి అనంతగిరి కొండలకు ప్రత్యేక బస్సు సేవలను నడిపించాలని నిర్ణయించింది.

నగరంలోని కేపీహెచ్బీ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సు 10 గంటలకు అనంతగిరి కొండలకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అనంతగిరి కొండల నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు ప్రసిద్ధ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, బుజ్జ రామేశ్వర ఆలయం, కోట్‌పల్లి రిజర్వాయర్, ఇతర పర్యాటక ఆకర్షణలకు పర్యాటకులను తీసుకువెళుతుంది. అల్పాహారం, భోజనం ఖర్చులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో పెద్దలకు ఛార్జీ రూ.300, పిల్లలకు రూ.150 గా ఉంటుంది. టూర్ ప్యాకేజీపై మరింత సమాచారం కోసం ఆర్టీసీ వెబ్ సైట్ ను సందర్శించాలి.

కాగా.. హైదరాబాద్ దర్శన్ పేరిట టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. నగరంలోని అన్ని పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలు, చరిత్రాత్మక కట్టడాలను వీక్షించేలా ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు ప్రత్యేక ‘హైదరాబాద్‌ దర్శన్‌’ పేరుతో ఒక ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. పర్యాటకుల కోసం శని,ఆదివారాల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రిజీయన్‌ మేనేజర్‌ సీహెచ్‌.వెంకన్న తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా పర్యాటకులు టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu