కెమికల్ ఫ్రీ బ్యూటీ..! గ్లోయింగ్ స్కిన్ కోసం 5 బెస్ట్, సింపుల్ హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్‌లు
ప్రతీ ఒక్క అమ్మాయి తన స్కిన్ సాఫ్ట్ గా, గ్లో గా కనిపించాలని కోరుకుంటుంది. కానీ కాలుష్యం, ఎండకు నేరుగా గురయ్యే యూవీ కిరణాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార లోపాలు, నిద్రలేమి వంటి అనేక కారణాలు స్కిన్ పై ప్రభావం చూపుతాయి. దీని ఫలితంగా మొటిమలు, మచ్చలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను తగ్గించి చర్మానికి ప్రకాశవంతమైన మెరుపు అందించడానికి కొన్ని సహజమైన ఫేస్ ప్యాక్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jan 23, 2025 | 1:08 PM

తాజా బొప్పాయి గుజ్జును తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మం పునరుత్తేజం అవుతుంది. ఇది చర్మంపై కాలుష్యం వల్ల వచ్చిన ప్రభావాన్ని తగ్గిస్తుంది.

రెండు టీ స్పూన్ల వేపపొడిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

ఒక కప్పు పాలలో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేయాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ను సులభంగా తొలగిస్తుంది.

బార్లీ గింజల పొడిని కొద్దిగా గోరువెచ్చటి నీటితో కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ చర్మం మీద మృత కణాలను తొలగించి దానిని కాంతివంతంగా మార్చుతుంది.

ముందుగా అరకప్పు కీరా గుజ్జు తీసుకోండి. దీనిలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయండి. కీరా చర్మానికి తేమనిచ్చి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ముడతలు, సన్నని గీతలు తొలగించడంలో సహాయపడుతుంది.




