Early Aging: చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలకు కారణాలివే.. వెంటనే వదిలించుకోకపోతే ఇక అంతే సంగతి..!

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Mar 18, 2023 | 10:07 PM

పని హడావిడిలో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు, ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక ఈ క్రమంలోనే కొందరు ఒత్తిడి, ఆందోళనలను

Early Aging: చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలకు కారణాలివే.. వెంటనే వదిలించుకోకపోతే ఇక అంతే  సంగతి..!
Reasons For Aging

ప్రస్తుత కాలంలో మనం అనుసరిస్తున్న నియమాలు లేని జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఉద్యోగ బాధ్యతలు, బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇది అనేక రకాల మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తోంది. పని హడావిడిలో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు, ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక ఈ క్రమంలోనే కొందరు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకోవడానికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలవుతారు. ఇవి ఒత్తిడి, ఆందోళనలను అసలు ఏ మాత్రం తగ్గించవు. పైగా పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చెడు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా చాలా చిన్న వయుసులోనే వృద్ధాప్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల చెడు జీవనశైలి అలవాట్లు చర్మం, జుట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. మరి ఆ జీవనశైలి పొరపాట్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలేమి: ఈ రోజుల్లో సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది క్రమంగా మన పని ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయాలకే నీరసపడిపోతారు. ఏకాగ్రత ఉండదు. ఇవి క్రమంగా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

ఆహారపు అలవాట్లు: పోషకాహార లేమి, చెడు ఆహారపు అలవాట్లతో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ కారణంగా వేగంగా బరువు పెరుగడం, జీవక్రియ రేటు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం, బీపీ తదితర సమస్యలు వేధిస్తాయి. జుట్టు, చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి: ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కూడా పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. ఎక్కువ ఒత్తిడి మనల్ని వృద్ధాప్యం వైపు వేగంగా నెట్టివేస్తుంది.

మద్యపానం, ధూమపానం: రెగ్యులర్‌గా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మన శరీర భాగాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖం మెరుపును కోల్పోతుంది.  ఇక పొగతాగేవారి ముఖంపై త్వరగా ముడతలు ఏర్పడుతాయి. వాస్తవానికి ధూమపానం సమయంలో విడుదలయ్యే పొగ ఫ్రీ రాడికల్స్‌కు కారణమవుతుంది. దీని కారణంగా కొల్లాజెన్ స్థాయులు తగ్గిపోతాయి. ఇది చర్మం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

టీ లేదా కాఫీ: టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల మనం ఎనర్జిటిక్‌గా అండ్‌ ఫ్రెష్‌గా ఉండవచ్చు. అయితే పరిమితంగానే వీటిని తీసుకోవాలి. మోతాదుకు మించి టీ, కాఫీలను తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. వీటిలోని కెఫిన్‌ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu