Kitchen Hacks: ఎంత తోమినా టీ జాలి నల్లగానే ఉంటోందా.. ఇలా క్లీన్ చేస్తే మెరుపు ఖాయం
పూర్తిగా శుభ్రం చేయని టీ స్ట్రైనర్ ను వాడితే అందులో టీ పొడి, జిడ్డు పేరుకుపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఇది మీ టీ రుచిని పాడు చేస్తుంది. అంతేకాకుండా, ఇలాంటి అపరిశుభ్రమైన స్ట్రైనర్ ను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా శుభ్రం చేయకపోతే దాని రంధ్రాలు పూర్తిగా మూసుకుపోయి టీ వడకట్టడం కష్టమవుతుంది.

ప్రతిరోజు టీ వడకట్టే ఫిల్టర్ పై మరకలు, మురికి త్వరగా పేరుకుపోతాయి. ఫిల్టర్ లోని చిన్న రంధ్రాలు మూసుకుపోయి నల్లగా మారిపోతాయి. అది టీ రుచిని పాడు చేస్తుంది. ఎంత రుద్దినా శుభ్రం కాకపోగా, ఒక్కోసారి ఫిల్టర్ పాడైపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి.
టీ ఫిల్టర్ ను సులభంగా శుభ్రం చేసే పద్ధతులు:
బేకింగ్ సోడా, నిమ్మకాయ: ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో ఫిల్టర్ ను కొద్దిసేపు నానబెట్టాలి. నల్లని పొర క్రమంగా తగ్గుతుంది. పాత మరకలు ఉంటే ఈ ద్రవంలో మరిగించవచ్చు. తరువాత బ్రష్ తో శుభ్రం చేయవచ్చు.
వెనిగర్: వెనిగర్ కూడా మంచి పరిష్కారం. ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు, ఒకటి రెండు టీస్పూన్ల వెనిగర్ కలపాలి. దానిలో ఫిల్టర్ ను నానబెట్టాలి. వెనిగర్ లో ఉండే ఆమ్ల గుణాలు మొండి మరకలను సులభంగా తొలగిస్తాయి. తర్వాత బ్రష్ తో శుభ్రం చేయాలి.
ఉప్పు, డిష్ వాషింగ్ : ఉప్పుతో డిష్ వాషింగ్ ద్రవాన్ని కలపాలి. ఒక స్పూన్ ద్రవానికి కొద్దిగా ఉప్పు కలిపి ఫిల్టర్ పై పూయాలి. పది నిమిషాల తర్వాత స్పాంజ్ తో రుద్దాలి. ఉప్పు ఒక స్క్రబ్ లా పని చేస్తుంది. అది పేరుకుపోయిన మురికిని తొలగించడానికి సహాయం చేస్తుంది.
టూత్ పేస్ట్: మీ వద్ద టూత్ పేస్ట్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు. టూత్ పేస్ట్ ను ఫిల్టర్ పై రాసి బ్రష్ తో శుభ్రం చేస్తే, తేలికపాటి మరకలు, దుర్వాసన తగ్గుతాయి. తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి.
ఈ సాధారణ చిట్కాలు వాడితే, మీ టీ ఫిల్టర్ ను ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఇలా వారానికి ఒకసారి శుభ్రం చేస్తే, మురికి చేరకుండా ఉంటుంది.




