Health: మంచిదని పసుపు నీరు తాగుతున్నారా..? వామ్మో.. ఆ సమస్యలను పాకెట్‌లో పెట్టుకున్నట్లే..
ఉదయం పూట పసుపు నీళ్లు తాగడం అనేది ఇటీవల కాలంలో బాగా పాపులర్‌గా మారింది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Sep 17, 2025 | 9:57 PM

జీర్ణ సమస్యలు: పసుపు నీరు జీర్ణక్రియకు సహాయపడుతుందని చెప్పినప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వికారం, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తం పలచబడటం: పసుపుకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంది. ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. దీంతో గాయాలైనప్పుడు రక్తం ఎక్కువగా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రక్తం పలచబడటానికి మందులు వాడేవారు. లేదా రక్తస్రావ వ్యాధులు ఉన్నవారు పసుపు నీరు తాగే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.

ఐరన్ శోషణ తగ్గడం: పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ 20శాతం నుండి 90శాతం వరకు తగ్గుతుంది. ఇది కాలక్రమేణా ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీస్తుంది. అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లను వాడిన ఒక వ్యక్తికి రక్తహీనత వచ్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది.

కాలేయ సమస్యలు: అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లను వాడితే కాలేయానికి హాని కలుగుతుంది. ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు దీనిని అధికంగా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది.

అలెర్జీలు: కొంతమందికి పసుపు పడకపోవచ్చు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పసుపు నీటిని తాగడం ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. (Note: పసుపు నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే లేదా మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.)




