Gym Workouts: జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!
సినిమాల్లో హీరోలు సిక్స్‌ప్యాక్‌తో, హీరోయిన్‌లు జీరోసైజులో కనిపిస్తుంటారు. అది చూసి యూత్ కూడా వాళ్ల మాదిరిగా సిక్స్‌ప్యాక్, జీరోసైజ్ వచ్చేయాలని జిమ్‌కు పరిగెడుతున్నారు. అయితే సిక్స్‌ప్యాక్‌లు, జీరోసైజులు ఇలా అనుకోగానే అలా వచ్చేయవు. అవి రావాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అంత సమయం ఓపిక పట్టలేక ‘ నెల రోజుల్లో ఎలాగైనా బాడీ మార్చేయాలి’ అనుకుని చేయాల్సిన దానికన్నా ఎక్కువ కసరత్తులు చేస్తుంటారు. అలాచేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు జిమ్ ఎంత మేరకు చేయాలి? అతిగా చేస్తే ఏమవుతుంది?

జిమ్ చేసే వాళ్లు ఏదైనా పార్టీకి వెళ్లి ఎక్కువ తినాల్సి వస్తే.. ‘రేపు ఓ రెండు గంటలు అదనంగా జిమ్ చేద్దాంలే. ఇవాళ్టికి లాగించేద్దాం’ అనుకుంటారు. ఇంకొందరేమో.. ‘రేపు వేరే పని ఉంది జిమ్‌కి వెళ్లడం కుదరదు. కాబట్టి ఈ రోజే ఓ గంట అదనంగా చేద్దాం’ అనుకుంటారు. ఇలా అవసరాలను బట్టి జిమ్‌లో చేసే వర్కవుట్స్, టైంని పెంచేస్తూ ఉంటారు. దాన్ని తట్టుకోలేక శరీరం ఇబ్బంది పడుతుంటుంది. అందుకే దేనికైనా ఒక పరిమితి అవసరం. దానికి మించి ఎక్కువ చేస్తే నష్టం తప్పదంటున్నారు నిపుణులు.
కొత్త సమస్యలు..
ఫిట్ నెస్ గురించి సరైన అవగాహన లేక కొంతమంది తక్కువ సమయంలో కండలు పెంచేయాలి అనుకుంటుంటారు. గంటల తరబడి జిమ్‌ల్లో గడుపుతూ కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. అయితే జిమ్ అనేది అవసరాన్ని బట్టి చేయాలి. ప్రతి వర్కవుట్‌కి వాళ్ల శరీర తీరుని బట్టి ఒక్కో నిర్ణీత సమయం ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా, నిపుణుల పర్యవేక్షణ లేకుండా కసరత్తులు చేస్తే కొన్ని సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. మరికొందరికి శ్వాసకోశాల్లో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముంది. మితిమీరి వ్యాయామాలు చేసేటప్పుడు గుండె వేగం.. సాధారణ వేగం కంటే మరీ ఎక్కువై ఐదు రెట్లు అధికమవుతుంది. కండరాలు విపరీతంగా నొప్పి పెడతాయి. చిరాకు, కోపం పెరుగుతాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈ లక్షణాలను ‘ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్’ అంటారు.
మితిమీరి వ్యాయామం చేయడం వల్ల ఎక్కువగా అలసి పోతారు. నిద్ర సరిగా పట్టదు. ఆ ప్రభావం కండరాలపై కూడా పడుతుంది. ముఖం కళ కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల చెమటలు ఎక్కువగా పడతాయి. దీని వల్ల డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి పూట ఎక్కువగా దాహం వేస్తుంటుంది. ఎక్కువగా పరిగెత్తడం, కార్డియో ఎక్కువ సేపు చేయడం వల్ల ఎముకలు అరిగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. వయసు పైబడిన వాళ్లు మడమలు, మోకాలి నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
ఇలా చేయాలి
- జిమ్ వర్కవుట్లు ప్రారంభించే వాళ్లు ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. వ్యాయామం మొదలుపెట్టేముందు బాడీ కండీషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. వైద్యుల సలహాను పాటించి మాత్రమే వ్యాయామాలు మొదలు పెట్టాలి.
- కొత్తగా వ్యాయామాన్ని స్టార్ట్ చేసే వాళ్లు ముందు మెల్లగా నడకతో ప్రారంభించాలి. శరీరాన్ని కొద్దికొద్దిగా వ్యాయామానికి అలవాటు చేయాలి. అందుకే ఏ వర్కవుట్ కైనా ముందు పదిహేను నిమిషాలు వామప్ అవసరం. వామప్ చేస్తే.. శరీరంలోని కండరాలు, ఎముకలు కసరత్తులు చేయడానికి సిద్ధమవుతాయి.
- ఏ వయసు వాళ్లయినా రోజుకి 30 నిమిషాల నుంచి గంటసేపు వర్కవుట్స్ చేస్తే చాలు. కండలు పెంచాలనుకునే వాళ్లకు ముందు నుంచే ప్రణాళిక ఉండాలి. అంటే మొదటి రోజు ఐదు నిముషాలు, రెండో రోజు పది, మూడో రోజు పదిహేను నిముషాలు ఇలా మెల్లగా కసరత్తు సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇందుకు ఫంక్షనల్ ట్రైనింగ్ పద్ధతిని ఎంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




