Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంసార జీవితంలో సంస్కార దీపం.. మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

అతి వేగంగా కాలం మారిపోతోంది. సామాన్య జీవితాలు సైతం వేగం పుంజుకుంటున్నాయి. అన్ని జీవితాలు పరుగుల జీవితాలు అయిపోతున్నాయి.

సంసార జీవితంలో సంస్కార దీపం.. మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే.?
Couple Romance
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2023 | 7:39 AM

అతి వేగంగా కాలం మారిపోతోంది. సామాన్య జీవితాలు సైతం వేగం పుంజుకుంటున్నాయి. అన్ని జీవితాలు పరుగుల జీవితాలు అయిపోతున్నాయి. అంతేకాక, ఎవరి జీవితం వారిదిగా మారిపోతోంది. ఆధునిక జీవనశైలి, సరికొత్త వ్యవహార శైలి, సెల్ ఫోన్లు, లాప్టాప్ లు, ఐపాడ్లు వగైరాలతో పిల్లలు ప్రాపంచిక విజ్ఞానంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం తీరును ఆధునిక పోకడలకు తగ్గట్టుగా మార్చాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అయితే పిల్లలను చదువులోనే కాక, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం బాగా ఉంది. ఆధునిక విజ్ఞానంతో పాటు అత్యుత్తమ సంస్కారాన్ని కూడా నేర్పడం వల్ల వారిని తమకు, తమ కుటుంబానికే కాక సమాజానికి కూడా ఉపయోగపడగల బాధ్యత కలిగిన వ్యక్తులుగా మార్చడానికి వీలుంటుంది. ఆధునిక మానసిక నిపుణుల ప్రకారం, ఇందుకు కొన్ని మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అనేక ప్రతికూల ధోరణులు చోటు చేసుకుంటున్న వారి పెంపకం మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. చదువులతోపాటు పిల్లలకు సంస్కారాన్ని నేర్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం అన్నది వారికి ఊహ తెలిసిన వయసు నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది.

పిల్లల కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించడం, ఇందుకు ప్రత్యేకంగా ప్లాన్ వేసుకోవడం సాధ్యం కాని విషయం. ఇటువంటిది సహజంగా జరిగి పోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంట్లో లేదా కుటుంబాల్లో ఏది చేసినా అందరూ కలిసే చేయటం వల్ల ఆశించిన ప్రయోజనం కలుగుతుంది. టీవీ చూడటం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండటం చాలా అవసరం. కబుర్లు చెప్పుకున్నా, భోజనం చేసినా, పూజ జరిపినా, ఆలయానికి వెళ్లినా, సినిమాకు పోయినా, బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్లినా అంతా కలిసే చేయటం వల్ల పిల్లలలో ఒక విధమైన సామాజిక స్పృహ ఏర్పడుతుంది. సామాజిక పరిస్థితుల పట్ల వారికి అవగాహన ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది.

ఇక ఇతరుల గురించి వారి పరోక్షంలో చెడుగా మాట్లాడటం పిల్లల ముందు చేయకపోవడం మంచిది. వారిలో అందరి పట్ల సమభావం పెరగటానికి ఇది అవరోధంగా మారుతుంది. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం వల్ల పిల్లలలో మహిళల విషయంలో సద్భావం ఏర్పడుతుంది. ఏ విషయం అయినా వారికి ప్రత్యేకంగా చెబుతున్నట్టు కాకుండా సందర్భ వశాత్తు చెబుతున్నట్టుగా చెప్పడం మంచిది. తరచూ సూక్తులు, హితోక్తులు చెప్పడం వల్ల వారిలో వాటి పట్ల ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. చిన్న వయసు నుంచే వారిలో ఆధ్యాత్మిక విలువలను పెంచడం వల్ల వారు భవిష్యత్తులో బడుగు వర్గాల పట్ల ఔదార్యంతో, ఆదర భావంతో వ్యవహరించడానికి వీలుంటుంది. వారిలో ఒకపక్క పోటీ తత్వాన్ని పెంచుతూనే వారు ఇతరుల పట్ల సానుభూతితో, సహనంతో వ్యవహరించడం కూడా నేర్పాల్సి ఉంటుంది. ఇదంతా పరోక్షంగా జరగాలి తప్ప, ప్రత్యక్షంగా ఒక పాఠం మాదిరిగా జరగడం వల్ల అసలు ప్రయోజనం దెబ్బతింటుంది.

పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగిన కుటుంబం యావత్తు అందులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. వాటి అర్ధాన్ని, ప్రయోజనాన్ని వారికి కొద్దికొద్దిగా తెలియజేస్తూ ఉండాలి. ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో అందరి పాత్ర ఉండే విధంగా వ్యవహరించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అందరూ కలిసే ప్రార్ధన చేయాలి. ఆచార సంప్రదాయాల గురించి ప్రస్తావించకుండానే వాటి మంచీ చెడుల గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అది తప్పనిసరిగా పిల్లల దృష్టిలో పడేలా చేయడం మంచిది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, చివరికి పక్కింటి వారికి సహాయం చేస్తున్నా దాన్ని పిల్లలకు తెలిసేలా చేయాలి.

వారి సమక్షంలో వాదించుకోవడం, దుర్భాషలాడటం వంటివి చేయడం మంచిది కాదు. అటువంటివి చేయడం వల్ల వారిలో ఆత్మ న్యూనతా భావం పెరుగుతుంది. ఆలయానికి లేదా మందిరానికి వెళ్లినప్పుడు వారికి కూడా అవకాశం ఇవ్వడం మంచిది. వారిని వీలైనంతగా అటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ప్రార్థనలు లేదా పూజలు నిర్వహిస్తున్న పక్షంలో పిల్లలు అందులో పాల్గొనడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్ధన చేయడం వల్ల కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సందర్భం వచ్చినప్పుడు అల్లా కొంత ప్రత్యక్షంగాను, కొంత పరోక్షంగానూ వారికి విలువలు, ప్రమాణాల గురించి తెలియజేయడం అవసరం. తప్పనిసరిగా మంచి ఏదో, చెడు ఏదో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొండితనం, తమ మాటే నెగ్గాలని పంతం, అతి స్వార్థం, ఆడంబరం వంటి లక్షణాలు వారిలో కనిపించినప్పుడు వారికి ఏదో విధంగా నచ్చజెప్పి మార్చాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వారికి మధ్య మధ్య చరిత్ర విశేషాలు, నీతి కథలు చెబుతూ ఉండటం వల్ల వారికి సమాజం పట్ల సరైన అవగాహన కలగటానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా వ్యవహరించడం వంటి లక్షణాలను చిన్న వయసు నుంచే నేర్పించడం చాలా ముఖ్యం. ప్రతిసారీ మీ మాటే చెల్లుబాటు కావాలని భావించకుండా మధ్యమధ్య పిల్లల మాటలకు కూడా విలువనివ్వడం వల్ల వారిలో ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.