Perfume Vs Deodorant: డియోడరెంట్ Vs పెర్ఫ్యూమ్.. రెండింటి మధ్య తేడా ఏంటి.. ఏది వాడాలి?
శరీరానికి సువాసనను అందించడమే లక్ష్యంగా పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు రూపొందించబడినప్పటికీ, వాటి తయారీ, ప్రభావం, వినియోగ విధానంలో కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి. వేసవిలో కొందరు అధిక చెమట కారణంగా రోజుకు 3-4 సార్లు వీటిని ఉపయోగిస్తుంటారు. దీని మీద ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. అసలు ఈ రెండింటి మధ్య ప్రధాన భేదాలేంటో, వాటిని ఎలా సరైన పద్ధతిలో వాడాలో తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ పెరిగింది. దీని ఫలితంగా కాస్మెటిక్ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. వ్యక్తిగత సౌందర్య దినచర్యలో భాగంగా పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్ల వాడకం సర్వసాధారణమైంది. ఇవి చెమట వల్ల వచ్చే దుర్వాసనను సమర్థవంతంగా అడ్డుకొని, రోజంతా తాజాగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు వీటిలో కనీసం ఒకటైనా ఉపయోగించడం అనివార్యంగా మారింది. నేటి కాలంలో వీటిని వాడనివారు బహుశా ఉండరేమో!
సువాసనలో తేడాలు :
పెర్ఫ్యూమ్‌లలో సువాసనకు కారణమయ్యే ముఖ్యమైన నూనెలు (ఎసెన్షియల్ ఆయిల్స్) 15-30 శాతం వరకు అధిక సాంద్రతలో ఉంటాయి. అందుకే వాటి సువాసన తీవ్రంగా ఉండి, ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. డియోడరెంట్లలో ఈ నూనెలు కేవలం 1-2 శాతం మాత్రమే ఉంటాయి.
దుర్వాసన నివారణ:
డియోడరెంట్లలో సువాసనతో పాటు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి చెమటను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడం ద్వారా దుర్వాసనను నియంత్రించడంలో సహాయపడతాయి. పెర్ఫ్యూమ్‌లలో ఈ లక్షణం ఉండదు.
సువాసన నిలిచే సమయం:
డియోడరెంట్ల సువాసన సాధారణంగా సుమారు 4 గంటల పాటు ఉంటుంది. పెర్ఫ్యూమ్‌ల సువాసన వాటి రకాన్ని బట్టి దాదాపు 12 గంటల వరకు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
సరైన వినియోగ పద్ధతులు
పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండూ సువాసనను ఇస్తప్పటికీ, వాటిని ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది.
పెర్ఫ్యూమ్ వాడకం: అధిక సాంద్రత కలిగిన పెర్ఫ్యూమ్‌లను చర్మంపై నేరుగా స్ప్రే చేయకుండా ఉండటం శ్రేయస్కరం. వాటిని సాధారణంగా దుస్తులపై మాత్రమే ఉపయోగించడం మంచిది.
డియోడరెంట్ వాడకం: చంకలు (అండర్ ఆర్మ్స్) వంటి అధిక చెమట పట్టే శరీర భాగాలపై డియోడరెంట్‌లను అప్లై చేయాలి. బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు చెమట వాసన మీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నిరోధించడంలో డియోడరెంట్‌లు కీలకం.
ధరల వ్యత్యాసం
పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్ల ధరలలో గణనీయమైన తేడా ఉంటుంది. సాధారణంగా డియోడరెంట్లు తక్కువ ధరలో లభిస్తాయి, అయితే పెర్ఫ్యూమ్‌లు అధిక ధర కలిగి ఉంటాయి. మార్కెట్లో అనేక బ్రాండ్లు, రకాల పెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.