Over Thinking: అతి ఆలోచనలకు చెక్ పెట్టండి.. ఈ జపనీస్ టెక్నిక్స్‌తో మానసిక ప్రశాంతత!
జీవితంలో సమస్యలు లేని వారంటూ ఉండరు. కానీ కొందరు వాటిని సమర్థంగా ఎదుర్కొంటే, మరికొందరు అతి ఆలోచనలతో (ఓవర్ థింకింగ్) మానసికంగా కుంగిపోతుంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం వల్ల పరిష్కారం దొరకకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతి ఆలోచనల నుంచి బయటపడటానికి జపనీస్ కొన్ని అద్భుతమైన టెక్నిక్స్‌ను సూచిస్తున్నారు. వీటిని క్రమంగా పాటిస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు.

సమస్యలు అందరికీ వస్తాయి. కానీ వాటిపై అతిగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడటానికి జపనీస్ కొన్ని అద్భుతమైన పద్ధతులను సూచిస్తున్నారు. ఈ సులభమైన టెక్నిక్స్‌తో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
1. షోగనై – అంగీకరించడం:
జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. ఊహించని సవాళ్లు ఎదురైనప్పుడు “ఇలా ఎందుకు జరిగింది?” అని బాధపడటం వల్ల ఎనర్జీ వృథా అవుతుంది. జపనీస్ దీనిని ‘షోగనై’ అంటారు, అంటే “మీ చేతిలో ఏమీ లేదు” అని అర్థం. పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే ఈ టెక్నిక్ సారం. అనవసరంగా బాధపడే బదులు, ఆ శక్తిని సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ ఫిలాసఫీ చెబుతుంది.
2. షిన్-రిన్ యొకు– అటవీ స్నానం:
వినడానికి వింతగా ఉన్నా, దీని అర్థం అడవిలో స్నానం చేయడం కాదు. పచ్చని ప్రకృతిలో గడపడం. ప్రకృతితో మమేకమైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్లు (ఒత్తిడి హార్మోన్లు) తగ్గిపోతాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, రిలాక్స్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అతి ఆలోచనలతో బాధపడేవారు అప్పుడప్పుడూ ప్రకృతిలో సమయం గడపడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమై, హాయిగా నిద్రపట్టేందుకు అవసరమైన హార్మోన్లు విడుదలవుతాయి. జపాన్‌లో ఈ పద్ధతిని విస్తృతంగా పాటిస్తారు.
3. జాజెన్– ధ్యానం:
మానసిక సమస్యలను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే రోజూ కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలని యోగా నిపుణులు సూచిస్తారు. జపనీస్ కూడా ‘జాజెన్’ (ధ్యానంలో కూర్చోవడం) అనే ఈ టెక్నిక్‌ను పాటిస్తారు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో, దేనిపైనా అతిగా భావోద్వేగ అనుబంధం లేకుండా, జరిగే వాటిని అంగీకరించే మనస్తత్వాన్ని పెంచుతుంది. అతి ఆలోచనాపరులకు ఇది ఒక మంచి మానసిక వ్యాయామం.
4. గమన్ – సవాళ్లు ఎదుర్కోవడం:
జీవితంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ధైర్యంగా, నిలకడగా ఎదుర్కోవడమే ‘గమన్’ టెక్నిక్. అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా, చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పరిష్కరించడం సాధ్యం కాకపోతే, ఆ ఆలోచనను వదిలేసి, ఆ కఠిన సమయం గడిచిపోయే వరకు ఓపిక పట్టాలి. ఉన్న చోట నుంచి చిన్న అడుగు ముందుకు వేసినా, అది క్రమంగా అలవాటుగా మారుతుంది.
5. ఇకెబానా– మనసును మళ్లించడం:
ఒక సమస్య వచ్చినప్పుడు అదే మూడ్‌లో ఉండిపోవడం వల్ల పరిష్కారం దొరకదు. బాధపడటం తప్పు కాదు, కానీ అప్పుడప్పుడూ మనసును మళ్లించడం అవసరం. ఇందుకు నచ్చిన పనులు చేయడం, లేదా కొత్త పనులు ప్రయత్నించడం మంచిది. జపనీస్ ‘ఇకెబానా’ అనే టెక్నిక్‌ను పాటిస్తారు, అంటే పూలను ఏదో ఒక ఆకారంలో అలంకరించడం. ఇది మెదడుకు వ్యాయామంతో పాటు, పూలతో గడపడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది.




