Obesity: ఉప్పెనలా ఊబకాయం.. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది ఊబకాయులే! నివేదికలో సంచలన విషయాలు
ఊబకాయంపై తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం, అధిక బరువుతో బాధపడతారని హెచ్చరించింది.

సాధారణ సమస్యగా కనిపించే అతి పెద్ద సమస్య ఊబకాయం.. ఇటీవల కాలంలో దీని బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఇది కేవలం సౌందర్య సమస్యగా చూడాల్సిన విషయం కాదన్నది నిపుణులు వాదన. ఊబకాయుల్లో గుండె జబ్బులు కూడా ప్రబలే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్(డబ్ల్యూఓఎఫ్) తన తాజా నివేదికలో పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ఊబకాయంపై తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం, అధిక బరువుతో బాధపడతారని హెచ్చరించింది. అప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా ప్రజలు ఈ సమస్యతో ప్రభావితమవుతారని తన తాజా నివేదికలో పేర్కొంది. అంటే రాబోయే దశాబ్దంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడనున్నారన్న మాట. ఆఫ్రికా, ఆసియాల్లోని తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ మేరకు భారీ పెరుగుదల నమోదవుతుందని తెలిపింది.
అబ్బాయిల్లోనే అధికం..
బాలిబాలికల్లో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2020కన్నా.. 2035 నాటికి 208 మిలియన్ల మంది అబ్బాయిలు, 175 మిలియన్ల మంది అమ్మాయిల్లో స్థూలకాయ రేటు రెట్టింపు కానుందని వెల్లడించింది. ఈ సమస్య వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా 4 ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రభావం పడుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు మూడు శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా నమోదవుతుందని అంచనా వేసిన 10 దేశాల్లో తొమ్మిది.. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ లేదా తక్కువ మధ్య ఆదాయ దేశాలే ఉంటాయని డబ్ల్యూఓఎఫ్ తన నివేదికలో పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు వెల్లడించింది. తాజా డేటాను ఐక్యరాజ్యసమితి విధాన రూపకర్తలు సభ్య దేశాలకు వచ్చేవారం అందజేయనున్నారు.
కారణాలు ఇవే..
అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీర శ్రమ తగ్గడం, ఆహార సరఫరా, మార్కెటింగ్ విధానాల్లో లోపాలు, బరువు నిర్వహణ, ఆరోగ్య విద్యలో తక్కువ వనరులతో కూడిన సేవలు.. ఈ సమస్య పెరుగుదలకు కారణమవుతాయని నివేదిక తెలిపింది.
ఇప్పుడే మేల్కోవాలి..
తాజా నివేదికపై ఈ ఫెడరేషన్ అధ్యక్షులు లూయిస్ బౌర్ మాట్లాడుతూ ఈ నివేదిక ప్రపంచానికొక హెచ్చరిక లాంటిదన్నారు. పరిస్థితి మరింత దిగజారకముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, యుక్తవయసు వారిలో ఊబకాయం రేటు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని.. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వాలు, విధానకర్తలు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..