AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Habits: ఫోన్‌ జేబులో.. ల్యాప్‌టాప్‌ ఒళ్లో ఉంచుతున్నారా? పురుషులు ఆ చాన్స్ కోల్పోయినట్టే!

మీ ఫోన్‌ను ఎప్పుడూ ప్యాంట్ జేబులో ఉంచుకుంటున్నారా? గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని పని చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే! ఈ అలవాట్లు పురుషులలో వీర్యకణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, నపుంసకత్వానికి (Impotence) దారితీస్తాయని తాజా భారతీయ పరిశోధన హెచ్చరిస్తోంది. కలకత్తా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి..

Tech Habits: ఫోన్‌ జేబులో.. ల్యాప్‌టాప్‌ ఒళ్లో ఉంచుతున్నారా? పురుషులు ఆ చాన్స్ కోల్పోయినట్టే!
Male Infertility Causes
Bhavani
|

Updated on: Dec 26, 2025 | 4:04 PM

Share

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, మన శరీరానికి అది సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. మొబైల్ రేడియేషన్ వల్ల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని కలకత్తా యూనివర్శిటీ మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువతకు ఈ ముప్పు 10 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం (Electromagnetic Radiation) పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుందని కలకత్తా యూనివర్శిటీ (CU) పరిశోధనలో తేలింది. గతంలో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తాజా అధ్యయనం బలమైన ఆధారాలను బయటపెట్టింది.

పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు: కలకత్తా యూనివర్శిటీ ప్రొఫెసర్ సుజయ్ ఘోష్ నేతృత్వంలోని బృందం 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల 1,200 మంది పురుషుల నమూనాలను విశ్లేషించింది.

జేబులో మొబైల్: రోజుకు 5 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకునే వారిలో వీర్యకణాల నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించారు.

ఒళ్లో ల్యాప్‌టాప్: ల్యాప్‌టాప్‌ను నేరుగా ఒడిలో పెట్టుకుని ఎక్కువ సేపు పనిచేయడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరిగి, వీర్యకణాల ఉత్పత్తి మందగిస్తుందని తేలింది.

అజూస్పెర్మియా (Azoospermia): పరిశోధనలో పాల్గొన్న వారిలో 708 మందిలో వీర్యకణాల లేమి (Zero sperm count) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.

ఎవరికి ఎక్కువ ముప్పు? ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువతలో కొన్ని రకాల జన్యు పరివర్తనాలు (Genetic Mutations) ఉన్నవారికి ఈ రేడియేషన్ ప్రభావం ఇతరుల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ ఘోష్ వెల్లడించారు. జన్యుపరమైన కారణాలు మరియు గాడ్జెట్ల వాడకం కలిస్తే అది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

నిపుణుల సూచనలు:

మొబైల్ ఫోన్లను ప్యాంట్ జేబులో కాకుండా బ్యాగుల్లో లేదా టేబుల్స్ మీద ఉంచడానికి ప్రయత్నించండి.

ల్యాప్‌టాప్ వాడుతున్నప్పుడు ‘ల్యాప్‌టాప్ ప్యాడ్’ లేదా టేబుల్ ఉపయోగించండి, నేరుగా శరీరంపై ఉంచుకోవద్దు.

సాధ్యమైనంత వరకు వైర్‌లెస్ పరికరాల వాడకాన్ని తగ్గించడం మంచిది.

గమనిక: ఈ సమాచారం కలకత్తా యూనివర్శిటీ పరిశోధనా నివేదిక ఆధారంగా అందించబడింది. సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు తగిన చికిత్స కోసం నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.