Current Bill: సమ్మర్‌లో ఈ టిప్స్ పాటిస్తే మీ కరెంటు బిల్లు సగానికి సగం ఆదా.. అవేంటో చూసేయండి..
ఎండాకాలం అప్పుడే మొదలైంది. దీంతో ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు గ్యాప్ లేకుండా వాడేస్తుంటారు. వీటి వల్ల కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఎంత ప్రయత్నించినా ఈ బిల్లుల మోత తగ్గించడం ఓ పట్టాన సాధ్యం కాదు. అందుకే ఈ ఎండాకాలంలో మీ కరెంటు బిల్లును ఇలాంటి చిట్కాలు పాటించి సగానికి సగం ఆదా చేసుకోవచ్చు. అవేంటో మీరూ చూసేయండి.

టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ కరెంటు వినియోగం కూడా రెంట్టింపవుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో కరెంటు బిల్లు భారం పడుతుంది. ఇప్పుడింక ప్రతి ఇంట్లో ఒకరికి సెల్ ఫోన్ కామన్ ఐపోయింది. దానికి తోడు వైఫై లు టీవీ రూటర్లు, లాప్ ట్యాప్ లు , ట్యాబ్లేట్లు ఇలా ఎటు చూసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో ఇల్లు ఓ మ్యూజియంలా కనిపిస్తుంటుంది. దీని సంగతి ఎలా ఉన్నా ఎండాకాలంలో మాత్రం వీటి వాడకాన్ని అదుపు చేయకుంటే మీ జేబుకు చిల్లు తప్పదు. ఉన్నంతలో కరెంటును ఎలా ఆదా చేయాలో చెప్పే టిప్స్ ఇవి..
ఫ్యాన్ శబ్దం చేస్తుంటే ఇలా చేయండి..
మీ ఇంట్లో నాన్ స్టాప్ గా ఫ్యాన్ ను వినియోగిస్తున్నారా..? అయితే ఈ సారి ఫ్యాన్ కొనేముందు ఈ టిప్స్ పాటించండి. బీఎల్‌డీసీ టెక్నాలజీతో తయారు చేసిన ఫ్యాన్లను వాడండి. వీటి వాడకంతో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. రెగ్యులేటర్లు పనిచేయకుండా ఉంటే వెంటనే మార్పించుకోండి. ఎందుకంటే ఫ్యాన్ ఫుల్ స్పీడుతో తిరిగితే బిల్లు అధికంగా వస్తుంది. 1 లేదా 2 వేగంతో తిరిగితే విద్యుత్తు ఆదా అవుతుంది. ఫ్యాన్ తరచూ శబ్దం చేస్తున్నా కూడా దాని మోటార్ లోడ్ ఎక్కువైందని అర్థం.. అది కరెంటు బిల్లును పెంచుతుంది.
ఏసీలు కొనేవారికి అలెర్ట్..
ఏసీలు కొనేవారు డిజైన్, ధర, కంపెనీతో పాటు చూడాల్సిన ముఖ్యమైన అంశం దాని స్టార్ రేటింగ్. 3 స్టార్ ఏసీలకు బదులుగా 5 స్టార్ ఏసీలనే ఎంచుకోండి. ఎప్పటికప్పుడు ఏసీ ఫిల్టర్లు క్లీన్ చేస్తుండాలి. ఏసీ సెట్టింగ్ ను 24 సెంటిగ్రేడ్ డిగ్రీల కన్నా ఎక్కువుండేలా చూసుకోవడం మించిది.
మీ కరెంటును లాగేసేవి ఇవే..
కరెంటు బిల్లు ఆదా చేయాలనుకునే వారు ముందుగా చేయాల్సిన పని మీ బల్బులను మార్చడమే. ఎందుకంటే ఫిలమెంట్ ఉన్న బల్బులు ఎక్కువ కరెంటును తీసుకుంటాయి. దానికి బదులుగా ఎల్ఈడీ బల్బులతో వాటిని రీప్లేస్ చేయండి. కరెంటు ఆదా చేయడంలో ఇవెంతో ముఖ్యం. 60 వాట్ల ఫిలమెంటు బల్బు ఇచ్చే వెలుగును కేవలం 9 వాట్స్ ఎల్‌ఈడీ బల్బు ఇస్తుంది.
ఫ్రిజ్ డోర్ తెరవకండి..
ఫ్రిజ్ విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఇది.. సమ్మర్ లో చల్లదనం కోసం అవసరం లేకపోయినా ఫ్రిడ్జ్ డోర్ తీయడం దాని ముందు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీరు అరగంట కూలింగ్ ను వేస్ట్ చేసినట్టే . అందుకే సాధ్యమైనంత తొందరగా ఫ్రిడ్జ్ డోర్ ను మూసివేయండి. అవసరం అయితే తప్ప ఎక్కువగా డోర్ తెరవకండి. మరీ ముఖ్యంగా ఫ్రిడ్జ్ వెనక భాగాన్ని గోడకు మరీ టైట్ గా ఆణించడం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గాలి బాగా తగిలి చల్లగా ఉండే చోట ఫ్రిడ్జ్ ను ఉంచేలా ప్లాన్ చేసుకోవాలి.
