ఏ పని మొదలు పెట్టినా తొందర పడకండి.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
మహాభారతంలోని మహాత్మా విదురుడు చెప్పిన నీతి సూత్రాలు నేటికీ మన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శ్రమ, తెలివితేటలు, ధైర్యం, ధర్మం అనే గుణాలను ఆయన్ను నడిపించాయి. విదుర నీతి ప్రకారం జీవిత విజయానికి ధైర్యమైన నిర్ణయాలు, సమయపాలన, మనస్సుపై నియంత్రణ అవసరం.

ఆలోచనాత్మకంగా వేసే అడుగు మాత్రమే విజయానికి పునాది అవుతుంది అని విదుర నీతి చెబుతుంది. మనం ఏ పని మొదలు పెట్టినా తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలని విదురుడు సూచిస్తాడు. విజయానికి మొదటి అడుగు ధైర్యంగా, స్థిరంగా ఉండాలి. ఆలోచనలతో తీసుకున్న నిర్ణయమే మన ప్రయాణాన్ని గమ్యం చేరుస్తుంది. శ్రమతో పాటు తెలివితేటలు కలిపి ముందుకు సాగడం ముఖ్యమని విదురుడు భావించాడు.
మహాభారతంలోని మహాత్మా విదురుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన రాజవంశంలో పుట్టకపోయినా.. తన తెలివితో నీతితో సమాజంలో గొప్ప స్థానం పొందాడు. విదురుడు జీవితంలో ధర్మం, సత్యం స్థానం చాలా గొప్పది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అందుకే విదురుడి మాటలు అప్పటి రాజులను ప్రభావితం చేయగలిగాయి.
విదురుడు ఎప్పుడూ పరిస్థితులకు లోబడి ధర్మాన్ని త్యజించలేదు. తన నిర్ణయాలు ధర్మం ఆధారంగా తీసుకున్నాడు. ధర్మానికి అనుగుణంగా జీవించడమే జీవిత విజయానికి పునాది అని విదురుడు నమ్మాడు. పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినా ధర్మాన్ని పట్టుకుని నిలబడిన విదురుడు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. విదురుడు చెప్పిన సూత్రాలు జీవిత సత్యాలను వివరించేలా ఉన్నాయి.
విదుర నీతి ప్రకారం నిజమైన జ్ఞాని ఒక పనిని ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలివేయడు. ఇబ్బందులు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటాడు. సహనం చూపించి నిరంతరం లక్ష్యం వైపు కదులుతాడు. అటువంటి వ్యక్తి స్థిరమైన సంకల్పంతో ముందుకు సాగి విజయాన్ని సొంతం చేసుకుంటాడు. ఓర్పు, పట్టుదల ఉన్నవాడు జీవితంలో గౌరవం పొందుతాడు.
సమయం విలువను గుర్తించడం జీవిత విజయానికి కీలకం అని విదురుడు చెప్పాడు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం మన విజయానికి సహాయపడుతుంది. సమయాన్ని వృథా చేయకుండా ఉపయోగించగలిగినవాడే నిజమైన విజేత. అనవసరమైన పనుల్లో సమయాన్ని గడపకుండా.. ప్రతి నిమిషం ఉపయోగపడే పని పెట్టుకోవాలి. సమయాన్ని గౌరవించే వ్యక్తి నిగ్రహం, విచక్షణను కూడా పెంపొందించుకుంటాడు.
మహాత్మా విదురుడు చెప్పినట్లు.. తన మనస్సుపై నియంత్రణ సాధించిన వ్యక్తి మాత్రమే నిజమైన జ్ఞాని. ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడు. మనస్సును జయించడం అనేది స్వీయ విజయానికి మార్గం. మనస్సుపై స్థిరమైన నియంత్రణ ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలడు.
