లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
యువత తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫలితంగా చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఆ తర్వాత కనాల్సిన వయసులో పిల్లల్ని కూడా కనడం లేదు. నిజానికి ఒకప్పుడు బాల్య వివాహాలు ఈ దేశంలో పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లో బాల్య వివాహాలకు బదులు ఆలస్యంగా వివాహం కావడం అన్నది సర్వ సాధారణంగా మారిపోతోంది.
రమేష్-శ్రీదేవి (వ్యక్తిగత గోప్యత దృష్ట్యా పేర్లు మార్చాం) తమ చిన్న కుమార్తె పెళ్లి విషయంలో నాలుగైదేళ్లుగా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రమేష్ రిటైరై ఆరేళ్లు గడిచిపోయాయి. గతంలో తమ పెద్ద కూతురు పెళ్లి విషయంలో కూడా తగిన వరుడు దొరక్క చాలా ఆలస్యమైంది. ఇప్పుడు చిన్న బిడ్డ విషయంలోనూ పరిస్థితి అలాగే ఉంది. అమ్మాయికేమో ఇప్పటికే 36 ఏళ్లు వచ్చేశాయి. బంధువులు, స్నేహితులు ఇంకెప్పుడు పెళ్లి చేస్తావని ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఓ నిట్టూర్పు విడుస్తున్నారు ఇద్దరు దంపతులు. ఆమె పెళ్లి విషయంలో తెలిసినవారంతా ఇప్పటికే చేతులెత్తేశారు. మ్యాట్రిమొనీ సైట్లకు సబ్ స్క్రైబ్ చేసుకోవడం కోసమే వేల రూపాయలు ఖర్చయ్యాయి. అమ్మాయి తెలివైనది, ఇప్పటికే మంచి పొజిషన్లో ఉంది. ఆరెంకెల జీతం. దీంతో ఆమెకు తగిన వరుడు దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోతోంది. పెళ్లీడు సమయంలో చాలా సంబంధాలొచ్చాయి. కానీ కెరీర్, ఉద్యోగం అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాక.. తగిన వరుడు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రిటైరైన రమేష్.. చిన్న అమ్మాయికి పెళ్లి చేసి హైదరాబాద్ మహానగరాన్ని విడిచి పెట్టి తన సొంతూళ్లో సెటిలై ప్రశాంతంగా కాలం గపుడుదామని అనుకుంటున్నారు. కానీ ఎంత వెదికినా తగిన సంబంధాలు దొరకడం లేదన్న ఆందోళన 66 ఏళ్ల వయసులో ఆయనకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
ట్రెండ్‌గా మారిపోయిందా?
ఇది ఇప్పుడు కేవలం రమేష్ దంపతుల కథ మాత్రమే కాదు. మెట్రో నగరాల్లో బాగా చదువుకొని కెరీర్‌కు ప్రాధాన్యమిచ్చి మంచి ఉద్యోగాల్లో సెటిలవుతున్న చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉంటోంది. తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫలితంగా చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఆ తర్వాత కనాల్సిన వయసులో పిల్లల్ని కూడా కనడం లేదు. మన దేశంలో యువతీ యువకుల సగటు పెళ్లి వయసు 24 నుంచి 25 ఏళ్లు. ఇక మన దేశ చట్టాలు, 1955 హిందూ వివాహ చట్టం ఆమోదించిన వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21. నిజానికి ఒకప్పుడు బాల్య వివాహాలు ఈ దేశంలో పెద్ద సమస్యగా ఉండేది. ఆ సమయంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ధేశించిన కనీస వయోపరిమితులు అవి. ఈ పరిస్థితి ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే కొన్ని వర్గాల్లోనూ కొనసాగుతున్నప్పటికీ నగరాల్లో పరిస్థితి మాత్రం చాలా వరకు మారుతోంది. ఓ రకంగా చెప్పాలంటే పూర్తి భిన్నంగా ఉందనే అనొచ్చు. మెట్రో నగరాల్లో బాల్య వివాహాలకు బదులు ఆలస్యంగా వివాహం కావడం అన్నది సర్వ సాధారణంగా మారిపోతోంది.
ఎందుకు ఆలస్యం? ఇందుకు 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి వ్యక్తిగత ఆశయాలు. ముందే చెప్పుకున్నట్టు పెళ్లి కన్నా ముందు… సెటిల్ కావడం ముఖ్యమని నగరాల్లోని నేటి యువత భావిస్తోంది. దీంతో కెరియర్‌పై పూర్తిగా దృష్టి పెట్టి ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి అంటున్నారు. తమ కాళ్లపై తాము నిలబడటం ముఖ్యమని భావిస్తున్నారు. కానీ వాళ్లు సెటిల్ అయ్యేసరికే వారి వయసు 30 దాటిపోతోంది. సరైన ఉద్యోగం వచ్చి ఆపై మంచి ప్రమోషన్, చెప్పుకోదగ్గ జీతం వచ్చే సరికి చాలా మందికి 35 ఏళ్లు వచ్చేస్తున్నాయి. అక్కడితో ఆగడం లేదు. ఆ వయసులో తమకు తగ్గ వధూ, వరూలు అంటే తమ స్థాయి లేదా అంత కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వారి కోసం వారి వెతుకులాట మొదలవుతోంది. ఆ వెతుకులాటలో అదృష్టవశాత్తు ఎవరైనా దొరికితే వెంటనే వివాహాలు అయిపోతున్నాయి. కానీ ఎంత మందికి అదృష్టం తలుపుతడుతుంది? అందులో అలా మంచి సంబంధం కోసం వెతికి వెతికి మరో 2-3 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈలోగా పెళ్లి వయసు దాటి పిల్లల్ని కనే వయసు వచ్చేస్తోంది. కానీ అప్పటికీ లగ్నం కుదరడం లేదు.
ఏ వయసుకు ఆ ముచ్చట…
ఇది మన పెద్దలు చెప్పిన మాట. ఇప్పటి పరిస్థితని గమనిస్తున్న సామాజిక వేత్తలు కూడా అదే మాట చెబుతున్నారు. అన్ని విషయాల్లోనూ పాశ్చాత్య దేశాల ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే మనం ఇప్పుడు పెళ్లి విషయంలోనూ అదే చేస్తున్నామన్నది వారి మాట. లేట్ మ్యారేజెస్ వారి పుణ్యమేనని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. కానీ ఇలా చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్, ఉద్యోగం అంటూ వెంటపడి, తర్వాత ప్రయాస పడినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అదే జరిగితే మన దేశంలోనూ భవిష్యత్తులో యువత సంఖ్య గణనీయంగా పడిపోతుందని, అప్పుడు అమెరికా, జపాన్ దేశాల్లో ఇక్కడ కూడా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని, తరాల మధ్య భారీ వ్యత్యాసం వచ్చి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అది కేవలం మానవ సంబంధాల విషయంలోనే కాదు దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వచ్చే పది పదిహేనేళ్లలో జనరేష్ గ్యాప్ ఒక్కసారిగా పెరిగిపోతుందని, ఆ పై 60 ఏళ్ల తండ్రికి 15 ఏళ్ల బిడ్డను చూడాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదన్నది వారి మాట. అదే పరిస్థితి తలెత్తితే.. వయసుడిగిన తండ్రి బిడ్డ భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇది…! పరిస్థితి
లేటుగా పెళ్లయితే.. పిల్లలు పుడతారా?
గడిచిన కొన్నేళ్లలో దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి భారత్‌లో సంతానోత్పత్తి రేటు 1.29కి పడిపోతుందని 2024 మార్చిలో విడుదలైన లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. ఇటీవల కాలంలో ప్రతి చిన్న పట్టణంలో కూడా సంతానోత్పత్తి సాఫల్య కేంద్రాలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా స్త్రీ-పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం 20 నుంచి 30 ఏళ్ల వయసులో బాగా ఉంటుందన్నది వైద్యుల మాట. 30 దాటిన తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచించని నేటి తరం.. ఇక పిల్లల గురించి ఏం ఆలోచిస్తుందన్నది వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఐవీఎఫ్ కేంద్రాలకు 45 ఏళ్ల వయసు వారు కూడా వస్తున్నారట. ఆలస్యమవుతున్న వివాహాలు, క్షణం తీరిక లేని కెరీర్, ఆ పై వృత్తి పరమైన ఒత్తిళ్లు వీటి ఫలితంగా వ్యక్తిగత జీవితాలను కోల్పోతున్నారు. నిజానికి 30 ఏళ్ల పైబడిన వారిలో సంతానోత్పత్తి సామర్ధ్యం ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తుంది. అలాంటి వారికి ఐవీఎఫ్ చికిత్స ద్వారా ప్రయత్నించినప్పటికీ అవకాశాలు మెరుగ్గా ఉండటం లేదని డాక్టర్ నూపుర్ గుప్త టీవీ9తో చెప్పారు. అయితే నగరాల్లో ఆర్థికంగా బాగా స్థిరపడ్డ వారు ఈ మధ్య కాలంలో “ఫ్రీజింగ్ ఎగ్స్” అనే కొత్త విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారికి ఇది కొంత వరకు మంచిదే అయినప్పటికీ 40 దాటాక పిల్లలు పుడితే పెంపకం విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వాదన కూడా ఉంది.
మహిళల్లో శారీరక సమస్యలు
మన దేశంలో 30 ఏళ్లు దాటిన మహిళల్లో విటమిన్ డి- కాల్షియం-ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వీటి వల్ల సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఇక పురుషుల్లో 30-35 ఏళ్ల మధ్యలో సహజంగా జన్యు పరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక వాటికి తోడు ప్రస్తుతం బీపీ, డయాబెటిస్ సర్వ సాధారణమైపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న తల్లి-తండ్రి ఇద్దరూ ఆరోగ్యవంతమైన బిడ్డల్ని ఎలా కనగలరు? ప్రస్తుతం లేటు వయసు వివాహాల కారణంగా ఆ తర్వాత పుట్టే పిల్లల్లో తరచు క్రోమోజోల లోపాలు కనిపిస్తున్నాయని డాక్టర్ నూపర్ చెప్పారు. 30 ఏళ్ల లోపు స్త్రీలలో అండాలు, పురుషులలో వీర్య కణాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. వాటి కలయిక వల్ల కలిగే పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుడతారు. కానీ వయసు పెరిగే కొద్దీ వాటి శక్తి తగ్గుతూ వస్తుంది. ఫలితంగా పుట్టే పిల్లల్లో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నది వైద్యుల మాట.
మానసిక సమస్యలు
కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నది వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని కనే జంట.. మరో బిడ్డను కనేందుకు సిద్ధపడరు. దానికి తోడు దేశంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య నానాటికి కరవైపోతోంది. ప్రధానంగా ఇంట్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల కన్న ఒక్క బిడ్డకు కూడా అవసమైనంత సమయాన్ని కేటాయించే పరిస్థితులు ఉండటం లేదు. దాంతో ఎన్ని రకాలుగా ఆ బిడ్డను ఎంగేజ్ చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ తల్లి స్పర్శ, తండ్రి లాలనతో అవేవీ సమానం కాకపోవడంతో పిల్లల్లో ఒంటరితనం పెరిగిపోతోంది. అటువంటి పరిస్థితుల కారణంగానే పిల్లలు గాడ్జెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భావోద్వేగ సంబంధాలు తగ్గిపోతున్నాయి. దీంతో పిల్లల్లో చాలా చిన్న వయసులోనే మానసిక రుగ్మతలు ఎక్కువవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా లేట్ మ్యారేజెస్ చాలా సర్వ సాధారణమైపోతున్నాయి. ఫలితంగా చాలా అనర్థాలను కొని తెచ్చుకున్నట్టవుతోంది. సాధారణంగా 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో తమ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపార పరమైన బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండేది ఆ వయసులోనే. కానీ పెళ్లి 40 ఏళ్లకు చేసుకొని 42-43 ఏళ్ల వయసులో అతి కష్టమ్మీద పిల్లల్ని కంటే… 45 ఏళ్ల వయసులో నెత్తిన మోయలేనంత భారం ఉండగా.. వాళ్లు పిల్లల బాగోగుల్ని ఎలా పట్టించుకుంటారు. అదీగాక.. వారు రిటైర్ అయ్యే సమయానికి పిల్లలు ఉన్నత చదువులకు వస్తారు. అప్పటికే చదువుకోసం పెట్టే ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. కానీ అదే సమయంలో వారి ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోతుంది. వాళ్ల బాధ్యతల్ని సక్రమంగా నెర వేర్చాల్సిన సమయంలో వారికి కేవలం వయసు మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా సహకరించదు. మొదటి నుంచి ఆర్థికంగా స్థితిమంతులైతే పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చేమో కానీ, మధ్య తరగతి జీవికి మాత్రం కష్టాలు తప్పవు.
అదే అబ్బాయికి పాతికేళ్ల వయసులో అమ్మాయికి 22-23 ఏళ్ల వయసులో పెళ్లి చేస్తే.. వాళ్లు కెరీర్‌లో బిజీ అయ్యే సమయానికే పిల్లలు 8-9 ఏళ్ల వయసుకొస్తారు వాళ్ల పనులు వాళ్లు చేసుకునే స్థితికి చేరుకుంటారు. మీకు 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు వారి చదువు పూర్తయి సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రిటైర్ అయ్యే సమయానికి వారిపై ఎలాంటి బాధ్యతలు పెద్దగా ఉండవు. అంతే కాదు అబ్బాయి-అమ్మాయి 3 పదులు దాటకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన ఏర్పరుచుకునేందుకు తగిన సమయం ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవాలన్ను చాలా తొందరగా సర్దుకుపోతారు.
లాభాలు కూడా ఉన్నాయా?
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లేట్ మ్యారెజెస్ వల్ల లాభాలు కూడా లేకపోలేదు అంటున్నారు మరి కొందరు. ప్రస్తుతం అన్ని విధాల అభివృద్ధి చెందిన వైద్య సౌకర్యాల కారణంగా 40 ఏళ్ల తర్వాత కూడా సురక్షితంగా బిడ్డల్ని కనే అవకాశం ఉందని చెబుతున్నారు. కెరిర్లో పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఆర్థికంగా తగిన వెసులు బాటు వస్తుందని ఫలితంగా పిల్లల్నికి మంచి నాణ్యమైన భవిష్యత్తు ఇవ్వచ్చన్నది వారి వాదన. గతంలో పెళ్లి అంటే అబ్బాయి ఏం చేస్తున్నాడని మాత్రమే అడిగేవారు. ఆయన సంపాదన పరుడైతే చాలు పెళ్లి చేసేసేవారు. ఫలితంగా కుటుంబంలో ఒక్కరే సంపాదించడం వల్ల ఆర్థికంగా పెద్దగా వెసులు బాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం వస్తోంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు… సహజంగానే మానసికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఆరోగ్య పరంగా కూడా సంతోషంగా ఉండొచ్చు. అలాగే లేట్ మ్యారేజెస్ వల్ల ఇద్దరిలోనూ వయసు పరంగా కొంత పరిణితి కనిపిస్తుంది. అది సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుంది. ఫలితంగా ప్రతి చిన్న విషయానికి తగువులాడుకొని విడిపోయే పరిస్థితి ఉండదు.
మహిళల సాధికారిత పెరిగిన తర్వాత.. వారే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. ఈ సమయంలో కెరీర్లో ఎదుగుతున్న సమయంలో పెళ్లి వారికి అడ్డంకిగానే కనిపిస్తోంది. అందుకే ఆలస్యమైనా సరే ముందుగా కెరీర్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి అంటున్నారు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు పిల్లల్ని పెంచడం పెద్ద ఇబ్బంది కాదన్నది కొంత వీరి మాట. ఆర్థికంగా స్థిరపడటం వల్ల ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని, ఫలితంగా ఇష్టమైన పనిని వయసు పెరిగినప్పటికీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే పెళ్లి అన్నది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఈ విషయంలో ఎవరికి వారే వారి వారి భవిష్యత్తును, ఆర్థిక పరిస్థితిని, మానసిక స్థితిని దృష్టి లో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఒకరితో ఒకరు పోల్చుకోవడం కూడా కుదరదు. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా హాయిగా జీవనం సాగిపోయేలా చూసుకుంటూ, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చే ప్లాన్ చేసుకంటే మంచిదన్నది నిపుణులు చెప్పే మాట.
(టీవీ9 భారత్ వర్ష్ జర్నలిస్ట్ Gunjan Mittal అందించిన ఇన్ పుట్స్ ఆధారంగా రాసిన కథనం)
మరిన్ని ప్రీమియం వార్తల కోసం