ఫేస్‌వాష్‌ను ఎంత మోతాదులో వాడాలి? ముఖం కడుక్కునే సరైన పద్ధతి ఏంటో నిపుణులు చెబుతున్నారు!
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఫేస్‌వాష్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ సూచనల ప్రకారం, పొడి ముఖంపై నేరుగా ఫేస్‌వాష్ రాయకూడదు. ముందుగా ముఖాన్ని నీటితో తడిపిన తరువాత మాత్రమే ఫేస్‌వాష్‌ను తీసుకోవాలి. సుమారు 30 సెకన్ల పాటు సున్నితంగా మసాజ్ చేసి కడిగేయాలి. చర్మాన్ని గట్టిగా రుద్దడం వల్ల చికాకు, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. రోజులో రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవడం, ఆ తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాయడం చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పూర్తి వివరంగా ఇప్పుడు చూద్దాం..

మనం అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం అనేక రకాల చర్మ సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటాం. స్కిన్ కేర్ రొటీన్‌లో అన్నింటికంటే మొదటి, అత్యంత కీలకమైన అడుగు ఫేస్‌వాష్ చేయడం. అయితే రోజూ ముఖం కడుక్కునేటప్పుడు చాలామంది కొన్ని చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల చర్మానికి మేలు జరగకపోగా, వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఫేస్‌వాష్‌ను ఎంత పరిమాణంలో వాడాలి? ముఖం శుభ్రం చేసుకునే సరైన పద్ధతి ఏమిటి అనే విషయాలపై ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ ఆంచల్ పంత్ పలు విలువైన సూచనలు చేశారు.
మనం చేసే సాధారణ పొరపాట్లు:
చాలామంది పొడిగా ఉన్న ముఖంపై నేరుగా ఫేస్‌వాష్ రాస్తుంటారు. అలాగే అవసరానికి మించి ఎక్కువ ఫేస్‌వాష్‌ను ఉపయోగించడం, ముఖాన్ని గట్టిగా రుద్దడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పైపొర దెబ్బతిని, చికాకు, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.
ఫేస్‌వాష్ చేసే సరైన విధానం:
మొదట తడి చేసుకోవాలి: ఫేస్‌వాష్ రాసే ముందు చేతులు, ముఖాన్ని శుభ్రమైన నీటితో పూర్తిగా తడిపి తేమ చేసుకోవాలి.
సరైన మోతాదు: ముఖం శుభ్రం చేసుకోవడానికి కేవలం ఒక నాణెం పరిమాణంలో మాత్రమే ఫేస్‌వాష్‌ను తీసుకోవాలి. మీ చర్మ తత్వానికి (డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్) సరిపోయే మైండ్ క్లెన్సర్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
సున్నితమైన మసాజ్: ఫేస్‌వాష్‌ను ముఖంపై రాసి, ముక్కు చుట్టూ, ముఖం అంచుల వద్ద సుమారు 30 సెకన్ల పాటు వేళ్లతో చాలా మెత్తగా మసాజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు.
శుభ్రపరచడం మరియు ఆరబెట్టడం: ఆ తర్వాత మంచి నీటితో ముఖాన్ని పూర్తిగా కడిగేయాలి. ముఖాన్ని తుడిచేటప్పుడు టవల్‌తో గట్టిగా రుద్దకుండా, కేవలం సున్నితంగా అద్దుకోవాలి (Pat dry). ఆ వెంటనే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు.
View this post on Instagram
రోజులో ఎన్నిసార్లు ముఖం కడగాలి?
సాధారణంగా రోజుకు రెండుసార్లు (ఉదయం నిద్రలేచాక, రాత్రి పడుకునే ముందు) ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం సరిపోతుంది. ఒకవేళ బయటికి వెళ్లి వచ్చినప్పుడు లేదా ఎక్కువ ధూళి తగిలినప్పుడు మాత్రమే అవసరానికి తగినట్లుగా ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీ చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.




