దుర్గమ్మ విగ్రహం దగ్గర ఇది గమనించారా? వేయి మాటల్లో చెప్పలేని గొప్ప సందేశం
కోల్‌కతాలోని ఓ దుర్గా పూజ మండపంలో కనిపించిన ఓ చిన్న దృష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుర్గమ్మ విగ్రహం కింద కళాకారుడు తన పేరుతో పాటు కూతురి పేరును కూడా చేర్చడం నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఇంతకీ ఆ బోర్డుపై ఏముంది? తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చాటుతున్న ఆ ప్రత్యేకత ఏంటి?

కొన్నిసార్లు గొప్ప సందేశాన్ని అందించడానికి పెద్ద మాటలు, గంటల ప్రసంగాలు అవసరం లేదు. ఓ చిన్న చర్య చాలు.. గొప్ప సందేశంతో అందరి మనసులను గెలుచుకోవచ్చు. కోల్‌కతాలోని ఓ దుర్గా పూజ మండపంలో కనిపించిన ఇలాంటి చిన్న విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. దుర్గమ్మ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు తన పేరుతో పాటు కూతురి పేరును కూడా ప్రస్తావించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ చిన్న చర్యతో గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఆ కళాకారుడు.
ఇటీవల కోల్‌కతాలోని హట్ఖోలా ప్రాంతంలో ఉన్న దుర్గా పూజ మండపాన్ని సందర్శించిన ఓ వ్యక్తి అక్కడ ఆసక్తికరమైన విషయాన్ని గమనించాడు. దుర్గమ్మ విగ్రహం కింద ఏర్పాటు చేసిన చిన్న బోర్డుపై కళాకారుడి పేరు ‘స్వపన్ పాల్ అండ్ డాటర్’ (Swapan Paul & Daughter) అని రాసి ఉంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దాతలు లేదా కళాకారుల పేర్లతో పాటు కుమారుల పేర్లను (& Sons అంటూ) ప్రస్తావించడం కనిపిస్తుంటుంది. అయితే, ఇక్కడ & Daughter అంటూ తన కూతురికి కూడా సమానంగా గుర్తింపు ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.
దుర్గా పూజ మండపాన్ని సందర్శించిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిర్వాహకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి తన కూతురిని తనతో పాటు గుర్తించడం వెనుక ఉన్న ప్రేమ, గర్వం, సమానత్వ భావన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
ఇన్‌స్టా పోస్ట్
View this post on Instagram
ఈ వీడియో చూసిన నెటిజన్లు తండ్రి ఆలోచనను అభినందిస్తున్నారు. తండ్రి, కూతురి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇది గుర్తుచేసే గొప్ప సందేశం ఇస్తోందని కొందరు అభివర్ణించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ఉదాహరణలు కనిపించడం ఆనందంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. దుర్గా పూజ వేడుకలో ఇలాంటి విషయాన్ని చూడటం గర్వంగా ఉందని స్థానికుడు ఒకరు స్పందించారు.
కూతుళ్లకు కూడా సమానమైన గుర్తింపు, అవకాశాలు ఇవ్వాలనే సందేశాన్ని ఈ చిన్న చర్య మరోసారి గుర్తు చేస్తోంది. ప్రేమను, గౌరవాన్ని చాటడానికి గొప్ప బహుమతులే అవసరం లేదని.. మనతో పాటు ఎదుటివారిని గుర్తించడం కూడా ఎంతో విలువైనదని ఈ ఘటన తెలియజేస్తోంది.
