AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డ వారిలో ఎంత మందికి శిక్షలు పడుతున్నాయి?

ఏసీబీ అవినీతిపరులను పట్టుకున్నా, కోర్టుల్లో శిక్ష పడటం కష్టతరంగా మారుతోంది. ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలు, న్యాయస్థానాల్లో విచారణ జాప్యం, న్యాయమూర్తుల కొరత వంటి కారణాలతో శిక్షల శాతం తక్కువగా ఉంటోంది. .. ..

లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డ వారిలో ఎంత మందికి శిక్షలు పడుతున్నాయి?
Acb Corruption Cases
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2026 | 12:30 PM

Share

అవినీతిపరులను, లంచాలు తీసుకునే వారిని పట్టుకోవడంలో ఏసీబీ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ కేసుల్లో శిక్షలు పడటం అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియగా మారుతోంది. ఏసీబీ పట్టుకున్న వారిలో ఎంతమందికి నిజంగా శిక్షలు పడుతున్నాయి, నిందితులు నిర్దోషులుగా బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది చర్చనీయాంశం. ఏసీబీ ప్రధానంగా రెండు రకాల కేసులను నమోదు చేస్తుంది. మొదటిది, ట్రాప్ కేసు. ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది పౌరుల నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. లంచం ఇవ్వదలుచుకున్న పౌరులు ముందుగానే ఏసీబీని సంప్రదించి, రసాయనం పూసిన నోట్లతో అధికారిని పట్టుకునేందుకు సహకరిస్తారు. రెండోది, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. తరచుగా ఫిర్యాదులు వచ్చిన అధికారి లేదా సిబ్బందిపై ఏసీబీ నిఘా పెడుతుంది. వారి జీతం, ఇతర సక్రమ ఆదాయ మార్గాలు పోను, అక్రమంగా ఆర్జించిన ఆస్తులు, పన్ను కట్టకుండా దాచిన సొమ్మును గుర్తించి కేసు నమోదు చేస్తుంది. ఈ కేసుల్లో నిందితుడి ఇళ్లతో పాటు, బినామీలు, బంధుమిత్రుల ఇళ్లపైనా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి పత్రాలు, బంగారం వంటివాటిని స్వాధీనం చేసుకుంటారు.

ఈ రెండు రకాల కేసుల నమోదు వరకు ఏసీబీ సమర్థవంతంగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాతే అసలు సమస్యలు ఎదురవుతాయి. అవినీతిపరులను పట్టుకోవడం ఒక ఎత్తయితే, కోర్టుల్లో వారు నేరం చేశారని నిరూపించడం మరో ఎత్తు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఏసీబీ కేసులు వివిధ అధికారుల మీద పెండింగ్‌లో ఉన్నాయి. ఏటా సుమారు 200 కేసులు కోర్టులకు వెళ్తుంటే, కేవలం 150 వరకు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. చట్టాల్లో లొసుగులు వాడుకుని చాలామంది అవినీతిపరులు నిర్దోషులుగా బయటపడి, ఎప్పటిలాగే తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. శిక్షల శాతం తక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. ట్రాప్ కేసుల్లో మూడు నెలల్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరు నెలల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఏసీబీ తరచుగా దాన్ని పాటించలేకపోతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో, నిందితుడి ఆస్తుల మూలాలను విచారించి, అవి అక్రమ సంపాదన అని నిరూపించడానికి సమయం పడుతుంది. ఈ జాప్యం ఛార్జ్ షీట్ దాఖలును ఆలస్యం చేస్తుంది. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా కోర్టు విచారణ మరింత ఆలస్యం అవుతుంది. ఏసీబీ కోర్టుల్లో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం, కోర్టులపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కేసులను వాయిదా వేయడం జరుగుతుంది. ఇలా వాయిదాలు పడటం వల్ల కేసును మొదట పట్టుకున్న అధికారుల్లో, అలాగే లాయర్లలో ఉన్న ఉత్సాహం, ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఏడాది, రెండేళ్ల పాటు విచారణ సాగితే, అధికారులు బదిలీ అయ్యి వేరే చోటికి వెళ్ళిపోతారు. వారు బదిలీ అయినప్పటికీ ప్రతి విచారణకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది, ఇది ఒక సమస్యగా మారుతుంది.

ఇంకోవైపు, ఏసీబీ కేసుల్లో దొరికిన అధికారి కొంతకాలం సైలెంట్‌గా ఉన్న తర్వాత, తన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఏసీబీ అధికారులతోనో లేదా ఏసీబీ తరపు న్యాయవాదులతోనో కుమ్మక్కై, చట్టాల్లోని లోపాలను ఉపయోగించుకుని కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ ఆలస్యమయ్యే కొద్దీ, నిందితులు కోర్టుకు వెళ్లి, విచారణ ఆలస్యం అవుతున్నందున తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిటిషన్లు వేస్తారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం, ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను బట్టి కొంత సమయం దాటిన తర్వాత కోర్టులు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తాయి. దీంతో ఏసీబీ కేసు నడుస్తూ ఉండగానే, నిందితుడు మళ్లీ ఉద్యోగంలోకి వచ్చి, తన పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ న్యాయపరమైన ప్రక్రియలోని లోపాల వల్ల ఏసీబీ కేసుల సక్సెస్ రేటు తగ్గిపోతోంది.

Follow Us