AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కీలక నిర్ణయం ఇదే!

Telangana Gurukuls: తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యార్థులకు దుస్తుల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. నైట్ డ్రెస్‌లు, ట్రాక్ సూట్లు, పీటీ దుస్తులు నవంబరులోగా అందించనున్నారు. రెండో జత యూనిఫాంల పంపిణీ త్వరలోనే ప్రారంభమవుతుంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా, 10% అదనపు దుస్తులను నిల్వ ఉంచాలని నిర్ణయించారు. సకాలంలో విద్యార్థులకు వస్తువులు అందేలా పర్యవేక్షణ కొనసాగుతోంది.

గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కీలక నిర్ణయం ఇదే!
Telangana Gurukuls
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 12:17 PM

Share

Telangana Gurukuls: తెలంగాణలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన దుస్తుల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రకాల యూనిఫాంలు, క్రీడా దుస్తులు విద్యార్థులకు అందించడంలో ఎదురవుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు సంబంధిత అధికారులు కార్యాచరణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నైట్‌ డ్రెస్‌లు, ట్రాక్‌ సూట్లు, పీటీ దుస్తులను నవంబరులోగా విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. ఎస్సీ గురుకుల సొసైటీ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ఛైర్మన్‌ రవి నాయక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు సరఫరా చేయనున్న దుస్తుల డిజైన్లు, నమూనాల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. వాటికి ఆమోదం లభించడంతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు.

విద్యార్థులకు రెండో జత యూనిఫాంలు అందించేందుకు అవసరమైన వస్త్రాలను సమకూర్చడంతో పాటు కుట్టు పనులకు పంపించారు. దీంతో ఈ దుస్తుల పంపిణీ త్వరలోనే ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లోగా విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవి నాయక్‌ తెలిపారు. ఇక వైట్‌ యూనిఫాంల సరఫరాకు సంబంధించి వర్క్‌ ఆర్డర్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని కూడా విద్యార్థులకు అందించనున్నారు.

గురుకులాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దుస్తులను సమకూర్చడంతోపాటు, భవిష్యత్తులో అదనపు అవసరాలు ఏర్పడినా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. సాధారణ అవసరాల కంటే 10 శాతం ఎక్కువ దుస్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యలో మార్పులు వచ్చినా ఈ నిల్వలు ఉపయోగపడనున్నాయి.

విద్యార్థులకు అందించే దుస్తులు, ఇతర సామగ్రి నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు రవి నాయక్‌ స్పష్టం చేశారు. సరఫరా చేసిన వస్తువుల్లో నాణ్యతా లోపాలు బయటపడితే సంబంధిత గుత్తేదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులు నిర్ణీత సమయంలో అందేలా సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Follow Us