స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు మీకు ఉందా..? అయితే ఇది మీకోసమే..!
కొంతమందిలో బలపం తినే అలవాటు కనిపించడం అనేది ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. దీని వెనుక పోషక లోపాలు, మానసిక ఒత్తిడి వంటి కారణాలుంటాయి. ఇప్పుడు మనం బలపం తినే అలవాటు ఎందుకు వస్తుంది. దాన్ని ఎలా నియంత్రించాలో వివరంగా తెలుసుకుందాం.

మనలో కొంతమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా మట్టిబిళ్లలు, స్లేట్ పెన్సిల్స్ ని తినే అలవాటు ఉంటుంది. ఈ సమస్యను వైద్య శాస్త్రంలో పికా డిజార్డర్ అని పిలుస్తారు. ఇది సాధారణ అలవాటు కాదని గుర్తించాలి. ఇది శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల లేదా మానసిక ఒత్తిడి, భావోద్వేగాల అసమతుల్యత వంటి కారణాల వల్ల కలిగే ఒక అస్వస్థత. అయితే సరైన మార్గదర్శకంతో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ అలవాటును పూర్తిగా మానుకోవచ్చు.
పికా సమస్య కలిగిన వారిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాల లోపం కనిపిస్తుంది. ఈ పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను మన రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. పాల పదార్థాలు, ఆకుకూరలు, కందిపప్పు, బాదం, నువ్వులు వంటివి పోషక విలువలు అధికంగా కలిగినవి. ఇవి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మినరల్స్ అందించి బలహీనతను తగ్గించవచ్చు.
బలపం తినే అలవాటు కొంతవరకు డీహైడ్రేషన్ కారణంగా కూడా ఏర్పడుతుంది. శరీరానికి తగినంత నీరు లేకపోతే మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. అందువల్ల ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడం అవసరం. కొబ్బరి నీరు, తేనె కలిపిన నీరు వంటి రుచికరమైన డ్రింక్స్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
ఎప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు లేదా బోరుగా అనిపించినప్పుడు చాలా మందికి బలపం తినాలనిపిస్తుంది. అందుకే నోరుకు పని ఉండేలా ఆరోగ్యకరమైన అలవాట్లు వేసుకోవాలి. తీపి లేకుండా ఉండే చూయింగ్ గమ్స్ నమలడం, ఎండు ద్రాక్ష, వేరుశెనగలు వంటి స్నాక్స్ తినడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. ఇవి నోరును బిజీగా ఉంచి ఇలాంటి అలవాట్లను దూరం చేస్తాయి.
ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం వంటివి కూడా బలపం తినే అలవాటుకు దారి తీస్తాయి. మనసుకు రిలీఫ్ కలిగించే యోగా, ధ్యానం, ఉదయాన్నే నడక వంటివి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి. పాటలు వినడం, ప్రకృతిలో కొద్దిసేపు గడపడం వంటివి మానసికంగా విశ్రాంతిని ఇస్తాయి.
బలపం తినాలనే ఆలోచన మనసులోకి రాకుండా ఉండాలంటే మీకు నచ్చిన పనుల్లో సమయాన్ని గడపండి. డ్రాయింగ్, పెయింటింగ్, కథలు చదవడం, సంగీతం విన్నడం, నేచర్ వాక్ చేయడం వంటివి చేయడం వల్ల ఈ అలవాట్లను మరచిపోయేలా చేస్తుంది.
మీ చుట్టూ స్లేట్ పెన్సిల్స్ వంటి పదార్థాలు ఉంటే మళ్ళీ తినాలనే ఆలోచన బలపడుతుంది. అందుకే ఇవి మీ దగ్గర లేకుండా జాగ్రత్తపడాలి. పిల్లలైతే ప్రత్యేకంగా పరిశీలించాలి.
మీ ఈ అలవాటును కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఓపికగా పంచుకోండి. వారు మిమ్మల్ని నెమ్మదిగా మంచి మార్గానికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒంటరిగా ఈ సమస్యను ఎదుర్కొనాల్సిన అవసరం లేదు.
పైన చెప్పిన మార్గాల్లో ఎలాంటి మార్పు కనిపించకపోతే డాక్టర్లను సంప్రదించండి. వారు పోషక లోపాలను పరీక్షించి అవసరమైన మందులు, చికిత్సలు సూచించగలరు. సమయానికి వైద్యం తీసుకోవడం వల్ల దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు.