ఇంట్లోనే పుదీనా మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు..! ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇంట్లో తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో పుదీనా మొక్కను పెంచుకోవడం చాలా సులభం. మంచి వాసనతో పాటు ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క కిచెన్ గార్డెనింగ్ కోసం అద్భుతమైన ఎంపిక. కుండీలో చిన్న కొమ్మ నుంచి మొదలుపెట్టి నిత్యం ఆకుపచ్చ ఆకులు పొందొచ్చు.

పుదీనా మొక్క తేలికగా పెరిగే ఔషధ మొక్కలలో ఒకటి. దీని ఆకుల నుంచి వచ్చే తీయటి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి కూడా వంటకాలకు బాగా వచ్చేస్తుంది. పుదీనాను పెంచడం చాలా తేలిక. మామూలు కుండీ ఉంటే చాలు.. ఇంట్లో ఎప్పుడైనా తాజా ఆకులు తీయొచ్చు. మరి దీన్ని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాను విత్తనాల ద్వారా కాకుండా ఇప్పటికే పెరిగిన మొక్క నుంచి ఒక చిన్న కొమ్మ తీసుకుని నాటడం చాలా సులభం. మొదట సారవంతమైన నేల మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మంచి మట్టి తీసుకుని.. అది తడిగా ఉండేలా కొంచెం నీరు చల్లి తడిపి అందులో ఆ కొమ్మను నాటాలి. కొమ్మలో రెండు మూడు ముదురు ఆకులు ఉండేలా చూసుకోవాలి.
పుదీనా మొక్క వేగంగా పెరగాలంటే మట్టిలో కొంత మార్పు చేసుకోవాలి. తడిగా ఉన్న రెడ్ సాయిల్‌తో పాటు కొద్దిగా ఇసుక, కోకో పీట్ లేదా కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు లేదా జివామృతం కలిపి ఒక సేంద్రీయ మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమం వల్ల వేర్లు బలంగా పెరిగి మొక్క చక్కగా ఎదుగుతుంది.
కొమ్మను నాటి కొన్ని రోజులు నీడలో ఉంచాలి. ఇది మొక్కలో వేర్లు రావడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి రోజూ మట్టి పొడిగా అనిపించినప్పుడు కొద్దిగా నీరు చల్లడం అవసరం. తడిగా ఉండేలా.. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే వేర్లు పాడవుతాయి.
కొద్ది రోజుల్లో మొక్క ఎదిగి చిన్న చిన్న ఆకులు వస్తే అది ఆరోగ్యంగా ఎదుగుతున్న సూచన. అప్పుడు కుండీ చిన్నగా అనిపిస్తే.. పెద్ద కుండీలోకి మార్చండి. మీరు వాడుతున్న కుండీనే బాగుంటే దానికి వెలుతురు పడేలా ఉంచండి. పుదీనా మొక్క నేలపై పాకే స్వభావం కలది కాబట్టి ఆ స్పేస్ ఇచ్చేలా చూసుకోవాలి.
పుదీనా ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు కొన్ని సార్లు పశువుల ఎరువు, వేరుశెనగ పిండి వంటి సహజ ఎరువులు వేయాలి. ఇవి మొక్క ఎదుగుదలకు సహకరిస్తాయి. అవసరమైతే తక్కువ మోతాదులో వర్మీ కంపోస్ట్ కూడా వాడవచ్చు. ఇది ఆకులకు ఆకర్షణీయమైన రంగును, రుచిని కలిగిస్తుంది.
ఇంట్లో తక్కువ ఖర్చుతో ఇలా పుదీనాను పెంచుకోవచ్చు. కాస్త సహనం, కాస్త క్రమం పాటిస్తే.. రోజు వంటల్లోనూ, ఆరోగ్యపరంగా ఉపయోగించేలా ఈ మొక్క మన ఇంట్లో సజీవంగా పెరుగుతుంది. ముసురుగా ఉండే కాలాల్లోనూ ఈ మొక్క బాగా పెరుగుతుంది.
