మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..? అసలు నిజాలు తెలుసుకోండి..
ఆహారం లేకపోయినా మనిషి కొన్ని వారాల పాటు బతికేయగలడు కానీ.. అసలు నిద్ర లేకుండా ఎన్ని రోజులు జీవించగలడో తెలుసా? ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతేనే మరుసటి రోజు నరకంలా అనిపిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 18 రోజులకు పైగా అస్సలు నిద్రపోకుండా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత అతని శరీరంలో జరిగిన మార్పులు చూసి గిన్నిస్ సంస్థనే భయపడింది.

నిద్ర అనేది మన శరీరానికి, మెదడుకు రీఛార్జ్ లాంటిది. ఒక్క రోజు సరిగ్గా నిద్ర లేకపోయినా మరుసటి రోజు రోజంతా చిరాకుగా, అలసటగా అనిపిస్తుంది. మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. అయితే అసలు ఒక మనిషి నిద్ర లేకుండా నిరంతరాయంగా ఎంతకాలం మేల్కొని ఉండగలడు? అనే ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. మనిషి ఆహారం లేకుండా కొన్ని వారాలు బతకగలడు కానీ, నిద్ర లేకుండా ఎంతకాలం జీవించగలడు అనే దానికి ఏ పరిశోధనా ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేకపోయింది. కానీ దీనికి సంబంధించి ఒక షాకింగ్ గిన్నిస్ రికార్డ్ ఉంది.
గిన్నిస్ రికార్డ్.. ఆ తర్వాత నిషేధం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. నిద్ర లేకుండా అత్యధిక కాలం మేల్కొని ఉన్న రికార్డు రాబర్ట్ మెక్‌డొనాల్డ్ పేరిట నమోదైంది. అతడు ఏకంగా 18 రోజులు, 21 గంటల, 40 నిమిషాల పాటు (దాదాపు 19 రోజులు) నిద్ర పోకుండా ఉన్నాడు. అయితే ఈ సుదీర్ఘ కాలం నిద్ర లేకపోవడం వల్ల రాబర్ట్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. అతని మానసిక స్థితి ఘోరంగా దెబ్బతింది. ఈ ప్రయోగం ప్రాణాంతకమని గ్రహించిన గిన్నిస్ సంస్థ, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పిచ్చి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని1997లోనే ఈ నిద్ర లేమి కేటగిరీని తన రికార్డుల నుండి పూర్తిగా తొలగించి, నిషేధించింది.
అసలు నిద్ర లేకపోతే శరీరంలో ఏం జరుగుతుంది?
ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ఆరోగ్య వెబ్‌సైట్, వైద్య నిపుణుల ప్రకారం, నిద్ర లేకపోవడం వల్ల ఏ వయస్సు వారికైనా తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఎదురవుతాయి.
24 గంటలు నిద్ర లేకపోతే: సాధారణంగా ఒక రోజు నిద్ర లేకపోతే ఆవలించడం, నీరసం, కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ తగ్గడం వంటివి జరుగుతాయి.
36 నుండి 48 గంటలు దాటితే: మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ స్థితిలో డ్రైవింగ్ చేయడం లేదా మిషన్లపై పనిచేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం 10 రెట్లు పెరుగుతుంది. ఆలోచనా సామర్థ్యం తగ్గి, తీవ్రమైన కోపం, చిరాకు వస్తాయి. రోగనిరోధక శక్తి పడిపోతుంది.
దీర్ఘకాలిక రోగాలు: ఎవరైతే రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటారో, వారికి భవిష్యత్తులో హైబీపీ, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అలాగే శారీరక సమతుల్యత క్షీణించి, హార్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
గాఢ నిద్ర కోసం వైద్యులు సూచించే 6 గోల్డెన్ టిప్స్
మీరు కూడా రాత్రి పూట నిద్రలేమితో బాధపడుతుంటే, మీ స్లీప్ సైకిల్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
ఫిక్స్డ్ టైమింగ్స్: ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోండి. వీకెండ్స్‌లో కూడా దీన్ని మార్చకండి.
నో గ్యాడ్జెట్స్ జోన్: పడుకునే గదిలో టీవీ, కంప్యూటర్, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను దూరంగా ఉంచండి. బెడ్‌పైకి వెళ్లడానికి కనీసం 30 నిమిషాల ముందే మొబైల్ చూడటం ఆపేయాలి.
బెడ్‌రూమ్ వాతావరణం: పడుకునే గది నిశబ్దంగా, చీకటిగా, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోండి.
లైట్ డిన్నర్: పడుకునే ముందు హెవీ ఫుడ్స్ తినకూడదు. అలాగే రాత్రి పూట కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
పొగాకు వద్దు: పడుకునే ముందు సిగరెట్లు కాల్చడం లేదా పొగాకు నమలడం వల్ల అందులోని నికోటిన్ మెదడును అలర్ట్ చేస్తుంది, దీనివల్ల నిద్ర రాదు.
రెగ్యులర్ వ్యాయామం: పగటిపూట ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రాత్రికి శరీరం అలసిపోయి సహజంగానే గాఢ నిద్ర పడుతుంది.
