మీ పిల్లలు ఎదగాలంటే హాస్టల్ కు వెళ్లే ముందు ఈ మాటలు చెప్పడం మర్చిపోకండి
పిల్లలు చదువు కోసం హాస్టల్‌కి వెళ్లే సమయం తల్లిదండ్రులకు కొంత భావోద్వేగం కలిగించే క్షణం. ముఖ్యంగా తొలిసారి ఇలాంటిదై ఉంటే వారిని మనస్ఫూర్తిగా సిద్ధం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇలాంటి తరుణంలో పిల్లలకు మనం కొన్ని జీవితపాఠాలు ముందుగానే నేర్పితే వారు స్వతంత్రంగా జీవించడానికి సిద్ధమవుతారు. వ్యక్తిత్వ వికాసానికి తోడుగా, మానసిక బలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

హాస్టల్‌కి వెళ్లిన తర్వాత పిల్లలు కొత్త విషయాలను అనుభవిస్తారు. కొత్తస్నేహితులు, కొత్త షెడ్యూల్, కొత్త ఆచారాలు.. ఇవన్నీ వారికి తొలుత భయంగా అనిపించవచ్చు. అయితే తల్లిదండ్రులుగా మనం వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. తప్పులు చేసినప్పుడు భయపడవద్దని బదులుగా వాటిని ఒక మంచి పాఠం నేర్చుకునే అవకాశంగా చూడాలని పిల్లలకు చెప్పాలి. ఇది వారి భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసే అలవాటు ఉంటే.. అవే పనులు హాస్టల్ లోనూ తమ పనుల్ని తామే చూసుకునే తత్వంగా మారుతుంది. ఉదాహరణకి.. తమ రూమ్‌ను శుభ్రంగా ఉంచడం, టైం మేనేజ్‌మెంట్, దుస్తులు ఉతకడం వంటి బాధ్యతలు. ఈ సింపుల్ అలవాట్లు వారి వ్యక్తిత్వాన్ని బలంగా తీర్చిదిద్దతాయి.
తల్లిదండ్రులుగా మనం పిల్లలకు అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసేసే బదులు.. నీకు ఏది మంచిదో ఆలోచించి అదే ఎంచుకో అని ప్రోత్సహించాలి. దీనివల్ల వారు ఏ పరిస్థితినైనా విశ్లేషించగల సామర్థ్యాన్ని పొందుతారు. హాస్టల్ వాతావరణంలో వారు ఏ ఒక్క సమస్య వచ్చినా ముందే ఆలోచించి సరైన దిశలో అడుగు వేయగలుగుతారు.
పిల్లలు తప్పులు చేయడం సహజం. తల్లిదండ్రులుగా మనం వాటిని ఎప్పటికీ తప్పుగా చూడకుండా వాటి నుంచి ఎలా నేర్చుకోవాలో చూపించాలి. తప్పు చేసావా ఒకే ఇప్పుడు దాని నుంచి ఏం నేర్చుకున్నావు..? అని ప్రశ్నించాలి. పిల్లలు తప్పులు చేసినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా, దానికి బాధపడకుండా అంగీకరించి అందులోంచి పాఠాలు నేర్చుకుని ముందుకు ఎలా వెళ్లాలో నేర్పితే వారిలో సానుకూలంగా ఆలోచించే శక్తి, ధైర్యం పెరుగుతుంది.
హాస్టల్‌లో పిల్లలు అనేక రకాల వ్యక్తుల్ని కలుస్తారు. అందరిలోనూ వేర్వేరు ఆలోచనా విధానాలు ఉంటాయి. కొందరి ప్రవర్తన అంగీకరించనప్పటికీ వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. వేరే వ్యక్తుల ఆలోచనలను నిందించకుండా వాటిని అర్థం చేసుకోవాలనే కోణంలో చూడాలి అని పిల్లలకు నేర్పాలి. ఇది వారికి మంచి సామాజిక సంబంధాలను పెంచుకునే సామర్థ్యం ఇస్తుంది.
పిల్లలను మన కంటికి కనిపించని ప్లేస్ కి పంపేటప్పుడు కేవలం ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి కొత్త అనుభవాన్ని ధైర్యంగా స్వీకరించాలన్న ఉద్దేశంతో వారు స్వతంత్రంగా ముందుకు సాగేందుకు వీలుగా ఈ విలువలు వారికి నేర్పాలి. అప్పుడు మాత్రమే వారు తమ లక్ష్యాలను స్వతంత్రంగా చేరుకునే మార్గంలో బలంగా నిలబడగలరు.
ఇలాంటి జీవితపాఠాలు పిల్లలను నిశ్చయంగా ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. చదువు మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాల లోనూ వారు సుస్థిరంగా ఎదుగుతారు. హాస్టల్ జీవితం ప్రారంభించే ముందు ఈ పాఠాలు తప్పక నేర్పించండి.
