రెండేళ్లుగా నీళ్లు తాగని మహిళ.. ఆమె చెప్పిన కారణం తెలిస్తే అవాక్కవడం పక్కా..
యూకే ఇన్‌ఫ్లుయెన్సర్ విక్టోరియా ఎవరెస్ట్ తాను రెండేళ్లుగా నీళ్లు తాగకుండా, కేవలం పండ్ల రసాలతోనే జీవిస్తున్నానని ప్రకటించింది. నీటికి బదులు పండ్లు, కూరగాయల రసాలు మెరుగైన హైడ్రేషన్ ఇస్తాయని వాదిస్తూ దీన్ని వ్యాపారంగా మార్చింది. ఆమె చెప్పింది నిజమేనా..? 2 ఏళ్లు నీళ్లు తాగకపోతే ఆరోగ్యంగా బతకగలరా..? నిపుణులు ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎంతో ముఖ్యం. నీళ్లు లేకపోతే మనిషి బతకడం కష్టం. డాక్టర్లు సైతం నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు. యూకే ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్టోరియా ఎవరెస్ట్ అనే మహిళ తాను గత రెండు సంవత్సరాలుగా నీరు తాగడం లేదని, అయినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. ఆమె ప్రకటన అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నీరు తాగకుండా ఎలా జీవిస్తోంది?
ఆరోగ్య సంబంధిత వీడియోల చేస్తూ బాడీ-కోచ్‌గా చెప్పుకునే విక్టోరియా.. నీటికి బదులుగా పండ్లు, కూరగాయల రసాలు మాత్రమే తీసుకుంటున్నట్లు వివరించింది. ‘‘మనం తాగే నీరు నిర్జీవమైన H₂O. కానీ పండ్లు, కూరగాయలలోని నీటికే జీవం ఉంటుంది. దీనిని నేను H₃O₂ అని పిలుస్తాను. నేను తాగేది ఈ జీవంతో కూడిన నీటినే’’ అని ఆమె తెలిపింది. ఆమె అభిప్రాయం ప్రకారం.. పండ్లు, కూరగాయల రసాలలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రసాలు శరీరానికి బాటిల్ వాటర్ కంటే ఎక్కువ హైడ్రేషన్‌ను అందిస్తాయి. బాటిల్ వాటర్‌లో టాక్సిన్స్, మైక్రోప్లాస్టిక్‌లు ఉండే అవకాశం ఉందని, అయితే రసాలు తాగడం వల్ల తన చర్మం ప్రకాశవంతంగా ఉందని, జీర్ణక్రియ సాఫీగా ఉందని, శక్తి స్థాయి తగ్గలేదని విక్టోరియా తెలిపింది.
వ్యాపారం మొదలుపెట్టి..
విక్టోరియా ఈ పద్ధతిని కేవలం వ్యక్తిగత జీవనశైలిగా ఉంచకుండా దీనిని ఒక వ్యాపారంగా మార్చింది. ఆమె తన అనుచరుల కోసం దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఫీజు వసూలు చేస్తోంది. భారతీయ కరెన్సీలో.. ఆమె ఈ సేవలకు గానూ సుమారు రూ. 11,600 వరకు ఫీజు తీసుకుంటుంది. ఈ కోచింగ్‌లో రోజంతా ఏ రసం, ఎప్పుడు, ఎంత పరిమాణంలో తాగాలో ఆమె సిఫార్సు చేస్తుంది.
వైద్య నిపుణుల హెచ్చరిక
సరైన వైద్య మార్గదర్శకత్వం లేకుండా నీటికి బదులుగా కేవలం రసాలు లేదా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాలలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. నీటిని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల శరీరంలో అవసరమైన ద్రవాలు, ఖనిజాల సమతుల్యత దెబ్బతిని, కిడ్నీలు, ఇతర అవయవాలపై తీవ్రమైన భారం పడే ప్రమాదం ఉంది. వైద్యులు ఎప్పుడూ సాధారణ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను నొక్కి చెబుతారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








