AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చారిత్రక రాజభవనంలో పుతిన్-మోదీ చర్చలు..హైదరాబాద్‌తో ఈ ప్యాలెస్‌కు ఉన్న లింక్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మోదీ - పుతిన్ మధ్య చర్చలు ఓ చారిత్రక భవనంలో జరగనున్నాయి. ఒకప్పుడు ఈ ప్యాలెస్... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక రాజు ఆశయం నుండి పుట్టింది. కోట్ల విలువైన సంపద, అపారమైన దర్పానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ రాజభవనం. ఇప్పుడు రాజరికాన్ని దాటి, ప్రపంచ దౌత్యానికి కేంద్రంగా మారింది.

చారిత్రక రాజభవనంలో పుతిన్-మోదీ చర్చలు..హైదరాబాద్‌తో ఈ ప్యాలెస్‌కు ఉన్న లింక్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
History Of Hyderabad House
Krishna S
|

Updated on: Dec 04, 2025 | 3:59 PM

Share

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. రెండు రోజుల పాటు ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్నారు. ఇక ఈ చర్చలు హైదరాబాద్ హౌస్ వేదికగా జరనున్నాయి. ఈ హౌస్ ప్రత్యేకతలు, దేశాధినేతలు వచ్చినప్పుడు ఇక్కడే చర్చలు ఎందుకు జరపుతారు అనేది తెలుసుకుందాం..

ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్.. ప్రపంచ నేతలు, రాయబారులు సమావేశమయ్యే ఒక కీలక దౌత్య కేంద్రం. కానీ ఈ భవనం వెనుక, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అపారమైన సంపద, అంతులేని ఆకాంక్షల చరిత్ర దాగి ఉంది. బ్రిటిష్ వారు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు కొత్త రాజధానిలో తమ రాజ్యాలకు ప్రత్యేక సంతకం ఉండాలని రాచరిక పాలకులు కోరుకున్నారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కేవలం కొంత భూమిని కోరుకోలేదు. ఆయన ఏకంగా ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ పక్కనే ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతంలో స్థలం కావాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించని బ్రిటిష్ ప్రభుత్వం, కింగ్స్ వే (ఇప్పటి రాజ్‌పథ్) చివర, కింగ్ జార్జ్ V విగ్రహం చుట్టూ కేవలం ఐదు రాచరిక రాష్ట్రాలకు మాత్రమే భూమిని కేటాయించింది. హైదరాబాద్, బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ పాలకులు భూమిరని పొందారు.

నిజాం, బరోడా రాజు తమ ప్యాలెస్‌ల నిర్మాణ బాధ్యతను ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియెన్స్‌కు అప్పగించారు. హైదరాబాద్ హౌస్‌ను రాష్ట్రపతి భవన్‌లాగా గొప్పగా ఉండేలా నిర్మించాలని లుటియెన్స్‌ను ఆదేశించారు. అయితే అన్ని రాజభవనాల రూపకల్పనను ప్రభుత్వం ఆమోదించాలనే షరతు కారణంగా అది సాధ్యం కాలేదు. 8.2 ఎకరాల స్థలంలో లుటియెన్స్ హైదరాబాద్ హౌస్‌ను ఒక ప్రత్యేకమైన సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించారు. దాని రెక్కలు పక్క రోడ్లతో కలిసిపోయేలా కట్టారు. అందుకే న్యూఢిల్లీలోని అన్ని రాజభవనాలలో ఇది అత్యంత గొప్పదిగా నిలిచింది. 1920లలో సుమారు 200,000 పౌండ్ల (ప్రస్తుత విలువ రూ. 170 కోట్లు) అద్భుతమైన ఖర్చుతో దీనిని నిర్మించారు. నిజాం దీని నిర్మాణంలో వైభవం తగ్గకుండా చూసుకున్నారు. ఇందులో 36 గదులు, ఆరు టైల్డ్ బాత్రూములు, ప్రాంగణాలు, తోరణాలు, అద్భుతమైన మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు ఉన్నాయి. లుటియెన్స్ వైస్రాయ్ హౌస్ నుండి కేవలం మధ్యలో ఒక గోపురం డిజైన్‌ను మాత్రమే తీసుకున్నారు. ఈ ప్యాలెస్‌లో మహిళల కోసం 12-15 గదులతో కూడిన ఒక అంతపురం కూడా ఉండేది.

స్వాతంత్య్రం తర్వాత మారిన విధి

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1948లో ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. నిజాం అరుదుగా ఉపయోగించిన ఈ హైదరాబాద్ హౌస్ క్రమంగా భారత ప్రభుత్వ ఆస్తిగా మారింది. 1974లో విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చింది. అశోక్ రోడ్‌లో ఉన్న ఈ భవనం ఆ తర్వాత ప్రధానమంత్రి అతిథి గృహంగా మారింది. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యు బుష్, గోర్డాన్ బ్రౌన్, వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నాయకులకు ఇది ఆతిథ్యం ఇచ్చింది.

ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి తాత్కాలిక విడిదిగా ఉన్న హైదరాబాద్ హౌస్, ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల సమావేశాలకు, భారతదేశ దౌత్య సంబంధాలకు ముఖ్య వేదికగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం తన పర్యటనలో ఈ చారిత్రక భవనాన్ని సందర్శించనున్నారు. ఇక్కడే మోదీ – పుతిన్ చర్చలు సాగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..