Andhra Pradesh: ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 99శాతం పనులు పూర్తి.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే శాఖ..
అమృత్ భారత్ స్కీమ్ కింద కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సరికొత్త కొత్త హంగులను సంతరించుకుంది. ఇప్పటికే 99శాతం అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రారంభానికి సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్ధం అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. గతంలోనే ఈ స్టేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటకీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ స్టేషన్‌కు సంబంధించి రైల్వే శాఖ వీడియో ట్వీట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ. 21.13 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పనుల తర్వాత స్టేషన్ పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది. అతిత్వరలోనే ఈ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 99శాతం పనులు కంప్లీట్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది.
నిధుల ఆలస్యం కారణంగా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ 2024 నుంచి పనులు వేగవంతం కావడంతో కాకినాడ టౌన్ స్టేషన్ ఇప్పుడు అద్భుతంగా మారింది. ప్లాట్‌ఫాంలను టైల్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. పాత కుర్చీలను తొలగించి, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త స్టీల్ కుర్చీలను ఏర్పాటు చేశారు. రైల్వే స్థలాన్ని విశాలంగా మార్చి, ట్రాక్‌ల మధ్య స్టీల్ డివైడర్‌ను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాన్ని కొత్తగా నిర్మించారు. స్టేషన్ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటారు. స్టేషన్ లోపలికి, బయటికి వెళ్లే దారులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యంగా..
ఈ ఆధునీకరణలో ప్రయాణికుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. స్టీల్ తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. పాత మరుగుదొడ్లకు బదులు కొత్తవి నిర్మించడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. సాధారణ, ఏసీ విశ్రాంతి గదులను సిద్ధం చేశారు. రైళ్ల రాకపోకల సమాచారం కోసం ప్లాట్‌ఫాంలలో డిజిటల్ సిస్టంను అమర్చారు.వికలాంగులు, అలాగే ట్రాలీ బ్యాగులు తీసుకెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు.
చరిత్రను గుర్తుచేస్తూ..
స్టేషన్ గోడలపై స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు చిత్రించడంతో ఈ స్టేషన్‌కు కొత్త కళ వచ్చింది. పూర్తిగా కొత్త లుక్‌లో, మెరుగైన వసతులతో అందుబాటులోకి వస్తున్న ఈ స్టేషన్‌ను చూసి ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ పథకం ద్వారా కాకినాడ టౌన్ స్టేషన్ ఆధునిక హబ్‌గా మారనుంది.
Kakinada Town Station, Andhra Pradesh — 99% complete and gearing up to flex BIG!!#AmritStation pic.twitter.com/QLhAAXWwVe
— Ministry of Railways (@RailMinIndia) December 4, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
