AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Dum Biryani: పండగల స్పెషల్: టమాటో దమ్ బిర్యానీ ఇలా చేస్తే నాన్వెజ్ మర్చిపోతారు..

టమాటాలతో పచ్చళ్లు, చట్నీలు, కూరలు, కుర్మాలు వండి విసిగిపోయారా.. అయితే ఈ సారి కొత్తగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. స్పైసీనెస్ ఇష్టపడే వారికి ఇది చక్కటి విందు. ఇక పండగల వేళ ఏం స్పెషల్ వండాలో తెలియక ఇబ్బంది పడుతున్నవారు కూడా దీన్ని ఈజీగా వండి సర్వ్ చేసేయొచ్చు. ఇంత సింపుల్ రెసిపీని టేస్టీగా వండే టిప్స్ ఇవి..

Tomato Dum Biryani: పండగల స్పెషల్: టమాటో దమ్ బిర్యానీ ఇలా చేస్తే నాన్వెజ్ మర్చిపోతారు..
Tomato Dum Biryani
Bhavani
|

Updated on: Mar 29, 2025 | 4:03 PM

Share

బిర్యానీ అంటేనే ఆహార ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఆ సువాసనలకే సగం కడుపు నిండిపోతుంటుంది. కానీ, పండగలప్పుడు నాన్వెజ్ కాకుండా వెజిటేరియన్ లో ఏం వండాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎప్పుడూ చికెన్, మటన్ తోనే కాకుండా ఇలా ఓసారి టమాటాలతో దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. మాంసాహారం లేకుండా ముద్ద దిగని వారు కూడా ఆవురావురుమంటూ తినేస్తారు. మరి టమాటా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.

అవసరమైన పదార్థాలు:

– బాస్మతి బియ్యం – 2 కప్పులు – టమాటాలు – 8 (4 ప్యూరీ కోసం, 4 ముక్కలుగా కట్ చేయడానికి) – అల్లం – చిన్న ముక్క (సన్నగా తరిగినది) – వెల్లుల్లి – 10 రెబ్బలు – నూనె – 2 టేబుల్ స్పూన్లు – నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు – ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి) – కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు – ధనియాల పొడి – 1 టీస్పూన్ – పసుపు – చిటికెడు – జీలకర్ర పొడి – అర టీస్పూన్ – గరం మసాలా – అర టీస్పూన్ – కొత్తిమీర, పుదీనా – కొద్దిగా (తరిగినవి) – పెరుగు – 2 టేబుల్ స్పూన్లు – కుంకుమ పువ్వు నీరు – కొద్దిగా

బియ్యం ఉడకబెట్టడానికి మరియు దమ్ కోసం మసాలా దినుసులు (రెండు సార్లు ఉపయోగించాలి):

– బిర్యానీ ఆకు – 1 – దాల్చిన చెక్క – చిన్న ముక్క – మిరియాలు – 5 – షాజీరా – 1 టీస్పూన్ – లవంగాలు – 3 – యాలకులు – 3 – మరాఠి మొగ్గ – 2 – జాపత్రి – కొద్దిగా

తయారీ విధానం:

1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీటిలో అరగంట పాటు నానబెట్టండి. 2. ఒక పెద్ద పాత్రలో 4 గ్లాసుల నీరు పోసి స్టవ్ మీద వేడి చేయండి. నీరు మరిగిన తర్వాత 4 టమాటాలను వేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. 3. ఉడికిన టమాటాలను తీసి చల్లారిన తర్వాత పొట్టు తొలగించి, మిక్సీలో వేయండి. అల్లం, వెల్లుల్లిని కూడా జోడించి మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీ తయారు చేయండి. 4. అదే నీటిలో బియ్యం ఉడకబెట్టడానికి మసాలా దినుసులు, కొద్దిగా ఉప్పు వేసి మరిగించండి. నానబెట్టిన బియ్యాన్ని వేసి 80% ఉడికే వరకు వండి, ఆపై జల్లెడ గరిటెతో నీరు వడకట్టి పక్కన పెట్టండి. 5. ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. సగం ఉల్లిపాయలను పక్కన పెట్టండి. 6. మిగిలిన ఉల్లిపాయలతో మసాలా దినుసులు వేసి కలపండి. ఆపై టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు వేసి ఒక నిమిషం ఆగండి. 7. తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి మీడియం మంటపై మసాలా టమాటాలకు బాగా అంటేలా కలపండి. 8. ఉడికించిన బియ్యాన్ని ఈ మిశ్రమంపై వేసి, పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు నీరు చల్లండి. మూత పెట్టి సన్నని మంటపై 10 నిమిషాలు దమ్ చేయండి. 9. స్టవ్ ఆపేసి, వేడిగా సర్వ్ చేయండి. ఇలా చేస్తే సుగంధభరితమైన టమాటా దమ్ బిర్యానీ సిద్ధం!

ఈ సులభమైన రెసిపీతో ఇంట్లోనే రుచికరమైన టమాటా బిర్యానీ తయారు చేసి ఆస్వాదించండి!