నువ్వుల పాలు ఎప్పుడైనా తాగారా..? ఇవి మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
మనలో చాలా మందికి సోయా పాలు, బాదం పాల గురించి తెలుసు. కానీ నువ్వులతో చేసే పాల గురించి తెలుసా..? అవేనండి సీసేమ్ సీడ్స్ తో చేసే పాల గురించి తెలుసా..? కొంతమందికి తెలిసి ఉంటుంది. కొందరికి తెలియదు. తెలియని వారి కోసమే ఈ రెసిపీ.

సోయా పాలు, బాదం పాలు గురించి ఎవ్వరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. కానీ నువ్వులతో చేసే పాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మాములుగా అయితే నువ్వులతో నూనెను తీస్తారు. అలాగే లడ్డు, పలు రకాల స్వీట్లు తయారు చేస్తారు. కానీ నువ్వులతో పాలు కూడా తయారు చేయవచ్చు. ఈ పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో సాధారణ పాల కంటే ఎక్కువ ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్టిగా ఉంటాయి. నువ్వులతో చేసే పాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- తెల్ల నువ్వులు – 1 కప్పు
- వాటర్ – 1/2 కప్పు
- వెన్నల పౌడర్ – 3 స్పూన్లు
- తేనె – 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా తెల్ల నువ్వులను ఒక గిన్నెలో వేసి బాగా కడిగి వాటర్ పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత నువ్వులను మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలను వేరు చేసి కొంచం వెన్నల పౌడర్, తేనె వేసి బాగా కలపాలి. అంతే నువ్వుల పాలు సిద్దం అయ్యాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
- నువ్వుల పాలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.
- ఈ పాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
- వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- ఈ పాలు మంచి కొలెస్ట్రాల్ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
- చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను అందించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పైగా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
- దీంట్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలపరుస్తాయి.
- షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.