Bread Halwa: బ్రెడ్ ముక్కలతో ఇలా స్వీట్ చేస్తే నిమిషాల్లో ప్లేట్లు ఖాళీ! కొత్త ఏడాదికి అదిరిపోయే ట్రీట్!
పెళ్లిళ్లలో వడ్డించే స్వీట్లలో 'బ్రెడ్ హల్వా'కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రీమీ టెక్స్చర్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ క్రంచీ రుచి ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో మీ కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం పది నిమిషాల్లోనే అద్భుతమైన స్వీట్ సిద్ధం చేయాలనుకుంటే బ్రెడ్ హల్వా బెస్ట్ ఆప్షన్. వంట రాని వారు సైతం ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీ వివరాలు మీకోసం.

న్యూ ఇయర్ పార్టీ అంటేనే ఘుమఘుమలాడే వంటకాలు. ఆ విందు ముగింపులో తీపి రుచి లేకపోతే అది అసంపూర్ణమే. అప్పటికప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతో మౌత్ వాటరింగ్ స్వీట్ చేయాలంటే బ్రెడ్ హల్వాను మించినది లేదు. జ్యూసీగా, తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉండే ఈ వెడ్డింగ్ స్టైల్ బ్రెడ్ స్వీట్‌ను ఖచ్చితమైన కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు : 10
పంచదార : 1 కప్పు
కాచి చల్లార్చిన పాలు : పావు కప్పు
నెయ్యి : 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు : 10
కిస్ మిస్ : 15
బాదం పలుకులు : 8
పిస్తా పలుకులు : 8
నీళ్లు : 1 కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
బ్రెడ్ స్లైసులకు చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ అంచులను కట్ చేయాలి. ఒక్కో స్లైసును ఆరు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో నూనె పోసి మీడియం ఫ్లేమ్ మీద బ్రెడ్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. మంట మరీ తక్కువైతే బ్రెడ్ నూనెను పీల్చుకుంటుంది, ఎక్కువైతే మాడిపోతుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వేరే కడాయిలో పంచదార, నీళ్లు పోసి కరిగించాలి. తీగ పాకం రానక్కర్లేదు కానీ, వేళ్లతో తాకితే కాస్త జిగురుగా అతుక్కునేలా ఉడికించాలి.
పాకం సిద్ధమైన తర్వాత మంట తగ్గించి వేయించిన బ్రెడ్ ముక్కలను అందులో వేయాలి. ముక్కలు పాకాన్ని పూర్తిగా పీల్చుకున్న తర్వాత వాటిని కాస్త మెత్తగా మ్యాష్ చేయాలి.
ఇప్పుడు పావు కప్పు పాలు పోసి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ చల్లుకుని దించేయాలి.
